ఏడాదిలోగా జనసేన పార్టీ నిర్మాణం చేస్తా : పవన్
posted on May 24, 2014 @ 12:51PM
సరిగ్గా ఎన్నికల ముందు జనసేన పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్, తన రెండో సభలోనే ఎన్నికలలో పోటీ చేయనని చెప్పి తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఆతరువాత నరేంద్ర మోడీకి బేషరతుగా మద్దతు ఇవ్వడంతో మరిన్ని విమర్శలు మూటగట్టుకొన్నారు. తెదేపా-బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేసి వారికి విజయం చేకూర్చగలిగారు. చంద్రబాబు ఆయనను భోజనానికి ఆహ్వానించి కృతజ్ఞతలు చెప్పగా, నరేంద్ర మోడీ ఆయనను కీలకమయిన ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించడం ద్వారా ఆయనను గౌరవించారు.
ఆ సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవచ్చనే ఊహాగానాలు కూడా వినబడ్డాయి. కానీ అవేవీ నిజం కావని పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియాకు తెలిపారు. ఇటీవల ఒక ప్రముఖ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన భావి రాజకీయ ప్రణాళికల గురించి వివరించారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే “జనసేనను బీజేపీలో విలీనం చేస్తానని వస్తున్న వార్తలు ఖండిస్తున్నాను. జనసేన పార్టీ తెదేపా-బీజేపీలతో కలిసి పనిచేయవచ్చు, కలిసి ఎన్నికలలో పోటీ చేయవచ్చును కానీ వాటిలో విలీనం మాత్రం కాదు. మరొక ఏడాదిలోగా జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయగల వ్యక్తులను ఆహ్వానించి వారితో పార్టీ నిర్మాణం చేస్తాను. పార్టీ కార్యాలయాన్ని హైదరాబాదులోని నానక్‌రాంగూడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నాను. త్వరలో జరుగబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలతో జనసేన పార్టీ తన రాజకీయ కార్యక్రమాలను మొదలుపెడుతుంది. ఆ ఎన్నికలలో ఓడిపోయినా దానిని ఒక అనుభవంగానే భావిస్తాను తప్ప, రాజకీయాల నుండి పారిపోను. ఓటమి నుండి గుణపాటాలు నేర్చుకొంటూ ముందుకు సాగినప్పుడే చేరుకోవలసిన లక్ష్యం పట్ల సరయిన అవగాహన ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. నేను రాజకీయాలలో కొనసాగడం తధ్యం. అయితే ఆలాగని నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోను. చేతిలో ఉన్న కొన్ని సినిమాలు పూర్తి చేసిన వెంటనే పార్టీ నిర్మాణం, దాని కార్యక్రమాలు వంటి విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తాను.”
“చంద్రబాబు, నరేంద్ర మోడీ ఇరువురూ కూడా మంచి సమర్ధులు, కార్యదక్షత గలవారే. అందువల్ల వారి నేతృత్వంలో దేశం, రాష్ట్రం రెండూ త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నాను. వారిరువురూ నాకు చాలా చనువు ఇచ్చేరు కదా అని వారి వ్యవహారాలలో నేను జోక్యం చేసుకోదలచుకోలేదు. అయితే ఎల్లపుడు వారికి అందుబాటులో ఉంటాను. జనసేన ఎన్డీయే కూటమితో కలిసి పనిచేస్తూన్నపటికీ, వాటి లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రజల తరపున పోరాడుతుంది,” అని పవన్ కళ్యాణ్ అన్నారు. .