మేము సైతం...మేము సైతం...
posted on May 26, 2014 @ 10:46AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను, అది జరిగిన తీరుని చూసి సీమాంద్రాలో ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందారు. ఉన్నత విద్యా, వైద్య, ఉపాధి అవకాశాలన్నీకలిగి ఉన్న హైదరాబాద్ నగరాన్నివదులుకొని బయటకు వచ్చిన తమకు ఇక దారేది? అని అగమ్యగోచరంగామారిన తమ భవిష్యత్తుని తలచుకొని యువత చాలా ఆందోళన చెందారు. మళ్ళీ అటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో, అంతవరకు తమ పిల్లల పరిస్థితి ఏమిటని మధ్యతరగతి ప్రజలు చాలా కలత చెందారు. ఇప్పటికే ఆర్ధికంగా నలిగిపోతున్న తమపై లక్షల కోట్ల వ్యయమయ్యే రాష్ట్ర పునర్నిర్మాణ భారం కూడా పడితే తమ పరిస్థితి ఏమిటని ప్రజలందరూ ఆందోళన చెందారు. కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పైసా ఆదాయం లేకపోయినా, మోయలేనన్ని అప్పులు మాత్రం వాటాగా దక్కాయి.
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కార్యాలయం మొదలు సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, మంత్రుల నివాస సముదాయాలు, వివిధ ప్రభుత్వ శాఖల కోసం వందలాది భవనాలు సర్వం నిర్మించుకోవలసిన ఆగత్యం ఏర్పడింది. గత ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని తెలుగు ప్రజలు నెత్తిన పెట్టుకొని గౌరవించినందుకు, ఆ పార్టీ తెలుగు ప్రజలకు విదించిన శిక్ష ఇది అని అనుకోవాలేమో. అందుకే తెలుగు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎన్నడూ మరిచిపోలేని విధంగా గట్టిగా బుద్ధి చెప్పారు.
అంతేకాక చాలా విజ్ఞత ప్రదర్శిస్తూ అనుభవం, సమర్ధత, కార్యదక్షత అన్నీ ఉన్న తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెడుతూ అధికారం అప్పగించారు. అవిబాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్షయపాత్ర వంటి హైటెక్ సిటీని నిర్మించి ఇచ్చిన చంద్రబాబు మాత్రమే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి, రాష్ట్రాన్ని మళ్ళీ త్వరగా గాడిలో పెట్టగలరని దృడంగా నమ్మినందునే ఆయనకు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు.
అప్పటి నుండే సీమాంధ్ర ప్రజలలో అంతవరకు ఉన్న ఆందోళన క్రమంగా తగ్గుముఖం పట్టసాగింది. ఇంతటి క్లిష్ట పరిస్థితులను కూడా దైర్యంగా ఎదుర్కొని నిలబడగలమనే ఆత్మవిశ్వాసం ఇప్పుడు ప్రజలందరిలో ప్రస్పుటంగా కనబడుతోంది. ఒకప్పుడు తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందిన ప్రజలే ఇప్పుడు తమ ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ఈ మహత్కార్యం కోసం ఉడతా భక్తిగా తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు చిన్నాపెద్దా, ఆడామగా,పేద ధనిక అనే బేధం లేకుండా అందరూ తలో చెయ్యి వేసేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు.
దేశవిదేశాలలో స్థిరపడిన తెలుగు ప్రజలందరూ ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకొనేందుకు ఉవ్విళ్లూరుతూ ఉడతా భక్తిగా కోట్ల రూపాయలు విరాళంగా అందించేందుకు, పరిశ్రమలు,వ్యాపార సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు స్థాపించేందుకు కూడా సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజలలో కనబడుతున్నఅపూర్వమయిన ఈ సంఘీభావం, పోరాటస్ఫూర్తి, దైర్యం, పట్టుదల నిజంగా చాలా అబ్బురపరుస్తోంది.
వారి ఉత్సాహం చూసి కొన్ని తెలుగు న్యూస్ చాన్నాళ్ళు స్వయంగా ప్రజల నుండి విరాళాలు సేకరించి కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి అందించేందుకు భారీ మొత్తాలు సిద్దం చేసేపనిలోపడ్డాయి. అయితే ఈ విషయంలో సదరు న్యూస్ ఛానళ్ళు పూర్తి పారదర్శకతతో, నిబద్దతతో ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకోవలసి ఉంటుంది. లేకుంటే మంచికి పోతే చెడు ఎదురయినట్లు మున్ముందు ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చును.
ఏమయినప్పటికీ సీమాంధ్ర ప్రజలకు కన్నతల్లి వంటి మాతృభూమి ఋణం తీర్చుకొనే అవకాశం ఈవిధంగా కలిగింది. వారి దీక్షదక్షతలను యావత్ లోకానికి చాటిచెప్పే మహదవకాశం కలిగింది.