కసబ్ క్షమాభిక్ష పిటిషన్
posted on Sep 18, 2012 @ 4:09PM
ముంబై దాడుల కేసులో ఉగ్రవాది కసబ్‌కు సుప్రీంకోర్ట్ ఉరిశిక్ష వేసిన విషయం తెలిసిందే. ఉరిశిక్షపై అజ్మల్ కసబ్ క్షమాభిక్షా కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. కాగా కసబ్ ఒకవేళ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని అభ్యర్థిస్తే, అతని అభ్యర్థనను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేలా చర్యలు చేపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గతంలో చెప్పారు. నవంబర్ 26, 2008లో ముంబై నగరంలో జరిగిన ఉగ్రవాదుల అమానుష హింసాకాండకు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజ్ హోటల్లో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్. కసబ్ కేసు విషయంలో 11వేల పేజీలతో దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 13 నెలల పాటు దర్యాఫ్తు సంస్థ ఈ కేసును విచారించింది. 3192 సాక్ష్యాధారాలను పరిశీలించింది. 2009 ఏప్రిల్ 15వ తేదిన కసబ్ కేసు ప్రారంభమైంది. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. దేశంలోని ఉగ్రవాదుల కేసులలో అత్యంత వేగంగా పూర్తయిన కేసు కసబ్‌దే.