మహా గణపతి వైభవం
posted on Sep 19, 2012 @ 2:38PM
గణపతి వైభవం
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః
షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||
అందమైన ముఖము కలిగినవాడు గణపతి. అతి వైభవోపేతమైన వర్చస్సు కలిగిన ముఖం కలిగినవాడు గణపతి. గణపతిని ఉదయం లేవగానే దర్శించుకుంటే అఖండమైన లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమౌతుంది. గణపయ్య గొప్పదనం గురించి తెలుసుకుని ఆయన నడిచే దారిలో మనమూ నడవగలిగితే సర్వేసర్వత్రా దిగ్విజయ ప్రాప్తితో పాటు సకల శుభాలూ కోరి దరిచేరతాయి. అఖండ దివ్యతేజంతోపాటు అనంతమైన కీర్తి కూడా సంప్రాప్తమౌతుంది. విఘ్నేశ్వరుడి రూపంనుంచే మనం నేర్చుకోగలిగిన విషయాలు చాలా ఉన్నాయి. గణపయ్య గజముఖవదనుడు కనుక నోరు బైటికి కనిపించదు. వీలైనంత తక్కువగా మాట్లాడం చాలా మంచిదన్న సత్యాన్ని దీనిద్వారా మనం గ్రహించాలి. మట్లాడకూడనిచోట బడబడా మాట్లాడడం ఎంత అనర్ధదాయకమో, సభలు, సమావేశాల్లో.. గొంతెత్తి గట్టిగా మాట్లాడాల్సిన చోట్లలో అస్సలు మాట్లాడకుండా ఉండడంకూడా అంతే అనర్ధదాయకం అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గ్రహించాలి. అవసరం లేనిచోట మాత్రం మాటల్ని చాలా పొదుపుగా వాడాలి. ఈ చిన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ప్రపంచమంతా మనల్ని గౌరవిస్తుంది.
ఏనుగుకి అందం దంతాలు. గజముఖ వదనుడైన విఘ్నేశ్వరుడికి మాత్రం ఒక్క దంతమే ఉంటుంది. కుడివైపునున్న దంతం సగానికి విరిగి ఉంటుంది. వ్యాసుడు మహాభారతం అనర్గళంగా చెప్పుకుపోతుంటే ఆపకుండా రాయగలిగేందుకు పనికొచ్చే కలం కావాల్సొచ్చి, దానికోసం విఘ్నేశ్వరుడు తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాశాడు. లోకకల్యాణంకోసం తనకు అంత్యంత శోభని కలిగించే దంతాన్ని కూడా త్యాగం చేశాడు గజముఖవదనుడు. అంటే లోకకల్యాణంకోసం మనకు అతి ఇష్టమైన వాటినికూడా త్యాగం చేయాలని చెప్పడానికే ఆయన ఈ లీలను ప్రదర్శించాడు.
ఎర్రటివర్ణము కలిగినవాడు విఘ్నేశ్వరుడు. నలుపు జీరతో కూడిన ఎరుపు గోవుల వర్ణం. కపిల వర్ణం సర్వశ్రేష్టమైనది. మల్లెపూవులా తెల్లగా ఉండే వినాయకుడు కపిల వర్ణంలో ఎందుకు కనిపిస్తాడు అని చాలామందికి సందేహం. గజాసురుణ్ణి సంహరించినప్పుడా వాడి రక్తం చింది తెల్లటి విఘ్నేశ్వరుడి శరీరంమీదపడి అద్భుతంగా ప్రకాశించి విఘ్నేశ్వరుడు కపిల వర్ణంలో కనిపించాడు. ఉత్తప్పుడు శాంత స్వభావంతో ఉండడం ఎంత అవసరమో.. అవసరమైనప్పుడు, దుష్టశిక్షణ చేయాల్సొచ్చినప్పుడు వీరత్వాన్ని ప్రదర్శించడంకూడా అంతే అవసరమని చెప్పడానికి విఘ్నేశ్వరుడు కపిల వర్ణంలో కనిపిస్తాడు.
వినాయకుడికి పెద్ద పెద్ద చెవులుంటాయ్. తక్కువ మాట్లాడడం ఎంత ముఖ్యమో.. ఎక్కువగా వినడం అంత ముఖ్యం.. ఆ విషయాన్ని తెలియజెప్పడానికే గణపతి పెద్దపెద్ద చెవులతో ఉంటాడు. ఆయనకు పిల్లలంటే మహా ప్రేమ. పిల్లల్ని నవ్వించడానికి ఆయన ఎప్పుటూ నాట్యం చేస్తూ ఉంటాడు. నవ్వుపుట్టించే రూపంలో నాట్యం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు వికటో అనే సుందరమైన నామం ఉంది. అవును.. పిల్లలు సంతోషంగా ఉండడమే ఆయనక్కావాలి కాబట్టి అలా ఉంటాడు. విఘ్నరాజు, వినాయకుడు అనే రెండు రూపాల్లో విఘ్నేశ్వరుడు లోకాలను పాలిస్తున్నాడు. పూర్వజన్మలో చేసిన పాపం అనంతమై వెంటపడుతోంటే విఘ్నారాజు చాలా చిన్న ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు, వినాయకుడి రూపంలో దాన్ని తొలగించేసి కర్మానుభవాన్ని పరిపూర్ణంచేసి అనుగ్రహించేవాడు వినాయకుడు.
నలుగు పిండిని ముద్దగా చేసి పార్వతీ దేవి వినాయకుడి బొమ్మని చేసి దానికి ప్రాణం పోసింది. సర్వమంగళ నిత్యం పసుపుతో నలుగుపెట్టుకుంటుంది. ఆ పసుపు ముద్దనే బొమ్మగా చేసింది కాబట్టి ఇప్పటికీ పూజని ప్రారంభించడానికి ముందుగా పసుపు వినాయకుడిని చేసి బొట్టు పెట్టి ఆరాధించడం ఆనవాయితీ. విఘ్నేశ్వరుడు ముందు నరరూపంలోనే పుట్టాడు. తర్వాత లోక కల్యాణం కోసం ఆయన గజముఖాన్ని ధరించాల్సొచ్చింది. గజాసురుడికి గజముఖుడైన నరుడి చేతుల్లోనే మరణం రాసిపెట్టుంది కనుక అతి సుందరమైన తన ముఖాన్ని లోకంకోసం త్యాగంచేసిన విఘ్నేశ్వరుడు గజముఖాన్ని ధరించాడు. సకల లోకాలూ చల్లగా ఉండడంకోసం గజముఖాన్ని ధరించగలిగిన ఔదార్యం ఒక్క విఘ్నేశ్వరుడికి మాత్రమే ఉంది. భాద్రపద శుద్ధ చవితినాడు భక్తితో విఘ్నేశ్వరుడి పూజను చేసుకున్న వాళ్లకు కష్టాలు తేలిగ్గా పరిష్కారమైపోతాయ్. కష్టాన్ని ఎంతటివారైనా అనుభవించే తీరాలి. వినాయకుడిని ప్రార్థిస్తే కష్టాన్నంతటినీ ఒకేసారి త్వరత్వరగా అనుభంలోకి తీసుకొచ్చేసి, దాన్ని విసిరి అవతలపారేసి అనంతమైన సుఖాల్ని ప్రసాదిస్తాడు. బాధని త్వరత్వరగా అనుభవింపజేసి పాతాళంలో కూరుకుపోయినవాళ్లని అలవోకగా పైకి తీసుకురావడం గణపతి ప్రత్యేకత. విఘ్నేశ్వరుడి అనుగ్రహ కటాక్షాలు మంచివాళ్లందరిమీదా ఉండాలని కోరుకుంటూ తెలుగువన్ డాట్ కామ్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
- మల్లాది వేంకటగోపాలకృష్ణ