పరామర్శలోనూ ప్రగతి, సంక్షేమంపైనే చర్చలు!
posted on Sep 29, 2025 @ 9:58AM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర, ప్రగతి, ప్రజా సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత తెలిసిందే. ఈ విషయంలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతల చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సంఘటన ఆదివారం (సెప్టెంబర్ 28) చోటు చేసుకుంది. గత ఐదారు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కూడా ఇరువురి మధ్యా అధికారిక కార్యక్రమాలపైనా, రాష్ట్రప్రగతి, ప్రజాసంక్షేమంపైనే చర్చ జరిగింది.
తొలుత చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇందుకు పవన్ కల్యాణ్ జ్వరం నియంత్రణలోకి వచ్చిందనీ, అయితే దగ్గు మాత్రం తగ్గలేదనీ చెప్పారు. అక్కడితో ఆగకుండా గత ఐదు రోజులుగా తాను అధికారిక కార్యక్రమాలలో పాల్గొన లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరిరువురి మధ్యా అక్టోబర్ మాసంలో కూటమి ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది.
వీరిరువురి మధ్యా భేటీలో మెగాడీఎస్సీ సక్సెస్ ప్రస్తావన కూడా వచ్చింది. అలాగే వచ్చే నెల 4 నుంచి ప్రారంభించనున్న ఆటో డ్రైవర్ల సేవలోపథకం, . స్త్రీ శక్తిద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపై చర్చించారు. అదే విధంగా వచ్చే నెల 16న ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనపై కూడా చర్చ జరిగింది.