మమతా షాక్, కాంగ్రెస్ కోర్ కమిటీ భేటి
posted on Sep 19, 2012 @ 12:25PM
కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో భేటి అయింది. మమతా యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. దీంతో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ బుధవారం అత్యవసరంగా భేటి అయింది. ఈ కీలక భేటీలోసోనియా గాంధీతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు.
మంగళవారం మమతా బెనర్జీ యూపీఏకు పెద్ద షాకిచ్చారు, యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్ సిలిండర్లపై నియంత్రణ, అసోంలో అల్లర్లు, రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలు, ఈ నిర్ణయాలు తమకు ఏమాత్రం నచ్చలేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు తమ రాజీనామాలను ప్రధాని మన్మోహన్‌కు సమర్పిస్తారని చెప్పారు. నిర్ణయం తీసేసుకున్నాం, ఇక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అయితే నాలుగు రోజులుగా కాంగ్రెస్‌కు హెచ్చరికలు పంపిస్తున్నట్లు మమత పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితమే సోనియాకు సందేశం పంపాను. సర్కారు నిర్ణయాలు ఆమోద యోగ్యం కాదని చెప్పాను. కానీ పరిస్థితిని ఆమె మార్చలేకపోయారని తెలిపారు. అలాగే మమతకు మూడు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ స్వయంగా ఫోన్ చేసినట్లు సమాచారం. ఆయన బుజ్జగింపులను మమత పట్టించుకోలేదని తెలిసింది.