కవిత రాజీనామా ఆమోదం ఎప్పుడంటే?
posted on Sep 30, 2025 @ 2:57PM
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నిజమే.. అయితే ఆమె రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు. అంటే టెక్నికల్ గా కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఎమ్మెల్సీయే. కవిత తన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్ లోనే ఇచ్చారు. ఆ విషయాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా చెప్పారు. అంతే కాదు.. కవిత.. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరుతూ తనకు ఫోన్ కూడా చేశారని గుత్తా తెలిపారు. అయితే రాజీనామా ఆమోదం విషయంలో మాత్రం ఆయనేం చెప్పలేదు.
ఎందుకంటే.. గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. గుత్తా పేరుకు బీఆర్ఎస్ యే అయినా.. కుమారుడిని కాంగ్రెస్ లో చేర్చిన తరువాత నుంచీ ఆయన ఆ పార్టీకి ఒకింత సన్నిహితంగానే మెలుగుతున్నారని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. ఎంత కాదనుకున్నా.. మండలి చైర్మన్ గా ఆయన తటస్థం అనే చెప్పాలి. అందుకే కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదానికి ఆయనకు ఎటువంటి రిజర్వేషన్లూ ఉండే అవకాశం లేదు. మరి కల్వకుంట్ల కవిత రాజీనామా ఆమోదం విషయంలో ఆయన ఎందుకు తాత్సారం చేస్తున్నారూ అంటే.. కవిత రాజీనామా ఆమోదిస్తే.. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే? కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 వరకూ ఉంది. దీంతో ఇప్పుడు ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక అనివార్యం. అదే జరిగితే కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు.
ఎందుకంటే వాటి కాలపరిమితి పూర్తై ఏడాది దాటిపోయింది. స్థానిక సంస్థలలో సభ్యులెవరూ లేరు. స్థానిక ఎన్నికల తరువాత ఆ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్ని ఉంటుంది. అందుకే కవిత రాజీనామా ఆమోదం విషయంలో మండలి చైర్మన్ తాత్సారం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బహుశా కవిత రాజీనామా ఆమోందం పొందుతుందేమో అంటున్నారు పరిశీలకులురాజీనామా ఆమోదంపై వేచి చూడాలని మండలి చైర్మన్ కు సంకేతాలు వచ్చినట్లుగా భావిస్తున్నారు.