స్థానిక ఎన్నికలు.. కల్వకుంట్ల కవిత నిర్ణయం ఏంటి?
posted on Sep 30, 2025 @ 2:35PM
తెలంగాణలో స్థానిక నగారా మోగింది. బీఆర్ఎస్ పుంజుకుంటుందా? బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ కు లబ్ధి చేకూరుస్తుందా? వంటి అంశాలకన్నా.. ఇప్పుడు రాజకీయ వర్గాలలో కల్వకుంట్ల కవిత నిర్ణయం ఏంటి? అన్నదానిపైనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ సభ్యత్వంలో సహా పార్టీకి రాజీనామా చేసేశారు. తెలంగాణ జాగృతి పేరిట ఆమె రాజకీయాలు చేస్తున్నారు. అవసరమైతే సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని కూడా చెబుతున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఆమె అభ్యర్థులను నిలబెడతారా? నిలబెట్టి గెలిపించుకోగలరా? లేకుంటే ఆమె అభ్యర్థులను పోటీలో పెట్టడం వల్ల బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
ఆమె విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు మంగళవారం (సెప్టెంబర్ 30) తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా తెలంగాణ జాగృతి ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. బతుకమ్మ వేడుకల కోసం విదేశాలకు వెళ్ళిన కవిత అక్కడ రాజకీయ ప్రసంగాలు చేశారు. రెండు దశాబ్దాల పాటు తాను తెలంగాణ కోసం, బీఆర్ఎస్ కోసం అన్నీ వదులుకుని పని చేశానని చెప్పుకున్నారు. పార్టీ తనను వద్దనుకుంది కనుకనే రాజీనామా చేశాననీ చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పుడు తెలంగాణ స్థానిక ఎన్నికల సందర్భంగా కవిత తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదీ కాక హైదరాబాద్ వచ్చీ రావడంతోనే జాగృతి నేతలతో భేటీ కావడంతో ఆమె కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఒక వేళ స్థానిక ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరుపున పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకుంటే.. బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఆసక్తీ రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఆమె జాగృతి తరఫున అభ్యర్థులను నిలబెడితే.. బీఆర్ఎస్ పై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీల్లో పార్టీ గుర్తుపై ఎన్నికలు జరగకపోయినా, పార్టీలు బలపరిచిన అభ్యర్థులే రంగంలోకి దిగుతారు. ఇక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీల గుర్తులపైనే జరుగుతాయి. పోటీ ప్రధానంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్‌ల ఉంటుందన్న అంచనాలు ఉన్నప్పటికీ ఏదో మేరకు బీజేపీ ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపితే సీన్ మారిపోయే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరివీలకులు విశ్లేషిస్తున్నారు.
కవిత బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆ పార్టీ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ పై మాత్రం ఈగ వాలనీయడం లేదు. తండ్రి సెంటిమెంట్ ను బలంగా పండిచడం కోసం ఆమె ఇటీవల తండ్రి సొంత ఊరైన చింతకుంటకు వెళ్లి మరీ తెలంగాణ సంబురాలలో పాల్గొని వచ్చారు. ఈ నేపథ్యంలో కవిత తెలంగాణ జాగృతి తరఫున స్థానక సమరంలోకి దిగితే.. ఆమె కచ్చితంగా తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఫొటోతోనే ప్రచారం నిర్వహిస్తారు. ఇది అనివార్యంగా బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరమే అంటున్నారు. ఆమె వల్ల బీఆర్ఎస్ నష్టపోవడమే కాదు.. కాంగ్రెస్ కు ప్రయోజనం చేకూరడం కాడా ఖాయమంటున్నారు.