సినిమాల కోసం అవసరమైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా.. సురేష్ గోపీ

సినిమా నటులు రాజకీయాలలోకి రావడం అరుదేం కాదు. అయితే రాజకీయ నాయకుడిగా మారిన నటుడు తనకు రాజకీయాల కంటే సినిమాలే ముఖ్యం అంటూ యూటర్న్ తీసుకోవడం చాలా చాలా అరుదు. అందులోనూ సినిమాల కోసం అవసరమైతే కేంద్ర మంత్రి పదవిని  కూడా వదులుకోవడానికి సిద్ధం అనడం అంటే.. అది అసలు ఊహకు కూడా అందని విషయం.  అలాంటి ఊహకందని వ్యాఖ్యలు చేశారు ప్రముఖ మలయాళ నటుడు, కేంద్రపెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ. రాజకీయాలలో ఉండటం, కేంద్ర మంత్రిగా పదవిలో ఉండటం తనకేమీ సంతృప్తి ఇవ్వడం లేదన్నారు సురేష్ గోపీ. సినీ కెరీర్ ను వదిలిపెట్టి రాజకీయాలలోకి రావాలని కానీ, కేంద్ర మంత్రి కావాలని కానీ తాను ఎన్నడూ అనుకోలేదని సురేష్ గోపీ చెప్పుకొచ్చారు. అయినా రాజకీయాలలోకివచ్చి కేంద్ర మంత్రిని అయ్యాననీ, కానీ అప్పటి నుంచీ తనకు చేతిలో డబ్బులు ఆడటంలేదనీ, ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్బుల కోసం మళ్లీ సినిమాలలో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాను సినిమాలలో నటించడానికి కేంద్ర మంత్రి పదవి అడ్డంకి అయితే.. ఆ పదవిని తృణ ప్రాయంగా త్యజిస్తానని చెప్పారు. అదే జరిగి ఒక వేళ తానురాజీనామా చేస్తే.. తాను వదిలేసే మంత్రి పదవిని తన రాష్ట్రానికే చెందిన అంటే కేరళకు చెంది రాజ్యసభ సభ్యుడు సదానంద్ మాస్టర్ కు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు.  సినిమాల ద్వారా విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సురేష్ గోపీ ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో త్రిసూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి..  పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా కేంద్ర కేబినెట్ లో స్థానం పొందారు. అయితే రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ తన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. తన పిల్లలు ఇంకా సెటిల్ కాలేదనీ, ఈ పరిస్థితుల్లో తనకు ఆదాయం చాలా అవసరమన్న ఆయన.. అందుకోసం మళ్లీ సినిమాల్లో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు.  అందు కోసం అవసరమైతే  కేంద్ర మంత్రి పదవిని వదిలేయడానికైనా సిద్ధమన్నారు.  

తెలంగాణ తెలుగుదేశం.. చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి!?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని బలీయ శక్తి అనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో బలీయంగా ఉంది. అయినా కూడా ఆ రాష్ట్రంలో రాజకీయంగా పార్టీ కార్యకలాపాలేవీ పెద్దగా జరగడం లేదు. ఏమైనా సమావేశాలు జరిగినా, జరిపినాఅవి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కే పరిమితం అవుతున్నాయి తప్ప.. జనంలోకి పెద్దగా వెళ్లడం లేదు. అయినా.. పార్టీ రాజకీయంగా తెలంగాణలో క్రియాశీలంగా లేకపోయినా, పార్టీ క్యాడర్ మాత్రం తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన పిలుపు ఏదీ లేకపోవడంతో.. రాష్ట్ర విభజన తరువాత నుంచీ పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ కామ్ డౌన్ అయిపోయారు. ఎన్నికల సమయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు కోసం తెలుగుదేశం క్యాడర్ వైపు చూడటం ఆనవాయితీగా మారిపోయింది. ఆ సమయంలో కూడా తెలుగుదేశం కేడర్ కు అధినాయకత్వం నుంచి ఎటువంటి డైరెక్షన్ రాని పరిస్థితుల్లో.. కార్యకర్తలు ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వారంతట వారే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు.  సరే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవు అన్న సంగతి తెలిసిందే. అయితే కార్యకర్తల బలం మాత్రం ఇసుమంతైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇందుకు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే తార్కానం. అన్ని పార్టీలూ కూడా ఆ ఎన్నికలలో తెలుగుదేశం జెండా మోయడానికి పోటీలు పడడమే. తెలంగాణలో తెలుగుదేశం వెనుకబాటుకు కారణం  నాయకులు కరవవ్వడమే అన్న విషయంలో సందేహం లేదు. ఆ కారణంగానే రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం క్యాడర్ బలంతోనే తాము గెలిచామని చెప్పుకోవడానికి ఇసుమంతైనా సంకోచించరు.  అంతటి బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం తెలంగాణలో విస్తరించడానికి అన్ని అవకాశాలూ ఉన్నా నాయకత్వం మాత్రం ఆ దిశగా పెద్దగా దృష్టిపెట్టడం లేదన్న అసంతృప్తి ఇప్పుడు క్యాడర్ లో బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత.. తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకుంటుందని ఆశించిన క్యాడర్ ఇప్పుడు పార్టీ అధినాయత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థానిక ఎన్నికలలో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ క్యాడర్ అధిష్ఠానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నది. అసలు జూబ్లీ బైపోల్ లోనే తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టాలని క్యాడర్ డిమాండ్ చేసినప్పటికీ చంద్రబాబు బీజేపీతో పొత్తు కారణంగా ఉన్న పరిమితులను విడమర్చి చెప్పి సముదాయించారు.  అయితే స్థానిక ఎన్నికల విషయానికి వచ్చే సరికి అలా సముదాయించడం అంత తేలిక కాదన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది. 

కల్తీ మద్యానికి సురక్షా యాప్ తో చెక్.. చంద్రబాబు

ఏపీలో పెను దుమారం రేపిన కల్తీ మద్యం వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది.  అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడం.. ఆ తరువాత   తీగలాగితే డొంక కదిలిన చందంగా దీని వెనుక ఉన్న రాజకీయ లింకులు వెలుగులోకి వచ్చాయి. అలానే నిందితులు కూడా ఒకరి వెంట ఒకరు అఅన్నట్లుగా బయటపడ్డారు.  ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు.  ఈ వ్యవహారం ఇలా ఉండగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున నకిలీ మద్యం బయటపడింది. విషయమేంటంటే.. ములకలచెరువు కల్తీ మద్యం  వ్యవహారానికీ ఇబ్రహీంపట్నంలో బయటపడిన కల్తీ మద్యం బాటిళ్లకూ లింకు ఉండటంతో.. రాష్ట్రంలో అసలు నాణ్యమైన మద్యం దొరుకుతోందా.. తాము తాగేదంతా కల్తీ మద్యమేనా అన్న భయం మందుబాబుల్లో కలిగింది.  మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం గుట్టురట్టు చేసేందుకు ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. అదే సమయంలో మొత్తంగా కల్తీ మద్యానికి చెక్  పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం (అక్టోబర్ 12)న ఉండవల్లిలో మీడియా సమావేశంలో ప్రారంభించారు.  ఈ యాప్ సాయంతో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని చెప్పిన చంద్రబాబు వైసీపీ హయాం నుంచి తమ ప్రభుత్వానికి కల్తీ మద్యం వారసత్వంగా వచ్చిందన్నారు.  కల్తీ మద్యం  మద్యంపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన చంద్రబాబు న  కల్తీ మద్యం కేసులో రాజీ  ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.  మొత్తం  ప్రక్షాళన చేస్తామన్నారు. బెల్ట్‌ షాపుల బెల్ట్ తీస్తామన్నారు.   ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్  ద్వారా నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికడతామన్నారు. ఈ యాప్ ద్వారా బాటిళ్ల ట్రాకింగ్ ఈజీ అవుతుందన్నారు. కల్తీ మద్యం కేసు విషయంలో తమకు తనపర బేధం లేదన్న చంద్రబాబు.. దీనిలో ఎవరున్నా వదిలే ప్రశక్తే లేదని చెప్పారు.  2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని అన్నారు. గత పాలకులు అన్ని వాళ్ల సొంత బ్రాండ్లనే లీగల్ చేశారు, ట్రాన్స్‌పోర్ట్ కూడా సొంత వాళ్లకు ఇచ్చారు, ఇల్లీగల్ నేర సామ్రాజ్యం ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పుడు దానిని పూర్తిగా కంట్రోల్లో పెట్టామని, రాష్ట్రంలో బెస్ట్ మద్యం పాలసీ తెచ్చామని సీఎం చెప్పారు. ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి పూర్తిగా చెక్ పెడతామని చెప్పారు. 

బీహార్ మొగ్గు ఎవరి వైపు?.. సర్వే చెబుతున్నదేంటంటే?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్డీయే, ఇండియా కూటములు ఈ ఎన్నికలలో హోరాహోరీ తలపడుతున్నాయి. రెండు కూటములూ కూడా సీట్ల సర్దుబాటు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ మల్లగుల్లాలు పడ్డాయి. అసంతృప్తులు, ఆగ్రహజ్వాలలతో రెండు కూటములూ ఇబ్బందులు పడ్డాయి.  అభ్యర్థుల ఎంపిక విషయంలో రెండు కూటములూ కూడా ఇంకా చర్చోపచర్చలు జరుపుతూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఊగాహాన సభలు జోరుగా సాగుతున్నాయి.  సరే అవన్నీ పక్కన పెడితే   సీఎంగా బీహార్ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు; నితీష్ కుమారా; తేజస్వి యాదవా; జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిశోరా? అన్న అంశంపై తాజాగా  ఇండియా టుడే-సి ఓటర్ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మహాఘట్ బంధన్ (ఇండియా కూటమి) అభ్యర్థి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వైపే జనం మొగ్గు ఉందని తేలింది. ఆశ్చర్యకరంగా ఈ సర్వేలో ప్రస్తుత ముఖ్యమంత్రి జేడీయూ అధినేత, ఎన్డీయే కూటమి అభ్యర్థి నితీష్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. తేజస్వియాదవ్ తరువాత   రెండవ పేరు జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ పేరు ఉంది.    ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మూడో స్థానంలో ఉన్నారు.  సర్వే ప్రకారం బీహార్ లో 36 శాతం మంది ప్రజలు తేజస్విని యాదవ్ ను సీఎంగా కోరుకుంటున్నారు. ఇక జన సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ సీఎం కావాలని కోరుకుంటున్న వారి శాతం 23గా ఉంది. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ వైపు కేవలం 16శాతం మంది మాత్రమే మొగ్గు చూపుతున్నారు.   ఇక   ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సీఎం అవ్వాలని 8.8 శాతం మంది, బీజేపీ నాయకుడు, ప్రస్తుతం నితీష్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఉన్న  సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి కావాలని 7.8 శాతం మంది ప్రజలు  కోరుకుంటున్నారు.   ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయమేంటంటే.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ.. జేడీయూ కంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధించింది. అప్పటి ఎన్నికలలో  74 స్థానాలు జేడీయూకు 43 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే.. బీజేపీ వెనక్కు తగ్గి నితీష్‌నే ముఖ్యమంత్రిగా చేసింది. ఈసారి కూడా ఎన్‌డీఏ తరపున నితీష్‌ కుమారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇప్పటికే ప్రకటించేసింది కూడా. అయితే తొమ్మిది సార్లు సీఎంగా ఉన్న నితీష్ కుమార్ కు రాష్ట్రంలో ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయింది. ఆ విషయాన్ని ఈ తాజా సర్వే ఫలితాలు మరోసారి ఎత్తి చూపాయి.  అదలా ఉంటే..  బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 121 స్థానాలకు, రెండో దశలో మిగిలిన 122 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఇండియా టుడే- సీఓటర్ సర్వే ఏ మేరకు నిజమౌతుందో తేలాలంటే అప్పటి వరకూ వేచి చూడాల్సిందే. 

జూబ్లీహిల్స్.. బీజేపీ లెక్క తేలలేదా?..తప్పిందా?

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నికకు సోమవారం (అక్టోబర్ 13) నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లు తమతమ అభ్యర్థులను ప్రకటించేశాయి. అయితే కమలం పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకూ ఓ నిర్ణయానికి రాలేదు. ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వారిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్ఠానం అనుమతి కోసం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు హస్తినకు వెళ్లారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా కాలంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. రాష్ట్ర పార్టీలో నేతల మధ్య విభేదాలే ఇందుకు కారణం అని పరిశీలకులు అంటున్నారు. జూబ్లీ బైపోల్ విషయంలో కూడా అభ్యర్థి ఎంపిక విషయం ఇంత వరకూ తేలకపోవడానికి కూడా అదే కారణమని చెబుతున్నారు.   బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం జూబ్లీ బైపోల్ అభ్యర్థి విషయంలో ఇప్పటి వరకూ దృష్టి పెట్టలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. అదే బీహార్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జూబ్లీ ఉప ఎన్నిక విషయాన్ని ఇసుమంతైనా నిర్లక్ష్యం చేయలేదు. కానీ బీజేపీ మాత్రం నామినేషన్ల పర్వానికి చివరి నిముషాలు సమీపిస్తున్నా కూడా అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చకుండా నానుస్తుండటంతో తెలంగాణలో బీజేపీ లెక్కతేలలేదా; లేక తప్పిందా అన్న చర్చ రాజకీయవర్గాలలో ఆరంభమైంది.  గత అసెంబ్లీ ఎన్నికల నుంచీ కూడా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఆ లక్ష్య సాధన విషయంలో మాత్రం విఫలమౌతూనే వస్తోంది. జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని తేల్చే విషయంలో ఇంతగా మల్లగుల్లాలు పడుతుండటంతో ఆ పార్టీ ప్రచారంలో కూడా ఇప్పటికే వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఏ మేరకు పోటీ ఇవ్వగలదన్న అనుమానాలు కమలం శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి.  

పేర్ని నానిపై కేసు..మళ్లీ అజ్ణాతంలోకేనా?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేర్ని నాని తెలియని వాళ్ళు ఉండరు. వైసీసీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన పేరే.  నిత్యం ఏదో  ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో ఉండే పేర్ని నాని.. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుండి తన నోటికి గట్టిగా పని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ నోటికి అడ్డూ అదుపూ లేదన్నట్లుగా బూతులతో, అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన కొడాలి నాని వంటి వారు  అధికారం కోల్పోయిన తరువాత సైలెంటైపోయారు. ఇక అధికారం కోల్పోయిన తరువాత నిన్న మొన్నటి వరకూ అంబటి రాంబాబు తన గళానికి పని చెప్పారు. అయనా ఈ మధ్య ఎందుకో మౌనం వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నుంచీ పేర్ని నాని వాయిస్ ఆఫ్ వైసీపీ అన్నట్లుగా  రెచ్చిపోతున్నారు. అయితే ఎంత రెచ్చిపోయినా.. పేర్నినాని ఒక విషయంలో మాత్రం గొప్ప పరిణితి ప్రదర్శిస్తున్నారు. తనపైన ఏదైనా కేసు నమోదైతే.. ఆ కేసులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాత వాసం చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నోటి వెంట ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా రాదు. సరే సదరు కేసులో కోర్టులో ఊరట లభించిందంటే చాలు అజ్ణాతం వీడి బయటకు వచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో రెచ్చిపోతుంటారు.  పేర్న నానిపై గతంలో కేసు నమోదైన ప్రతిసారీ కూడా ఆయన ఆ కేసులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాత వాసం చేయడం తెలిసిందే. గతంలో నానిపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలోనూ, అలాగే రేషన్ గోదాముల కేసు సమయంలోనూ కూడా పేర్ని నాని ముందస్తు బెయిలు వచ్చే వరకూ అజ్ణాతంలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదైంది.    ఆర్‌.పేట సీఐ ఏసుబాబుపై పేర్ని నాని దౌర్జన్యం చేశారనీ, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనీ కేసు నమోదైంది. ఇంతకీ జరిగిందేంటంటే.. పేర్ని నాని ఆధ్వర్యంలో  వైసీపీ  నేతలు మెడికల్‌ కళాశాల వద్ద ఇటీవల నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినలేదు.  ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఠాణాకు విచారణకు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. తాము చెప్పేవరకూ పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీసీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మేకల సుబ్బన్నను పోలీసులు శుక్రవారం (అక్టోబర్ 10) అరెస్టు చేశారు.  దీంతో పేర్ని నాని పెద్ద సంఖ్యలో అనుచరులతో చిలకలపూడి స్టేషన్ కు వెళ్లి హల్ చల్ చేశారు. సీఐతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నానిపై కేసునమోదైంది.   పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనీ, సీఐపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కేసు పెట్టారు. దీంతో ఈ కేసులో కూడా బెయిలు దొరికే వరకూ నాని అజ్ణాతంలోకే అంటూ వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.  

అంతా చొరబాట్ల వల్లే.. అమిత్ షా

దేశంలో ముస్లిం మైనారిటీల జనాభా పెరగడానికి చొరబాట్లే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దైనిక్ జాగరణ్' మాజీ సంపాదకుడు నరేంద్ర మోహన్ స్మారకోపన్యాసంలో మాట్లాడిన ఆయన దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల కేవలం రాజకీయ సమస్య కాదనీ, ఇది దేశ భద్రత, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య అనీ అన్నారు.   కొన్ని ప్రాంతాలలో ముస్లింమైనారిటీల జనాభా పెరుగుదల చాలా చాలా అధికంగా ఉందంటూ ఆయన కొన్ని రాష్ట్రాల జనాభా లెక్కలను ఉదహరించారు. అసోంలో గత దశాబ్ద  కాలంలో  ముస్లిం మైనారిటీల జనాభా   29.6 శాతం పెరిగిందన్నారు. చొరబాట్లు లేకుండా ఈ స్థాయిలో ముస్లిం జనాబా వృద్ధి సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ లోని పలు జిల్లాలలో  ముస్లిం జనాభా వృద్ధి రేటు 40 శాతం వరకూ ఉందనీ, సరిహద్దు ప్రాంతాల్లో  అయితే ఇది ఏకంగా 70 శాతం వరకు ఉందని అమిత్ షా అన్నారు.   కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని  ఆరోపించారు. గుజరాత్, రాజస్థాన్‌లకు కూడా సరిహద్దులు ఉన్నాయి. మరి అక్కడ నుంచి చొరబాట్లు ఎందుకు జరగడం లేదు?  అని  ప్రశ్నించారు. చొరబాట్లను అడ్డుకోవడం కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బాధ్యత మాత్రమే కాదనీ రాష్ట్రాలు కూడా బాధ్యత తీసుకోవాలని అమిత్ షా అన్నారు.  భౌగోళిక పరిస్థితుల కారణంగా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో కంచె వేయడం సాధ్యం కాదన్న ఆయన అలాంటి చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అత్యంత కీలకమన్నారు. 

కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి.. మంత్రుల మధ్య టెండర్ల మంట!

తెలంగాణ కాంగ్రెస్ వివాదాలతో సహవాసం చేస్తున్నదా అనిపిస్తున్నది. నిత్యం అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలతో  సతమతమౌతూనే ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వార్ జరిగింది.  అధిష్టానం రంగంలోకిదిగి వారి మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. అది అలా ఫుల్ స్టాప్ పడిందో లేదో.. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్  విషయంలో అలిగి.. తనకు టికెట్ రాకుండా చేసిన వారి పేరు త్వరలోనే బయటపెడతానంటూ మీడియాకు ఎక్కారు. దీంతో ఆయనను బుజ్జగించడానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ ఎపిసోడ్  అలా ముగిసిందో లేదో.. ఇలా మరో ఇద్దరు మంత్రుల మధ్య వార్ రచ్చకెక్కింది.   మంత్రి పొంగులేటి తన శాఖ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. దేవాదాయ శాఖ పరిధిలోని టెండర్లలో మంతి పొంగులేటి జోక్యమేంటంటూ కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి అనుచిత జోక్యం చేసుకుంటున్నారంటూ ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఆమె భర్త కొండా మురళి అధిష్ఠానానికి లేఖ రాశారు. ఇక ఇప్పుడు మంత్రి కొండా సురేఖ పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.   దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో మరో  తలనొప్పి మొదలైనట్లైంది.  ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం  ఇబ్బందుల్లో పడిన సమయంలో కొత్తగా కొండా మురళి, పొంగులేటి మధ్య వార్ మరిన్ని ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టినట్లైంది. వాస్తవానికి వరంగల్ ఇంచార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటినుంచి మంత్రి కొండా సురేఖ్ అసంతృప్తితోనే ఉన్నారు.  జిల్లాకు చెందిన   అంశాల్లో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు తెలియకుండానే, తనను సంప్రదించకుండానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనీ గత కొంత కాలంగా కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడా అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.   ఇంతకీ విషయమేంటంటే...  మేడారం జాతర సమీక్ష సమావేశం లో మంత్రి పొంగు లేటి  తీరుపై  కొండా సురేఖ,  ఆమె భర్త అసంతృప్తి వ్యక్తం చేశారు.వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల‌ లో పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకోవడంతో కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మండి పడ్డారు.  టెండ‌ర్ల వ్య‌వ‌హారా లపై కాంగ్రెస్  అధ్య‌క్షుడు ఖ‌ర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఇదే విషయాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు.   తాజాగా మంత్రి కొండా సురేఖ పొంగులేటి వ్యవహారశైలిపై అధిష్ఠానాని స్వయంగా ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికిసమాయత్తమౌతున్నారు. చూడాలి మరి ఈ వివాదాన్ని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో?

బెంగళూరు టు లండన్.. జగన్ తిరిగొచ్చేది ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి లండన్ బయలుదేరారు. కోర్టు అనుమతిలో ఆయన ఓ పక్షం రోజుల పాటు యూకేలో పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనకు బయలుదేరడానికి ముందు ఆయన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తాను తిరిగి వచ్చే వరకూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలనీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించాలని ఆదేశించారు. తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ సంతకాలను గవర్నర్ కు అందజేస్తానన్నారు. ఆందోళనలకు పిలుపునివ్వడం, నేతలకు, క్యాడర్ ను ముందుకు నెట్టి తాను ముఖం చాటేయడం పట్ల వైసీపీ శ్రేణులలో అసహనం వ్యక్తం అవుతోంది. గతంలో కూడా రాష్ట్రంలో ఆందోళనలకు పిలుపునిచ్చి జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమయ్యేవారని గుర్తు చేస్తున్నారు.  ఇంతకీ ఇప్పుడు జగన్ లండన్ పర్యటన ఎందుకంటే.. అక్కడ ఉన్న కుమార్తెలతో సమయం గడపడానికి అని చెబుతుంటారు. అండన్ లో వారి చదువులు పూర్తియిన తరువాత కూడా అక్కడే ఎందుకు ఉంటున్నారన్నది తెలియదు. కానీ జగన్ మాత్రం వారితో సమయం గడపడానికి అంటూ ఓ పదిహేను రోజుల పాటు పార్టీకి అందుబాటులో ఉండకుండా వెడుతున్నారు. జగన్ నర్సీపట్నం పర్యటన విషయంలో జనసమీకరణను పార్టీ నేతలు, శ్రేణులూ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన స్వయంగా వచ్చినప్పుడే అంతంత మాత్రం అటెన్షన్ చూపిన పార్టీ శ్రేణులు.. ఇప్పుడు జగన్ విదేశాలకు వెడుతూ ఇచ్చిన ఆదేశాలను ఎంత మేరకు పాటిస్తారన్నది చూడాల్సిందే.  ఇక మరో విషయమేంటంటే జగన్ లండన్ యాత్రకు అనుమతి ఇస్తూ కోర్టు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఇప్పటి వరకూ తన పాస్ పోర్టు రెన్యువల్ కు కూడా కోర్టకు వెళ్లకుండానే చేయించుకున్నారు. అంతెందుకు కోడి కత్తి కేసులో సాక్షిగా కూడా ఆయన కోర్టుకు హాజరు కావడానికి సాకులు చెబుతూ ఆ కేసును సాగదీస్తున్నారు. ఇక లండన్ నుంచి వచ్చిన తరువాతనైనా ఆయన సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరౌతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.  

బీహార్ ఎన్నికలు.. క్లీన్ ఇమేజ్ కే పీకే పెద్దపీట

51 మంది అభ్యర్థులతో తొలి జాబితా ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీ తరఫున బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఆ జాబితా మహామహా రాజకీయ ఉద్దండులను సైతం విస్మయానికి గురి చేసిందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్న అభ్యర్థులను పరిశీలించినట్లైతే.. వారు అత్యధికులు రచయతలు, మేథమెటీషియన్లు, మాజీ బ్యూరో క్రాట్లు, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులు ఉన్నారు.  ప్రశాంత్ కిశోర్ విడుదల చేసిన అభ్యర్థుల తొలిజాబితాపై ఇప్పుడు బీహార్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ప్రశాంత్ కిశోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 51 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారూ, క్లిన్ ఇమేజ్ ఉన్నవారే కావడం విశేషం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కులం, ధనం అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉండే బీహార్ లో ఆ రెంటినీ పూర్తిగా విస్మరించి క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే తన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలపాలని ప్రశాంత్ కిషోర్ భావించడం ఆసక్తి కలిగిస్తున్నది. అయితే అదే సమయంలో  ప్రశాంత్ కిశోర్ సామాజిక సమతుల్యతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 51 మందితో విడుదల చేసిన జాబితాలో 16 శాతం మంది ముస్లిం మైనారిటీలు, 17 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉన్నారు.  ఇటు సామాజిక సమతుల్యత, అటు విద్యావంతులు, క్లీన్ ఇమేజ్ ఉన్నవారితో ప్రశాంత్ కిషోర్ విడుదల చేసిన జాబితా విడుదల చేయడం ద్వారా తాను బీహార్ లో ధన స్వామ్యం, నేరస్వామ్యం లేని రాజకీయాలు నడుపుతానని ప్రశాంత్ కిశోర్ చెప్పకనే చెప్పారు.   

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్​లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జోవోను హైకోర్టు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం ను ఆశ్రయించాలని నిర్ణించింది. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 13)న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ సర్కార్ డిసైడైంది.  అభిషేక్ మను సింగ్వి తో పాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్ల పై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్ లతో  ప్రభుత్వ వాదనలు వినిపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.   ఇక హైకోర్టు జీవో9పై స్టేవిధిస్తూ..  తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.   బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు స్టేకు సంబంధించిన ఆర్డర్ కాపీ శుక్రవారం (అక్టోబర్ 10) అర్ధరాత్రి దాటిన తరువాత అందుబాటులోకి వచ్చాయి.   ట్రిపుల్ టెస్టు పాటించకపోవడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది.  అలాగే రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా  కాలపరిమితి దాటిన స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు  ట్రిపుల్​ టెస్ట్​ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్​ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది.  

అంజన్ కుమార్ యాదవ్ అలక.. టీకప్పులో తుపాన్

జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలకబూనారు. ఎన్నడూ లేని విధంగా జూబ్లీ బైపోల్ విషయంలో టికెట్ ఇవ్వడానికి లోకల్, నాన్ లోకల్ అన్నచర్చను తెరపైకి తెచ్చి తనను పక్కన పెట్టడం వెనుక ఎవరి హస్తం ఉందో తనకు తెలుసుననీ, త్వరలోనే ఆ పేరు బయటపెడతానంటూ మీడియా ముందుకు వచ్చారు. గతంలో  ఒక కాంగ్రెస్ నేత ఇటు మల్కాజ్ గిరి, అటు కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు లోకల్, నాన్ లోకల్ అన్న మాట ఎందుకురాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్  కష్టకాలంలో ఉన్న సమయంలో నిలబడి, కష్టపడి పని చేసిన తనకు టికెట్ రాకుండా చేశారనీ, అలా చేసిందెవరో త్వరలోనే బయటపెడతాననీ అజంన్ కుమార్ యాదవ్ అన్నారు. వాళ్లు నన్ను తొక్కుకుంటూ పోదామనుకుంటే.. నేను ఎక్కుకుంటూ పోతానని సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నని గుర్తు చేసిన అంజన్ కుమార్ యాదవ్.. జూబ్లీహిల్స్ కు పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు కనీసం తనను సంప్రదించలేదన్నారు. త్వరలోనే కార్యకర్తలతో భేటీ అవుతాననీ, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాననీ, పార్టీ వీడే ఉద్దేశంలో ఉన్నట్లు సూచన ప్రాయంగా తెలిపారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ అలక టీకప్పులో తుపాను గా తేలిపోయింది. ఆయనను బుజ్జగించడానికి కాంగ్రెస్ సీనియర్లంతా కలిసి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్ చార్జి కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి అంజన్ కుమార్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా అంజన్ కుమార్ యాదవ్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే భేటీ తరువాత  పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీ బైపోల్ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్ పార్టీ సీనియర్ నాయకుడనీ, జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారనీ చెప్పిన పొన్నం, పార్టీ అధిష్టానం నిర్ణయం మరో లా ఉందనీ అన్నారు. ఈ విషయంలో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తికి గురైన మాట వాస్తవమేననీ, అయితే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా అజంన్ కుమార్ యాదవ్ తో మాట్లాడి.. జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని, ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలను వివరించి సముదాయించారనీ పొన్నం చెప్పారు.   పార్టీలో సీనియర్ నేత, రెండు సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రెండుసార్లు ఎంపీగా పని చేశారనీ, ఆయన హైదరాబాద్ లో పార్టీకి పెద్దదిక్కనీ చెప్పిన పొన్నం.. జూబ్లీ బైపోల్ అంజన్ కుమార్ యాదవ్ సారథ్యంలోనే  జరుగుందని చెప్పారు.  అంజన్ కుమార్ యాదవ్ పరిస్థితి అర్ధం చేసుకున్నారనీ, జూబ్లీ ఎన్నికలలో దగ్గరుంచి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని మాటిచ్చారనీ తెలిపారు. 

75 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల పరుగు

అలుపెరుగని ప్రగతి శ్రామికుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా 15మైలురాయి దాటిన విజనరీ లీడర్  నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో నారా చంద్రబాబునాయుడు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి అనితర సాధ్యమనదగ్గ విజయాలను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడు ఈ రోజు మరో అద్భుత, అసాధారణ మైలు రాయిని చేరుకున్నారు. అదేమిటంటే సీఎంగా 15 ఏళ్లు పని చేసిన రికార్డును సాధించారు. దక్షిణభారత దేశంలో ఈ మైలు రాయిని అందుకున్న మూడో వ్యక్తిగా నిలిచారు. అలాగే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా చంద్రబాబు ఘనత సాధించారు.  చంద్రబాబు తొలి సారిగా 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను.. అంటూ 15 ఏళ్ల కిందట తొలి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ తరువాత మరో మూడు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, విభజత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.    దేశం మొత్తంలో సుదీర్ఘ కాలం సీఎంలుగా పని చేసిన నేతలు ఎందరున్నా.. దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన నాయకులు చంద్రబాబుకు ముందు కేవలం ఇద్దరు మాత్రమే. వారిలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిథి దాదాపు 19 సంవత్సరాలు సీఎంగా పని చేశారు. ఆయన తరువాత పుదుచ్చేరి సీఎంగా ఎన్.రంగసామి 16 ఏళ్ల ఉన్నారు. వారి తరువాత దక్షిణ భారత దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న ఏకైక వ్యక్తి నారా చంద్రబాబునాయుడు మాత్రమే.    చంద్రబాబు రికార్డులు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు చంద్రబాబుదే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సఎంగా దాదాపు తొమ్మదేళ్లు పని చేశారు. యాక్యురేట్ గా చెప్పాలంటే ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబునాయుడు ఎనిమిది సంవత్సరాల 255 రోజులు సీఎంగా ఉన్నారు.  నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం ఇప్పటికి ఆరేళ్ల 110 రోజులు. మొత్తం కలిపితే 15 సంవత్సరాల మైలు రాయి దాటారు.  అయితే దక్షిణ భారత దేశం నుంచి చంద్రబాబు కంటే ఎక్కువ కాలం సీఎంలుగా సేవలందించిన కరుణానిథి, రంగసామిల కంటే సీఎంగా చంద్రబాబు  చంద్రబాబు నాయుడు పాలనా విధానం ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంది. ఆయన విజన్ కు, పని విధానానికి, ప్రగతి, సంక్షేమాల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికీ ప్రపంచ దేశాల నాయకులు ఫిదా అయ్యారు. బిల్ క్లింటన్ వంటి నాయకుడు కూడా చంద్రబాబు విజన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.   హైదరాబాద్ ఐటీ రంగానికి ఊపిరి పోసిన హైటెక్ సిటీ నిర్మాణం, లక్షల మందికి ఉపాధి  ఇవన్నీ చంద్రబాబు దూరదృష్టిని ప్రత్యక్ష తార్కానాలే. ఇక చందర్బాబు చేపట్టిన విద్యుత్  సంస్కరణలు రాజకీయంగా చంద్రబాబుకు నష్టం చేశాయి. అప్పట్లో పార్టీ పరాజయానికి  ప్రధాన కారణమయ్యాయి. అయితే ఆ తరువాత వాటి ఫలాలు అందాయి.  నాలుగు దశాబ్దాలకు పైబడిన చంద్రబాబు రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ, నేర మరక లేదని ఆయన ప్రత్యర్థులే అంగీకరిస్తారనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయ వైరంతో చంద్రబాబుపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.  జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ప్రజానేతగా నిలబెట్టింది. చంద్రబాబు నాయుడు  కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రాజనీతిజ్ణుడిగా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.  

నేను ఎప్పడు ఓడి పోలేదు.. ఓడ గొట్టారు : అంజన్ కుమార్ యాదవ్

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్  బుజ్జగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన మాజీ ఎంపీని ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. టిక్కెట్‌ను నవీన్ యాదవ్‌కు కేటాయించాల్సిన పరిస్థితులను ఆయనకు వివరించారు.  అనంతరం అంజన్  కుమార్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందానని తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తనను ఇప్పుడు పక్కన పెట్టడం బాధాకరమన్నారు. తాను పార్టీలో చాలా సీనియర్ నాయకుడినని, ఎప్పుడూ ఓడిపోలేదని, కానీ అందరూ కలిసి ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు జూబ్లీ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ఆ తర్వాత కరోనాతో వెంటిలెటర్‌పై చికిత్స చేయించుకున్నానని గుర్తు చేశారు.  పార్టీ విధేయులకు న్యాయం జరగడం లేదన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనను సంప్రదించకుండా జూబ్లీ అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. నర్సరీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. హస్తం పార్టీలో అనేక పదవులు చేపట్టాను. నేను రెండు సార్లు హైదరాబాద్ అధ్యక్షుడిగా పని చేశాను’ అని ఆయన గుర్తుచేశారు. తనకు అసంతృప్తి ఉందని.. తన బాధనంతా మీనాక్షీ నటరాజన్‌కు చెప్పుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కావలసిన వాడిని కాలేకపోయానన్నారు. అగ్రనేత రాహుల్ ప్రధాని అయితే కేంద్ర మంత్రిని అవుతానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వమని మీనాక్షికి చెప్పినట్లు అంజన్ కుమార్ యాదవ్‌ తెలిపారు.

బీఆర్ఎస్, బీజేపీ కుట్రే అంటున్న బీసీ సంఘాలు

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇస్తుంద‌ని బీజేపీ  ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి ఎలా తెలుసు? అన్న ప్రశ్న  ఇప్పడు బీసీ సంఘాల నుంచి వస్తున్నది.  కాంగ్రెస్ లేస్త లేదు, బీఆర్ఎస్ స‌స్త లేదు, బీజేపీకి చూస్తే అవకాశం మంచిగుంది అంటూ  జీవోపై కోర్టు స్టే ఇవ్వ‌డానికి ఒక రోజు ముందు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి అన్న మాట‌లేంటంటే.. కాంగ్రెస్ కోర్టులో పెద్దగా  కొట్లాడ‌దు కావాలంటే చూడండి అన్నారు. ఈ విష‌యం అంతగా ఆయ‌న‌కు ఎలా తెలుసు? అన్న‌దొక ప్ర‌శ్న కాగా.. ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీసీ సంఘాల‌ కామెంట్ ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మ‌క్కై చేసిన కుట్ర‌గా అభివ‌ర్ణించారు. బీఆర్ఎస్ అప్ప‌ట్లోనే 50 శాతానికి మించ‌కుండా బీసీల‌కు చ‌ట్టం తీసుకొచ్చింద‌నీ, కేంద్రంలో ఉన్న బీజేపీ వీరికి మ‌రింత సహకారం అందిస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నాయి బీసీ సంఘాలు. త‌మ‌కు లేక లేక ఒక అవ‌కాశం వ‌స్తే మా నోటికాడ కూడు లాగేసుకున్నార‌ని తీవ్రంగా మండి ప‌డుతున్నారు బీసీలు.  వీహెచ్ అయితే  నాలుగు వారాల వాయిదా అంటే  త‌మ‌కు ద్రోహం చేయ‌డ‌మేన‌ని అన‌గా..  ఆర్ కృష్ణ‌య్య  బీసీల నోట్లో మ‌ట్టి కొట్టార‌ని.. మేం బందుకు పిలుపునిస్తున్నామ‌ని ప్రకటించారు. ఇక హైకోర్టులో ప్ర‌భుత్వ వాద‌న‌లు వినిపించిన సీనియ‌ర్ లాయ‌ర్ ర‌వి వ‌ర్మ‌.. రాష్ట్రంలో 15 శాతం కూడా లేని ఓసీల‌కు ఎందుకు అంత రిజ‌ర్వేష‌న్ ఏం చేస్కుంటారు? అస‌లు మీకు 62 శాతంతో వ‌చ్చిన స‌మ‌స్య ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే 1990ల కాలంలో నాడు జ‌య‌ల‌లిత‌.. ఢిల్లీ వెళ్లి అక్క‌డ అప్పటి ప్రధాని పీవీ ముందు కూర్చుని నా రిజ‌ర్వేష‌న్ నాకు ఇస్తారా చ‌స్తారా అన్న‌ట్టు కొట్లాడార‌నీ, మ‌నం కూడా అలా వెళ్లి మోడీ ఇంటి ముందు కూర్చుందాం ర‌మ్మంటూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ త‌ర‌ఫు నుంచి గంగుల క‌మ‌లాక‌ర్. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీఎంతో స‌హా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా క‌ల‌సి.. ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర అంత పెద్ద ధ‌ర్నా చేస్తే.. అప్పుడు బీఆర్ఎస్ ఎక్క‌డుందో చెప్పాల‌ని నిల‌దీశారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  దేశంలోనే తొలిసారిగా మేం చిత్త‌శుద్ధితో కుల‌గ‌ణ‌న స‌ర్వే చేప‌డితే క‌నీసం పాల్గొన‌ని బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా ఉంద‌ంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఒక అసెంబ్లీ తీర్మానం చేశాక,  అది కూడా అన్ని ప‌క్షాల మద్దతుతో ఏకగ్రీవ  ఆమోదం పొందిన‌ బిల్లును హైకోర్టు త‌ప్పు ప‌ట్ట‌డం, స్టే ఇవ్వ‌డం ఏమిటంటున్నారు కాంగ్రెస్ నాయకులు.   ఒక బిల్లును అసెంబ్లీ ఆమోదించి గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కుగానీ, రాష్ట్ర‌ప‌తి ద‌గ్గ‌ర‌కుగానీ పంపితే.. మూడు నెల‌ల్లోగా తేల్చేయాలి. ఒక వేళ అలా జ‌ర‌క్కుంటే ఆ బిల్లు ఆమోద‌యోగ్య‌మైన‌ట్టేన‌ని  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తేదీల‌తో స‌హా గుర్తు చేశారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క. ఇక మా చిత్త‌శుధ్దిని శంకించ‌డానికి బీఆర్ఎస్, బీజేపీలు స‌రిపోవ‌ని అన్నారు  టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. చేయాల్సిందంతా చేసి వారు ఇప్పుడు ఆడుతున్న ఈ నాట‌కాలు ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని మండిప‌డ్డారు మ‌హేష్ కుమార్ గౌడ్. ఇక మంత్రి వాకిటి శ్రీహ‌రి మాట్లాడుతూ,  కాంగ్రెస్ 42 శాతానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని.. ఇది తెలంగాణ ఇవ్వ‌డంలో అయినా బీసీ రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌లో అయినా ఒక‌టే విధానంతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అన్నారు మంత్రి వాకిటి. రేవంత్  త‌మ పాలిట దేవుడిలా ఈ రిజ‌ర్వేష‌న్ల బిల్లు తీసుకొచ్చార‌ని.. అయినా స‌రే వీరంతా క‌ల‌సి త‌మ నోటికాడ ముద్ద లాగేసుకున్నార‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు ఒక లేడీ లాయ‌ర్. సుప్రీంకైనా వెళ్లి.. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌కు కాంగ్రెస్ క‌ట్టుబ‌డితే.. తామంతా క‌ల‌సి వ‌స్తామ‌ని అన్నారు బీసీ సంఘం నేత‌లు.  హైకోర్టు స్టే ఇవ్వ‌డంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఆపేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఈ దిశ‌గా ఒక గెజిట్ కూడా విడుద‌ల చేసింది. దీంతో ప్ర‌స్తుతం ఉన్న ఎన్నిక‌ల కోడ్ కాస్తా ర‌ద్ద‌య్యింది.

నవీన్ యాదవ్ ద లోక‌ల్ బాయ్ ఆఫ్ జూబ్లీహిల్స్!

1978 నుంచీ జూబ్లీహిల్స్ స్థానికుల‌ లో కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌న్న‌ది తాజాగా కాంగ్రెస్ నుంచి అభ్య‌ర్ధి న్న‌ న‌వీన్ యాదవ్ చేసిన కామెంట్. ఇంత‌కీ ఏంటీ జూబ్లీహిల్స్ హిస్ట‌రీ. ఈ నియోజ‌క‌వ‌ర్గం గ‌తంలో ఏ సెగ్మెంట్లో భాగంగా ఉండేది? ఆ డీటైల్స్ ఏంటి? అని చూస్తే.. ఇది 1952 లో ద్విస‌భ్య స‌భ‌గా ఉండేది. ఇక్క‌డ ఎస్సీ కేట‌గిరిలో ఒక‌రు, జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ఒక‌రు ఎంపిక‌య్యారు. వారెవ‌ర‌ని చూస్తే బ‌త్తులు సుమిత్రాదేవి ఎస్సీ కేట‌గిరి, న‌వాజ్ జంగ్ జ‌న‌ర‌ల్ కేట‌గిరి. ఆ త‌ర్వాత 1960లో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ్గా.. ఈ ఎన్నిక‌లో సికింద్రాబాద్ కి చెందిన పార్సీ సంప‌న్నురాలు రోడా మిస్త్రీ గెలిచారు. 1962ఎన్నిక‌లోనూ ఆమే గెలిచారు. ఆ త‌ర్వాత ఈ సెగ్మెంట్ హిస్ట‌రీ 2009లో మొద‌లైన‌ట్టు తెలుస్తుంది. ఈ ఎన్నిక‌ల్లో పీజేఆర్ కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి గెలిచారు. అప్ప‌టి వ‌ర‌కూ ఇది ఖైర‌తాబాద్ సెగ్మెంట్లో ఉండేది. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2018, 2023లోనూ ఆయ‌నే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మాగంటి సైతం ఈ ప్రాంతానికి స్థానికులేం కాదు. ఆయ‌న హైద‌రాబాద్ లోని హైద‌ర్ గూడ నివాసి. దీంతో న‌వీన్ యాద‌వ్ అన్న‌ట్టు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికులు ఎమ్మెల్యేగా అయ్యిందే లేదు. మొన్న కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన అజ‌ర్ సైతం ఇక్క‌డి వారు కారు. మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంద‌న్న కోణంలో ఈ ప్రాంతం నుంచి ఆయ‌న్ను పోటీకి దింపారు అధిష్టానం పెద్ద‌లు. ఇప్పుడు తొలిసారి న‌వీన్ యాద‌వ్ తానీ ప్రాంత స్థానికుడిననీ.. మీ బిడ్డ‌ను గెలిపించాలనీ కోరుతున్నారు. అర్ధశతాబ్దం నుంచీ జూబ్లీహిల్స్ లో అన్యులు రాజ్య‌మేలుతున్నార‌నీ.. మీ ఇంటి త‌మ్ముడు మీరు పిలిస్తే ప‌ల‌క‌డానికి యూస‌ఫ్ గూడ చెక్ పోస్టులోని నా ఆఫీసు త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌నీ.. మీకంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని అంటున్నారాయ‌న‌. అంతే కాదు ప‌దేళ్ల పాటు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేయ‌లేని పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక మాత్రం చేస్తుందా? అన్న లాజిక్ లాగుతున్నారు. త‌న‌పై పెట్ట‌ిన‌వ‌న్నీ ఫాల్స్ కేసుల‌నీ.. అవ‌న్నీ వీగిపోతాయి కాబ‌ట్టి.. చ‌దువుకున్న వాడ్ని.. స్థానికుడ్ని.. నాకు ఓటు వేసి గెలిపిస్తే మీ ఇంటి మ‌నిషిగా ఉంటూ.. మీకు అన్ని ప‌నులు చేసి పెడతానంటున్నారు న‌వీన్ యాద‌వ్.

ఏంటీ ఓసీల‌కు కూడా రిజర్వేషన్లా వెంకటరమణా!?

కామారెడ్డి నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి చిప్పు చెడిపోయిందేమో తెలీదుగానీ, ఓసీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ కావాలంటున్నారాయ‌న‌. ఇప్ప‌టికే బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ మీదున్న అప‌వాదు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ధ‌ర్మ‌పురి అర‌వింద్ వంటి వారు తాజాగా చేసిన కామెంట్లు  బీజేపీ మీద‌ యాంటీ బీసీ ముద్ర వేస్తున్నాయి. అది చాలదన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ తాజా వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.   రిజర్వేషన్ల వ్యవహారంపై బీజేపీ కావాలని ఆడిస్తున్న డ్రామాగా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   బీఆర్ఎస్..  బీసీల‌కు వ్య‌తిరేకంగా యాభై శాతం క్యాప్ చ‌ట్టం తేగా..  తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన‌   బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఢిల్లీకి వెళ్లి అక్క‌డ నిర‌స‌న వ్య‌క్తం చేసినా కూడా కేంద్రం స్పందన శూన్యం. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కేంద్రంలోని బీజేపీయే అడ్డు పుల్ల వేస్తోంద‌న్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలకు తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి.  కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఓసీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు కావాలంటూ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు కాదు.. వాస్తవమే అనిపిస్తోందని అంటున్నారు.   మొన్న‌టికి మొన్న కామారెడ్డికి వ‌ర‌ద వ‌చ్చిన‌పుడు తాను ఇంటింటికీ వెళ్లి.. చాకిరీ చేయ‌లేను క‌దా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేసిన వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి.. మ‌రోమారు త‌న వితండ వాద‌న వెలుగులోకి తేవ‌డంతో.. ఈసారి ఎన్నిక‌ల్లో ఆ 8 సీట్లు కూడా ఊడిపోయేలా ఉన్నాయ‌న్న హెచ్చ‌రిక‌లు అందుతున్నాయ్. ఓబీసీల‌కు ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తే తామేమీ అడ్డుకోలేద‌ని అంటారు వీహెచ్ వంటివారు. ఎందుకంటే వారిలో కూడా పేద‌లుంటారు కాబ‌ట్టి,  తాము ఆటంక‌ప‌ర‌చ‌లేద‌న్న కామెంట్ చేశారు వీహెచ్.   56 శాతం గా ఉన్న బీసీల ప్ర‌యోజ‌నాల‌ను అడ్డుకునే విధంగా హైకోర్టు స్టే ఇవ్వ‌డం వెన‌కున్న శ‌క్తులు త్వ‌ర‌లోనే బ‌య‌ట ప‌డ‌తాయ‌ని అంటున్నారు కాంగ్రెస్ నాయ‌కులు, ఇత‌ర బీసీ సంఘాల వారు. ఇప్ప‌టికే బీజేపీ మీదున్న నింద‌లు చాల‌వ‌న్న‌ట్టు వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి వంటి వారు బీజేపీని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేస్తున్నార‌నీ.. ఇది విప‌రీత అర్ధాల‌కు దారి తీసి పార్టీని మ‌రోమారు పుట్టి ముంచినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు కొంద‌రు కాషాయ పార్టీ లీడ‌ర్లు. అనువుగాని చోట అధికుల‌మ‌న‌రాద‌న్న సామెత‌లు గుర్తు చేస్తున్నారు.

ఇచ్చిన సొమ్ముకు డబల్ అంటూ రూ.20 కోట్లకు టోకరా!

హైదరాబాద్ కు చెందిన శ్రీ విద్య అనే మహిళ తన భర్త రాజశేఖర్ రెడ్డి తో కలిసి ఏపీ కి చెందిన ఒక్క ఎమ్మెల్యే  పిఏ నుండి 2వేల కోట్లు వస్తున్నాయని... 2వేల కోట్లు కోసం కంటైనర్లు కొనాలని  వివిధ ప్రాంతాలకు చెందిన మహిళ లను మోసం చేసి కోట్లులో డబ్బులు వసూలు చేసింది. ఏపీకి చెందిన విజయసాయిరెడ్డి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పి... అమాయక మైన జనాలను నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. కొంతమంది వద్ద బంగారం తీసుకునీ ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మ బలికింది. ఇలా కూకట్ పల్లి, కెపిహెచ్ బి కాలనీ, మియాపూర్ మొదలగు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు కట్టు కథలు చెప్పి వారి వద్ద నుండి బంగారం, సొమ్ములు వసూలు చేసి ఏకంగా 20 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది.   అనంతరం పటాన్ చెరుకు మకాం మార్చేసింది. తీసుకున్న డబ్బులు కానీ బంగారం కానీ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆమెను నిలదీశారు.  దీంతో శ్రీవిద్య వారినందరినీ.. గురువారం సాయంత్రం తన నివాసానికి రమ్మని.. వచ్చిన ఎనిమిది మంది మహిళలను ఒక గదిలో బంధించి, భర్త రాజశేఖరరెడ్డి, తమ్ముడు, పనిమనిషి,  ముగ్గురితో దాడి చేయించింది. ఈ దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీవిద్యపై విద్య మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

తెలంగాణ హైకోర్టులో రేవంత్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేసింది.   స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో 9పై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం (అక్టోబర్ 9)న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ..  57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలిందనీ,  బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు నివేదిక ఎందుకని వాదించారు. అలాగే రిజర్వేషన్ల బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదన్నారు. అలాగే నిర్ణీత గడువులోగా గవర్నర్‌  ఆమోదించకపోతే దానిని చట్టంగా భావించాల్సి ఉంటుందని వాదించారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చిన  సుదర్శన్‌ రెడ్డి, నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుందని వివరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్‌ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరని వాదించారు. తెలంగాణ ప్రభుత్వం  రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో  తెచ్చిందని వాదించారు.