నీలిమ మృతి కేసులో సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ
posted on Aug 3, 2012 @ 5:38PM
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ జరుగుతోందని డీసీపీ యోగానంద్ తెలిపారు. ఈరోజు ఆయన నీలిమ మృతికి సంబంధించిన కొన్ని వివరాలను విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం పోలీస్‌స్టేషన్‌కు 11గంటలకు సమాచారం వచ్చింది. 9 గంటలకు 18-19 నెంబర్ గల భవనంలోకి నీలిమ వెళ్లింది. 9.36నిమిషాల వరకు విజువల్స్ లభించాయి. 9.36నిమిషాలకు పార్కింగ్ భవనంలోకి నీలిమ వెళ్లింది. నీలిమ భవనంపై నుంచి పడిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డు రమేష్ గమనించారు. కంపెనీ ఉద్యోగులు ముగ్గురు నీలిమను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నీలిమ పడిపోయే సమయలో ఒక చెప్పు ఏడో అంతస్తులో పడింది. సమాచారం ఆలస్యమవడానికి కారణం సరైన ఫోన్ నెంబర్లు లేకపోవడమేనని డీసీపీ తెలిపారు. 10వ ఫ్లోర్‌లో నీలిమ హ్యాండ్‌బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్‌లో దొరికిన చీటీ ఆధారంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఏడో అంతస్తుపై నుంచి పడిపోయిందనడానికి పైపులపై మరకలున్నాయని ఆయన చెప్పారు.
నీలిమ మొబైల్ స్క్రీన్ లాక్ అయింది. ఓపెన్ చేసేందుకు నిపుణుల ద్వారా ప్రయత్నిస్తున్నారు. నీలిమ ఈ-మెయిల్‌ను కూడా ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీలిమ మృతికి సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. 9.30 సమయంలో నీలిమ సెల్ నుంచి ఒక నెంబర్‌కు ఫోన్ కాల్ వెళ్లింది. ఆ వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని డీసీపీ చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే కొంత సమాచారం అభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.