టిడిపి నర్సారెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట
posted on Aug 17, 2012 @ 2:41PM
తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) నర్సారెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నర్సారెడ్డి ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై శుక్రవారం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్నికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. దీనిపై నర్సారెడ్డి, వెంకట్రామి రెడ్డి ఇద్దరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ మరో రెండు వారాల్లో విచారణకు వచ్చే అవకాశముంది.
కాగా నర్సారెడ్డికి హైకోర్టు తీర్పు ఇటీవల షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నర్సారెడ్డి ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు గత శుక్రవారం తీర్పు ఇచ్చింది. నర్సారెడ్డిపై కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డి 9 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు హైకోర్టు వెల్లడించింది. నర్సారెడ్డి ఎన్నికల చెల్లదంటూ వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఓట్ల లెక్కింపు జరిపి నర్సారెడ్డి ఎన్నిక చెల్లదని ప్రకటించిన విషయం విదితమే.