మోడీకి కేజ్రీవాల్ తో సవతి పోరు తప్పదా?
posted on May 22, 2014 @ 11:51AM
ఒకప్పుడు అత్యంత ప్రజాదరణతో డిల్లీ పీటం అధిష్టించిన అరవింద్ కేజ్రీవాల్,దేశంలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి, పారదర్శకమయిన, ప్రజారంజకమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని దేశ ప్రజలందరూ ఆశపడ్డారు. కానీ అధికారం చేప్పట్టిన 49 రోజులలోనే ప్రభుత్వం నడపలేక చేతులెత్తేసి పదవి నుండి దిగిపోవడంతో డిల్లీ ప్రజలు తీవ్ర నిరాశ చెందారు. ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ డిల్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
కానీ కేజ్రీవాల్ కి అప్పటికీ జ్ఞానోదయం కాలేదు. డిల్లీ శాసనసభకు మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే, ఈసారి ఖచ్చితంగా బీజేపీయే గెలిచే అవకాశం ఉంటుంది గనుక, అందుకు ఇష్టపడని కాంగ్రెస్ పార్టీ విధిలేని పరిస్థితుల్లో తనకే మద్దతు ఇస్తుందనే ధీమాతో ఆయన డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని కలిసి డిల్లీ అసెంబ్లీని రద్దు చేయవద్దని, తాను మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పివచ్చారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ కి ఇదివరకు ఒకసారి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తలబొప్పి కట్టింది. అందువల్ల ఆయనకు మళ్ళీ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆమాద్మీ పార్టీలలో దేనికీ కూడా పూర్తి మెజార్టీ లేదు. వాటిలో ఏ ఒక్కరు కూడా తమంతట తాముగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలోలేవు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ అధికారం చెప్పట్టేందుకు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం చూసి బీజేపీ కూడా అప్రమత్తమయినట్లుంది.
నరేంద్ర మోడీ మరో నాలుగు రోజుల తరువాత అంటే ఈనెల26 దేశప్రధానిగా బాధ్యతలు చేపడతారు. అయితే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే తన కలలను కల్లలు చేసిన నరేంద్ర మోడీ మీద పగ తీర్చుకొనేందుకు సోనియా గాంధీ ఆమాద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినట్లయితే, అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ డిల్లీ ముఖ్యమంత్రి అయ్యి మోడీకి పక్కలో బల్లెంలా తయారవడం ఖాయం. ఒకవేళ అదే జరిగితే మరో నాలుగేళ్ల పాటు మోడీకి ఈ సవతిపోరు తప్పదు.
బహుశః అందుకే బీజేపీ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావాలు వేసి కోర్టులు చుట్టూ తిప్పుతోందని భావించవచ్చును. కేజ్రీవాల్ ని బిజీగా ఉంచగలిగితే, నరేంద్ర మోడీ బాధ్యతలు చెప్పట్టగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రపతిని కలిసి ప్రస్తుతం సుషుప్తావస్థలో ఉన్న డిల్లీ రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయమని అభ్యర్దించవచ్చును. విశేష ప్రజాధారణతో అఖండ మెజార్టీతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ అభ్యర్ధనను రాష్ట్రపతి కూడా తిరస్కరించక పోవచ్చును. ఆయన డిల్లీ అసెంబ్లీని రద్దు చేసినట్లయితే, మళ్ళీ త్వరలోనే ఎన్నికలు కూడా జరుగుతాయి. కనుక అరవింద్ కేజ్రీవాల్ ని మరో నాలుగయిదు రోజులు అడ్డుకోగలిగితే బీజేపీకి గండం గడిచినట్లే.