ఆక్షేపించడానికేం లేకేనా.. బాబు వయస్సుపై జగన్ వ్యాఖ్యలు?
తెలుగు దేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన దార్శనికతను రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఈ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఉపయోగించిన తీరును మేధావులూ, ప్రగతి కాముకులు ప్రశంసిస్తూనే ఉంటారు. ప్రస్తుతిస్తూనే ఉంటారు. దీంతో జగన్ కు చంద్రబాబుపై విమర్శలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు వయస్సుపై కామెంట్లు చేస్తూ సంతృప్తి చెందుతున్నారు.
ఇక ఆయన వయస్సు విషయానికి వస్తే.. ఇప్పుడు ఆయన వయస్సు 75 ఏళ్లు. అయితేనేం.. 27ఏళ్ల నవయవ్వనులను మించిన ఉత్సాహం. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేద్దామన్న తపన ఆయనలో నిత్యం ప్రస్ఫుటిస్తుంటాయి. అటువంటి నారా చంద్రబాబునాయుడిని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ముసలాయన అంటున్నారు. ఆయనను వృద్ధుడు అనడం ద్వారా ఆయనకు కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నది తెలియదు కానీ.. చంద్రబాబు మాత్రం తాను నిత్యయవ్వనుడినని తన తీరుతో, పని విధానంతో పదే పదే నిరూపించుకుంటున్నారు. ప్రజలు సైతం ఆయన ఉత్సాహాన్ని, ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న ఉత్సుకతను, నిబద్ధతను సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తున్నారు. అదే సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత అరుదుగా తప్ప పర్యటన చేసే వారు కాదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ ఎక్కువగా తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్ లకే పరిమితం అవుతున్న విషయాన్ని ఎత్తి చూపుతున్నారు.
అయితే చంద్రబాబు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా నిత్యం ప్రజలతో మమేకమౌతూ ప్రజాక్షేత్రంలో, అధికారిక కార్యక్రమాలలో నిరంతరం బిజీగా ఉంటారు. ఉంటున్నారు. అందుకు ఉదాహరణగా బుధవారం (సెప్టెంబర్ 24) గురువారం(సెప్టెంబర్25) ఆయన బిజీ షెడ్యూల్ ను గమనిస్తే సరిపోతుంది.
ముందుగా బుధవారం చంద్రబాబు క్షణం తీరిక లేని షెడ్యూల్ ను చెప్పుకుంటే.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాథాకృష్ణన్ కు విమానాశ్రయంతో స్వాగతం పలకడం తో మొదలైంది. ఆ తరువాత చంద్రబాబు సకుటుంబ సమేతంగా మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. అక్కడ నుంచి.. విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు.
ఆ తరువాత గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు తిరుపతి వెళ్లారు. అక్కడ నుంచి తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక గురువారం (సెప్టెంబర్ 25) ఉదయమే ఉపరాష్ట్రపతితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయనతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. అక్కడ నుంచి అమరావతి చేరుకుని అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్నారు. సాయంత్రం డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో కూడా ఆయనలో ఎక్కడా అలసట చ్ఛాయలు కూడా కనిపించలేదు. ముఖంపై చిరునవ్వు చెరగలేదు. ఒక రోజు పర్యటిస్తే రోజుల తరబడి ప్యాలెస్ కే పరిమితమయ్యే జగన్ చంద్రబాబు వయస్సుపై వ్యాఖ్యలు చేయడమేంటంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.