మెగా సోదరులు...మెగా డిఫరెన్స్...

  కాంగ్రెస్ పార్టీని ఎలాగయినా గెలిపించి తీరుతానని చిరంజీవి డిల్లీలో శపథం చేసి ప్రచారానికి బయలుదేరితే, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమికొట్టేందుకే తాను రాజకీయాలలోకి రావలసి వచ్చిందని చెప్పడం విశేషం. అయితే వీరిరువురిలో చిరంజీవి స్థిరంగా కాంగ్రెస్ టైటానిక్ పడవ మీదనే నిలబడి గంట కొడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం నేటికీ ‘ఎన్డీయే అభ్యర్ధులకే నా మద్దతు!’ అంటున్నారు తప్ప, స్వయంగా చంద్రబాబే ఆయనింటికి వచ్చి మరీ తమ పార్టీకి మద్దతు ఇమ్మని కోరినా ఆయన నోటంట ‘తెలుగుదేశం పార్టీకే నా మద్దతు’ అనే ముత్యాలవంటి ఆ మూడు ముక్కలు రాలలేదు. అంటే ఆయనకి తెదేపా పట్ల నేటికీ ఇంకా ఏవో అభ్యంతరాలున్నట్లు భావించవలసి ఉంది. ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో ‘ఎన్డీయే అభ్యర్ధులకు’ ప్రచారం చేసి పెట్టబోతున్నట్లు రూడీ అయ్యింది.   ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ నేటికీ తెలంగాణాలో ప్రచారం చేయడానికి వెళ్ళగలుగుతున్నారు. ఆయనకి అక్కడ ప్రజల నుండి అభిమానుల నుండి నేటికీ మంచి ఆదరణ కనబడుతోంది. కానీ కేంద్రమంత్రి అయిన చిరంజీవి హైదరాబాదులోనే నివాసం ఉంటున్నప్పటికీ, కాంగ్రెస్ తరపున తెలంగాణాలో ప్రచారం చేయలేని దుస్థితి. ఆయన ప్రచారానికి వెళితే పడే ఓట్లు కూడా పడవని గ్రహించిన టీ-కాంగ్రెస్ నేతలు చిరంజీవి ‘నో ఎంట్రీ’ బోర్డు ఎప్పుడో పెట్టేసారు. నిజానికి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చిన కారణంగా ఎంతో కొంత అనుకూల పరిస్థితి ఉంది. కానీ, అక్కడ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు చిరంజీవి వంటి ప్రజాకర్షక నేత ఒక్కడూ లేడు. అయినప్పటికీ మా తిప్పలేవో మేమే పడతాము తప్ప ఆ జీవి మాత్రం మాకొద్దు మహాప్రభో! అంటున్నారుట.    పోనీ ఆయనకు సీమాంద్రాలో ప్రజలు ఏమయినా బ్రహ్మ రధం పడుతున్నారా.. అంటే అదీ లేదు. అక్కడా ఆయన సభలకు జనాలు మొహాలు చాటేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన నిర్వహించిన బస్సు యాత్రలోను అదే స్థితి, నేడు ఆయన చేస్తున్న ప్రచారంలోనూ అదే పరిస్థితి. చిరంజీవి రెండు ప్రాంతాల ప్రజలకు కాని వాడయిపోతే, ఆయన తమ్ముడు మాత్రం అందరివాడు, అందరికీ కావలసినవాడు అనిపించుకొంటున్నారు. చిరంజీవిని సీమాంద్రాలో ప్రజలు సైతం పట్టించుకోకపోయినా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చి తమకోసం తెలంగాణాలో కూడా ప్రచారం చేయాలని ‘ఎన్డీయే అభ్యర్ధులు’ కోరుకోవడం గమనిస్తే ప్రజలలో మెగా సోదరుల వ్యక్తిత్వాలకున్న విలువ ఏమిటో స్పష్టంగా అర్ధమవుతుంది. చివరికి ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సైతం ఇదేవిధంగా స్పందించడం మరో విశేషం.   అయితే అందుకు కేవలం వారి వ్యక్తిత్వాలు మాత్రమే ప్రధాన కారణమని చెప్పలేము. వారి ప్రసంగ శైలి, వారు ఎన్నుకొన్న పార్టీలపై ప్రజలకున్న అభిప్రాయాలు కూడా వారి ప్రజాధారణలో తీవ్ర అంతరాన్ని కలిగిస్తున్నాయి. చిరంజీవి తన సినిమాలలో ప్రజలను ఆకట్టుకొనే విధంగా చాలా గొప్పగా డైలాగ్స్ చెపుతూ నటించి ఉండవచ్చును. కానీ నేటికీ ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగ అలవోకగా ప్రసంగించలేరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేఖత, ముఖ్యంగా రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన అనుసరించిన ద్వంద వైఖరి ఇత్యాది కారణాలు కూడా ఆయన పట్ల ప్రజలలో విముఖత ఏర్పడేందుకు కారణమవుతోందని చెప్పవచ్చును.   ఒకవైపు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కోసం సీమాంద్రాలో ప్రచారం చేస్తూ గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటే, మరో వైపు ఆ పార్టీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ఓటమి భయంతో తమ నామినేషన్లు ఉపసంహరించుకొని పోటీ నుండి తప్పుకోవడం ఆయన ప్రచారం యొక్క గొప్పదనానికి మరో నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సీమాంద్రాలో కూడా ‘ఎన్డీయే అభ్యర్ధుల’ తరపున ప్రచారానికి దిగినట్లయితే కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును.   పాపం ఆ ఒంటరి జీవి కష్టం చూసి చలించిపోయిన కాంగ్రెస్ టైటానిక్ షిప్ కెప్టెన్స్- సోనియా రాహుల్ గాంధీలు కూడా త్వరలోనే సీమాంద్రాలో పర్యటించి ‘మిగిలిన పని’ పూర్తి చేయడానికి వస్తున్నట్లు తాజా సమాచారం. శుభం.

పొన్నాలకి హై బీపీ!

      పాపం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు.  మంత్రిగాఉన్నంతకాలం ఎంచక్కా జోకులేసుకుంటూ, డాన్సులు చేసుకుంటూ, పాటలు, పద్యాలు పాడుతూ ఉత్సాహంగా గడిపిన ఆయన నెత్తిన ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి బండలా మారింది. ఏ బ్యాడ్ ముహూర్తంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారోగాని అప్పటి నుంచి ఆయనకి బ్యాడ్ టైమ్ స్టార్టయినట్టు కనిపిస్తోంది.   ఒకప్పుడు ఎంతో కూల్‌గా వుండే ఆయన ఇప్పుడు గరమ్ గరమ్‌గా కనిపిస్తున్నారు. ప్రెస్ వాళ్ళు గతంలో ఏదైనా ప్రశ్నిస్తే చిరునవ్వుతో సమాధానం చెప్పే ఆయన ఇప్పుడు అంతెత్తున విరుచుకుపడుతున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నెరవేర్చడంలో ఆయన పూర్తిగా స్ట్రెస్‌కి గురై, హైబీపీకి లోనయినట్టుగా పరిస్థితి చూస్తే అనిపిస్తోంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే మీకు సీన్ సితారైపోద్దని సోనియా మేడమ్ వార్నింగ్ ఇచ్చారో ఏమోగానీ, ఆయన మీద ఏదో ఒత్తిడి బాగా వున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మంగళవారం నాడు ఆయన బీపీ ఏ స్థాయికి చేరిందో తెలిస్తే ఆశ్చర్యపోయారు. ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్ ఎక్కిన ఆయన ఒకచోట ప్రచారం పూర్తి చేసుకున్నారు. మరోచోటకి పోదామని అంటే, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదని సదరు హెలికాప్టర్ పైలెట్ చెప్పాడట. అంతే, పొన్నాల గారికి హైబీపీ పెరిగిపోయి ఆ పైలెట్‌ని నానా మాటలూ అనేసి హెలికాప్టర్ దిగేసి కారులో వెళ్ళిపోయారట. ఇలా వుంది పొన్నాల గారి బీపీ వ్యవహారం.

ఎన్నికల సంఘం: ఓటేస్తే బహుమతులిచ్చే ఖర్మేంటి?

      ఓటర్లని రాజకీయ నాయకులు ఎప్పుడో బిచ్చగాళ్ళని చేసేశారు. మా పార్టీకి ఓటేస్తే ఫలానా ఫలానా విధంగా మీకు లాభం కలిగిస్తానని రాజకీయ నాయకుడు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ వుంటారు. చాలామంది ఓటర్లు ఆ ఆఫర్లు నిజమేననుకుని పొంగిపోతూ వుంటారు. ఇక ఎలక్షన్లు వచ్చాయంటే ఓటర్లకి డబ్బులు పంచడం కామన్. ఓటు ఒక శక్తి.. ఓటు ఒక ఆయుధం అని స్టేట్ మెంట్లు కొంతమంది అభ్యుదయవాదులు ఇస్తూ వుంటారుగానీ, ఇప్పుడు దేశంలో జనం డబ్బు తీసుకుని ఓట్లు వేయడానికి ఎంతమాత్రం సిగ్గుపడటం లేదు.   అసలు డబ్బు ఇచ్చే నాయకులని అని లాభం లేదు. చేతులు జాస్తున్న ఓటర్లనే అనాలి. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికో ఒకరికి ఓటు వేసే ప్రబుద్ధులు, అందరి దగ్గరా చేతులు చాచి అసలు ఎవరికీ ఓటు వేయని మహానుభావులు కూడా ఓటర్లలో వున్నారు. వాళ్ళు ఇస్తునందుకు వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు తీసుకుంటున్నందుకు వాళ్ళు ఇస్తున్నారు. ఇందులో తప్పు ఎవరిదో వెతకడం దేవుడనేవాడుంటే ఆయనగారి వల్ల కూడా కాదు. కోడి ముందా గుడ్డు ముందా.. చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న ఎంత కఠినమైనదో ఇదీ అంతే. సరే ఈ గోల ఇలా వుంటే, రాజకీయ నాయకులకు తోడుగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లని ముష్టోళ్ళని చేయడానికి తనవంతు కృషి చేస్తోంది.  ఈసారి 90 శాతానికి మించి పోలింగ్ జరపాలని అధికారుల లక్ష్యంగా పెట్టుకున్నారట. దానికోసం ఓటర్లని ఓటు వేయించేలా మోటివేట్ చేయడానికి స్కీములు ప్రకటించారు. ఓటు వేసిన ఓటర్ల నుంచి డ్రా తీసి, సదరు డ్రాలో పేర్లు వచ్చిన ఓటర్లకు కార్లు, ఇంకా ఏవేవో వస్తువులు ముష్టిగా పడేస్తారట. అసలు మీపని ఎలక్షన్లు సక్రమంగా నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ పని. ఎంత శాతం ఓట్లు పడితే మీకెందుకంటా? ఓటర్ల శాతం పెంచడానికి లక్కీ డ్రాలు.. బంపర్ బహుమతులు.. ఈ దరిద్రం అంతా ఎందుకంటా?  ఈ తతంగమంతా నిర్వహించే ఖర్మ మీకెందుకంటా? రాజకీయ నాయకులతో కలసి తిరిగీ తిరిగీ ఈ ప్రభుత్వ అధికారులకి కూడా ఓటర్లు ముష్టోళ్ళలాగా కనిపిస్తున్నట్టున్నారు.

ఎన్టీఆర్ ని పట్టించుకోని నందమూరి ఫ్యాన్స్..!

      నటరత్న, విశ్వవిఖ్యత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అంది పుచ్చుకున్నారు. సినిమా రంగంతోపాటు రాజకీయ రంగంలో కూడా నాన్న వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తున్నారు. ఈ వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్‌ కొనసాగిస్తారని నందమూరి అభిమానులు గతంలో భావించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలి కొరుకుడు పడని విధంగా, నందమూరి కుటుంబానికి దూరంగా వెళ్తున్న విధంగా వుండటంతో నందమూరి వంశాభిమానులందరూ క్రమంగా జూనియర్ ఎన్టీఆర్‌కి దూరమవుతున్నారు.   నందమూరి ఫ్యాన్స్ జూనియర్‌కి దూరం కావడం వల్లే ఇటీవలి కాలంలో ఆయన సినిమాలకు ప్రేక్షకాదరణ లభించడం లేదన్న అభిప్రాయాలు వున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైతే భారీ స్థాయిలో హడావిడి చేసే నందమూరి వంశాభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఊరుకుంటున్నారు. దీనివల్ల ఆయన సినిమాలు రిలీజైన థియేటర్లు మొదటి రోజు నుంచే చల్లగా వుంటున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కి, తమకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా నందమూరి వంశాభిమానులు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ఎన్నికలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకోకపోవడం, ఆయన నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎలాంటి స్పందన లేకపోవడంతో నందమూరి వంశాభిమానులతో ఆయనకున్న దూరం మరింత పెరిగింది. వీరి మధ్య ఏర్పడిన గ్యాప్‌లో నందమూరి వంశాకురం నందమూరి మోక్షజ్ఞ ఎంటరవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞను అభిమానించే వారి సంఖ్య బాగా పెరిగింది. నందమూరి వంశానికి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కాదని, సినిమా వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞే అసలైన వారసుడని అభిమానులు అంటున్నారు. తాజాగా మోక్షజ్ఞ తెలుగుదేశానికి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వుండటం కూడా ఆయన మీద అభిమానుల అభిమానం మరింత పెరగడానికి కారణమైంది. మోక్షజ్ఞ వెండితెర మీదకి ఎంట్రీ ఇచ్చి, ఒక్క భారీ హిట్ కొట్టాడంటే చాలు నందమూరి వంశాభిమానులందరూ మోక్షజ్ఞ వైపు పూర్తిగా షిఫ్ట్ అయిపోయే అవకాశం వుంది.  

హిందూపురంలో ప్రచారంతో మోక్షజ్ఞ పొలిటికల్ ఎంట్రీ?

      నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి తారకరామ మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశం కంటే ముందే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడా? తాతకి, తండ్రికి, హోల్‌సేల్‌గా నందమూరి వంశానికి తానే అసలైన వారసుడనని చెప్పకనే చెప్పబోతున్నాడా? ఈ ప్రశ్నలకి తెలుగుదేశం వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.   ఇప్పటికే ఇరవై యేళ్ళు నిండిన మోక్షజ్ఞను రాజమౌళి దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయం చేయడానికి ఓపక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పొలిటికల్‌గా కూడా మోక్షజ్ఞ ఫుల్ యాక్టివ్‌గా వున్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని ఫేస్‌బుక్, లింక్‌డ్ ఇన్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లద్వారా నిర్వహిస్తున్న విషయం రీసెంట్‌గా బయటపడింది. కూల్‌గా, బయటకి రాకుండా వుంటూనే లోపల్లోపల తెలుగుదేశం పార్టీ కోసం నందమూరి వంశ వారసుడిగా మోక్షజ్ఞ చేస్తున్న సర్వీస్ తెలుగుదేశం వర్గాలని ముగ్ధులను చేస్తోంది. అలాగే ఈసారి ఎన్నికలలో తన తండ్రి పోటీ చేస్తున్న హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మోక్షజ్ఞ తండ్రితోపాటు ప్రచారంలో పాల్గొనే అవకాశం వుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. తండ్రితోపాటు ప్రచార రథంపై మోక్షజ్ఞ కూడా కనిపించే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే  మోక్షజ్ఞ భారీ ప్రసంగాలేవీ చేయకుండా ముద్దుముద్దుగా రెండు మూడు మాటలతో తన తండ్రికి ఓటేయమని హిందూపురం ఓటర్లని రిక్వెస్ట్ చేస్తాడని తెలిసింది.

బీజేపీలోకి జంప్ కానున్న శ్రవణ్?

      పీఆర్పీ ద్వారా రాజకీయాల్లోకి ఎంటరై, పీఆర్పీని మూసేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌ని తెరాస సీమాంధ్రులను తిట్టడానికి బాగా వాడుకుంది. శ్రవణ్ సీమాంధ్రులను తిడుతుంటు ఆ మాటలకు తెలంగాణ వాళ్ళ కళ్ళలోంచి కూడా నీరు వచ్చేది. సీమాంధ్రులకు అయితే గుండె రగిలిపోయేది. సీమాంధ్రులను తిట్టడంలో, అడ్డంగా వాదించడంలో స్పెషలిస్టు అయిన శ్రవణ్ తనకు కేసీఆర్ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వలేదని లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ జిలానీ అయ్యాడు.   కాంగ్రెస్‌లోకి జంప్ కాగానే తెలంగాణ కాంగ్రెస్ ఆయనకి అధికార ప్రతినిధి హోదా ఇచ్చింది. దాంతో అప్పటి  వరకూ కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తున్న అధికార ప్రతినిధులకు మండింది. శ్రవణ్ రోజుకో ప్రెస్‌మీట్ పెట్టి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ని నానా తిట్లూ తిట్టడం మొదలుపెట్టాడు. మొన్నటి వరకూ కేసీఆర్ని దేవుడని పొగిడిన నోటితోనే ఇప్పుడు తిట్టడానికి శ్రవణ్‌ ఎలాంటి ఇబ్బందీ పడటం లేదుగానీ, వినేవాళ్ళకే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అయినా సరే శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ని తిడుతూనే వున్నాడు. వినలేక వినేవాళ్ళు వింటూనే వున్నారు. కాంగ్రెస్‌లో చేరిన పది రోజులలోపే శ్రవణ్ ఎంత ఎదిగిపోయాడంటే,  నిన్న రాహుల్ గాంధీ తెలంగాణకి వచ్చినప్పుడు ఆయన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించేంత ఎదిగిపోయాడు. ఇది కాంగ్రెస్‌లో వున్నవారికి ఎంతమాత్రం నచ్చడం లేదు. శ్రవణ్‌ని అవసరమైనదానికంటే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారన్న రుసరుసలు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రారంభమయ్యాయి. శ్రవణ్ చాలా ఎక్కువ చేస్తున్నాడన్న కంప్లయింట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శ్రవణ్‌కి కూడా కాంగ్రెస్ పార్టీలో వున్న చాలామంది తనను శత్రువులా చూస్తూ వుండటం భరించలేకపోతున్నాడు. తాను తన ‘టాలెంట్’తో ఎదిగిపోతుంటే టీ కాంగ్రెస్‌లో  ఓర్వలేకపోతున్నారని ఫీలైపోతున్నట్టు సమాచారం. అందువల్ల కాంగ్రెస్‌ని కూడా విడిచిపెట్టి, భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భావిస్తున్న బీజేపీలోకి జంప్ అయిపోతే మంచిదని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం పవన్ కళ్యాణ్ ద్వారా పావులు కదుపుతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే శ్రవణ్ త్వరలో బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయి.

అవనిగడ్డలో టీడీపీకి సవాల్‌గా మారిన రెబల్!

    ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే టీడీపీ ఓడిపోయే మొట్టమొదటి సీటు కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ స్థానమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలహీనమైన అభ్యర్థులు వున్నారు. చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం తరఫున బలహీనమైన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ని ఈ స్థానం నుంచి నిలబెట్టారు. అయితే ఎంతోకాలంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ, స్థానికంగా ప్రజల్లో మంచి పేరు వున్న కంఠంనేని రవిశంకర్ తనకు తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ స్థానం నుంచి టిక్కెట్ ఇస్తుందని ఆశించారు. ఈ మేరకు పార్టీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ తెలుగుదేశంలోకి జంప్ జిలానీ కావడంతో కొత్త ఒక వింత అన్నట్టు చంద్రబాబు స్థానికంగా ఎంతో బలం వున్న కంఠంనేని రవిశంకర్‌ని కాదని బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇచ్చారు. దాంతో కంఠంనేని తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థిగా అవనిగడ్డ స్థానం నుంచి పోటీలో నిలిచారు. ఆయన నామినేషన్ వేసిన రోజున ఆయనతోపాటు వచ్చిన మద్దతుదారులను చూసి తెలుగుదేశం వర్గాలు నోళ్ళు తెరిచాయి. ఇంత బలం వున్న వ్యక్తిని మనం దూరం చేసుకున్నామే అన్న బాధ తెలుగుదేశం వర్గాల్లో మొదలైంది. అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలకు మండలి బుద్ధ ప్రసాద్ మీద నమ్మకం లేదు. ఆయనను గెలిపిస్తే ఏదో పదవిలో ఫిక్సయిపోయి నియోజకవర్గం ముఖమే చూడడన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లోవుంది. అందుకే గత ఎన్నికలలో ఆయనను ఓడించారు. గెలిచినా నియోజకవర్గం ముఖం చూడను.. ఓడినా నియోజకవర్గం ముఖం చూడను అని ఆయన ఆ తర్వాత నిరూపించారు. మొత్తమ్మీద ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మండలి బుద్ధ ప్రసాద్, కాంగ్రెస్ తరఫున పోటీలో వున్న మత్తి వెంకటేశ్వరరావు, వైసీపీ తరఫున పోటీ చేస్తున్న సింహాద్రి రమేష్‌బాబు కంటే టీడీపీ రెబల్‌గా రంగంలో వున్న కంఠంనేని రవిశంకర్ బలమైన అభ్యర్థిగా నిలిచారు. అవనిగడ్డలో నిలిచిన అభ్యర్థులందరినీ పరిశీలిస్తే కంఠంనేని రవిశంకర్‌కే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయని రాజకీయ  పరిశీలకులు భావిస్తున్నారు.

అప్పుడు సమైక్యం, ఇప్పుడు సింగపూర్

  గతేడాది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించినప్పటి నుండి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, కేవలం తాను మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలనని చెపుతూ వచ్చారు. అయితే అందుకు ప్రతిగా ప్రజలు తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి,30 యంపీ సీట్లు ఇవ్వాలని కోరుతూ వచ్చారు. అయితే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆయన ఇక ఆ సమైక్య ప్రస్తావనే అసలు ఎత్తడంలేదు. ఇప్పుడు ఆయన కూడా రాష్ట్రాన్ని సింగపూరులా మార్చేస్తానని, మళ్ళీ రాజన్నరాజ్యం ఏర్పాటు చేస్తానని మాత్రమే చెపుతున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమయింది గనుకనే ఆయన ఆ ప్రసక్తి ఎత్తడంలేదని ఆయన మద్దతుదారులు సర్దిచెప్పుకోవచ్చు గాక, కానీ జగన్ మోహన్ రెడ్డి ఆనాడు చేసిన సమైక్య పోరాటమంతా కేవలం ప్రజలను మభ్యపెట్టి, సీమాంద్రాపై పూర్తి పట్టు సాధించేందుకే తప్ప, నిజానికి ఆయనకు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖించే ఉద్దేశ్యం అసలు లేనేలేదని ఋజువు అవుతోంది.   ఒకప్పుడు తెలంగాణాలో పట్టు సాధించేందుకు ‘తెలంగాణా సెంటిమెంటు పట్ల గౌరవం’  ప్రదర్శించారు జగన్. ఆ తరువాత సీమాంధ్రపై పట్టుకోసం ఉత్తుత్తి సమైక్య పోరాటాలు చేసారు. ఇప్పుడు అధికారం సంపాదించేందుకు సింగపూర్ స్కెచ్ గీసి చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణాలో పోటీ చేసేందుకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు రెండూ తనకు రెండు కళ్ళ వంటివని, తన చెల్లెలు షర్మిల ద్వారా చెప్పిస్తున్నారు. ఈవిధంగా మాట నిలకడ, విశ్వసనీయత, ఎటువంటి పరిపాలనానుభవమూ లేని ఆయన అధికారం చేపడితే ఇంకెన్ని స్టోరీలు వినిపిస్తారో మరి!

మోడీ ప్రచారంతో మారనున్న బలాబలాలు

  రాహుల్ గాంధీ నిన్న తన ప్రసంగంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణా ప్రజలను కూడా ఏవిధంగా మోసం చేసారో చాలా సమర్ధంగా చెప్పుకోగలిగారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెప్పట్టగల సత్తా ఉన్న జాతీయపార్టీ అయిన తమకి ఓటు వేయడం ద్వారానే తెలంగాణా అభివృద్ధి సాధ్యం అవుతుంది, తప్ప ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వలన సాధ్యంకాదని గట్టిగా నొక్కి చెప్పారు. అదేవిధంగా తమ పార్టీ గెలిస్తే తెలంగాణకు ఏమేమి చేయబోతున్నామో కూడా చాలా చక్కగా, గొప్పగా వివరించి ప్రజలను ఆకట్టుకోగలిగారు. మళ్ళీ చాలా కాలం తరువాత రాహుల్ గాంధీ, ప్రజలను ఆకట్టుకొనేలా ప్రసంగించడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా సమరోత్సాహంతో ఉన్నాయి.   సరిగ్గా ఇటువంటి సమయంలోనే, నరేంద్ర మోడీ కూడా ఈరోజు తెలంగాణాలో వరుసగా నాలుగు సభలలో ప్రసంగించనున్నారు. ఆయన కూడా కేసీఆర్ లాగే మాటల మాంత్రికుడనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ఆయన కూడా తమ ప్రధాన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెరాసల పైనే, ముఖ్యంగా తమ విజయానికి అడ్డుగోడగా నిలుస్తున్న కేసీఆర్ మీదనే తన అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించవచ్చును.   కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి జరగాలంటే, తమ కూటమికే ఓటేసి అధికారం కట్టబెడితేనే సాధ్యమవుతుందని, ఎటువంటి పాలనానుభావం లేని ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వల్ల కాదని గట్టిగా నొక్కి చెప్పవచ్చును. నరేంద్ర మోడీ కూడా సరిగ్గా ఇదే పాయింటు మీద గట్టిగా మాట్లాడినట్లయితే, అది తప్పకుండా ప్రజలపై చాలా ప్రభావం చూపవచ్చును. అయితే దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మోడీకి అనుకూల పరిస్థితులు కనబడుతున్నందున, ఆ ప్రభావం బీజేపీ-తెదేపా కూటమికి కూడా చాలా లబ్ది చేకూర్చవచ్చునని సర్వే సంస్థల నివేదికలు చాటి చెపుతున్నందున, (తెలంగాణాలో) ఎన్నికలకు ఇంకా కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలిఉన్న ఈ తరుణంలో నేడు నరేంద్ర మోడీ స్వయంగా చేయబోయే ప్రచారం వలన తెదేపా-బీజేపీ కూటమికి సానుకూల వాతావరణం సృష్టించవచ్చును.   అయితే, ఇదే కారణంగా అంటే ఈవిధంగా నాలుగు బలమయిన రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం వలన, ప్రజల ఓట్లు చీలి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రిగా రాజ్యం ఏలాలని కేసీఆర్ కంటున్న కలలు కలలుగానే మిగిలిపోవచ్చును. కానీ, అధికార దాహంతో తహతహలాడిపోతున్న కేసీఆర్, ఇంతకాలం తాను ఏ కాంగ్రెస్ పార్టీని ‘చ్చీ’ కొట్టారో మళ్ళీ అదే పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దపడినా ఆశ్చర్యం లేదు.

పవన్ కళ్యాణ్ పార్టీ ఖరీదు 500 కోట్లు?

  పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడిన తీరు చూసి అందరూ ‘అబ్బో పర్లేదు’ అనుకున్నారు. ఆ తర్వాత రెండోసారి ఆయన మాట్లాడిన తీరు చూసి ‘ఈయనేదో కాస్త తేడాగా వున్నాడే’ అనుకున్నారు. ఆ తర్వాత ఒక్కో స్టెప్‌లోనూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఒక్కో స్టెప్ డౌన్ అవుతూ వస్తోంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం చెప్పినట్టు ఆడే వ్యక్తి అనే ఇమేజ్ వచ్చేసింది. అయితే పవన్ పార్టీ వెనుక వున్న రహస్యాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఈ రహస్యాల గురించి చర్చ భారీ స్థాయిలో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించడానికి, ఆ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఐదు వందల కోట్లు చేతులు మారాయనేది తాజా చర్చ. ఈ చేతులు మారే వ్యవహారానికి మధ్యవర్తిలా వ్యవహరించింది ఘనత వహించిన తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడట. అందరూ ఇంతకాలం జనసేన పార్టీ ప్రకటించిన తర్వాతే మోడీ నుంచి పవన్‌కి పిలుపు వచ్చందని, అప్పుడే ఆయన గుజరాత్‌కి వెళ్ళి మోడీని కౌగలించుకున్నాడని అనుకుంటున్నారు. అయితే అంతకుముందే మోడీతో పవన్ సీక్రెట్‌గా మాట్లాడుకుని 500 కోట్ల డీల్ కుదర్చుకున్నాడని అనుకుంటున్నారు. ఆమధ్య హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘అత్తారింటికి దారేది’ సినిమా సక్సెస్ మీట్ జరిగిన తర్వాత పవన్‌కి చంద్రబాబు నుంచి పిలుపు వచ్చిందట. వెంటనే పవన్ చంద్రబాబుని కలవటం, చంద్రబాబు మోడీతో పవన్‌ని లింక్ చేయడం జరిగిపోయిందట. ఈ రకంగా పవన్ కళ్యాణ్‌ని ఇమేజ్‌ని ఓట్లుగా మలచుకోవడానికి బీజేపీ, టీడీపీ కలసికట్టుగా కథ నడిపారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు.

రెంటికీ చెడ్డ రేవడి కానున్న జూనియర్ ఎన్టీఆర్!

  నాన్నచాటు బిడ్డలాగా, నాన్న చెప్పినట్టే వింటున్న జూనియర్ ఎన్టీఆర్ రాబోయే కాలంలో ఇటు రాజకీయ రంగానికి, అటు సినిమా రంగానికి దూరమై రెంటికీ చెడ్డ రేవడి అవడం ఖాయమన్న అభిప్రాయాలు అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో ఎవరూ పిలవకుండానే వచ్చి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి చప్పుడు చేయడం లేదు. తన తండ్రి నందమూరి హరికృష్ణకి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం లభించకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా వున్నాడనేది బహిరంగ రహస్యం. అయితే ఎన్టీఆర్ సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ప్రధాన కారణం ఆయనకు తెలుగుదేశం పార్టీ అండగా వుండటమే. ఆయన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కూడా వుంది. భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలన్నా తెలుగుదేశం పార్టీతోనే ఆయనకు భవిష్యత్తు వుంటుంది. తెలుగుదేశం అభిమానులు చూడటం, ప్రమోట్ చేయడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ విజయాలు అందుకుంటున్నారన్న అభిప్రాయం జనాల్లో వుంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమైన తర్వాత ఆయనకు సినిమా రంగంలో అన్ని ఫ్లాపులే వస్తూ వుండటాన్ని దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. అటు సినిమా అయినా, ఇటు రాజకీయమైనా తనకు భవిష్యత్తు టీడీపీతోనే వుందని తెలిసినా కావాలని దూరమవుతూ వుండటం అతనికే మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రచారానికి రావడానికి ఎవరూ బొట్టుపెట్టి పిలవరు, ఎవరికి వారే రావాలని చంద్రబాబు దగ్గర్నుంచి, లోకేష్ వరకూ అందరూ చెబుతూనే వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆరే పంతం తగ్గించుకున్ని తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి ముందుకు వస్తే అందరికీ బాగుంటుందన్న అభిప్రాయాలున్నాయి. అయితే జూనియర్ తెలుగుదేశానికి ప్రచారానికి రాకపోగా వైకాపాలోకి వెళ్ళిన కొడాలి నానికి మద్దతు ఇస్తూ వుండటం, తనకు సంబంధించిన ఛానల్‌లో వైకాపాకు మద్దతు ఇస్తూ వుండటం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావాలంటే ఆయన తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి ముందుకు రావాలని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.

నందమూరి హరికృష్ణ పప్పులుడకలేదు

  ఎన్టీఆర్ పెద్ద కొడుకైనప్పటికీ హరికృష్ణ అటు సినిమాల్లోగానీ, రాజకీయాల్లోగానీ ఎందుకు షైన్ కాలేకపోయాడు? ఏ రంగంలోనూ తనదైన ముద్ర ఎందుకు వేయలేకపోయాడు? ఇలాంటి సందేహాలు ఆంధ్రప్రదేశ్‌లో చాలామందికి వస్తుంటాయి. అలాంటి వారందరికీ సమాధానం తాజాగా హరికృష్ణని గమనిస్తే దొరకుతాయి. హరికృష్ణ మొదటి నుంచీ రాజకీయంగా గెస్ట్ ఆర్టిస్టులా వున్నాడు. రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆయన పెద్దగా పరిపాలనా దక్షతను ప్రదర్శించిందేమీ లేదు. ఎన్టీఆర్ కొడుకైనందువల్ల చంద్రబాబు అప్పుడప్పుడు హరికృష్ణకి ప్రాధాన్యం ఇస్తూ వచ్చాడు. అయితే దానిని హరికృష్ణ నిలుపుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ వెలుగులోకి రావడంలో అతన్ని అడ్డం పెట్టుకుని హరికృష్ణ చంద్రబాబు దగ్గర డిమాండ్ల చిట్టా పెట్టడం మొదలుపెట్టాక చంద్రబాబు హరికృష్ణని మెల్లగా దూరం చేయడం ప్రారంభించాడు. పోనీలే కదా అని రాజ్యసభకి పంపిస్తే, ఆ కోపం ఈకోపం రాజ్యసభ స్థానం మీద చూపించి రాజీనామా చేసేశాడు. దరిద్రమేంటోగానీ, సమైక్య ఉద్యమం సందర్భంగా ఎవరి రాజీనామాను ఆమోదించని రాజ్యసభ ఛైర్మన్ హరికృష్ణ రాజీనామాని మాత్రం చటుక్కున ఆమోదించేశాడు. దీనికితోడు చంద్రబాబు కూడా ‘రాజీనామా చేశావా... సర్లే’ అని కూడా అనకుండా సైలెంట్‌గా వున్నాడు. దాంతో హరికృష్ణలోని అహం బాగా దెబ్బతింది. ఎన్నికలు వచ్చాక హరికృష్ణ అసెంబ్లీ టిక్కెట్ అడిగాడు. మొదట హిందూపురం, తర్వాత పెనమలూరు, ఆ తర్వాత నూజివీడు.. ఏ టిక్కెట్టు అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. హరికృష్ణ మీడియా ముందుకు వచ్చి మొత్తుకున్నా సీటు ఇవ్వలేదు. బీజేపీలోకి వెళ్తానని, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బెదిరించినా బాబు దారికి రాలేదు. చివరికి హరికృష్ణ కూడా నామినేషన్ ఏమీ వేయకుండానే ఇంట్లో కూర్చున్నాడు. ఇదీ హరికృష్ణ పరిస్థితి. పప్పులుడికినంతకాలం తెలుగుదేశంలో బాగానే హవా నడిపాడు. ఇప్పుడు పప్పులుకకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీచేసే సత్తా, బీజేపీలో చేరే దమ్ము లేక సైలెంటైపోయాడని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

అవనిగడ్డపై చంద్రబాబు అంతర్మథనం

  కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ టిక్కెట్‌ని కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన మండలి బుద్ధ ప్రసాద్‌కి కేటాయించిన విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఆల్రెడీ ఓడిపోయిన బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వొద్దని అక్కడి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మొత్తుకున్నారు. అయినప్పటికీ వినకుండా చంద్రబాబు నాయుడు మండలికి టిక్కెట్ ఇచ్చారు. అది స్థానిక తెలుగుదేశం నాయకులలో, తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసిన వారిలో ఆవేదన కలిగించింది. టీడీపీ కార్యకర్తల ఆవేదనని మొదట్లో పట్టించుకోని చంద్రబాబు ఆ తర్వాత జరిపిన ఎంక్వయిరీలో అవనిగడ్డ స్థానం నుంచి మండలికి గెలిచే సీన్ లేదని తెలిసి నాలుక్కరుచుకున్నట్టు సమాచారం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవచ్చు. కానీ మండలికి టిక్కెట్ ఇచ్చిన విషయంలో ఏం చేయాలో అర్థంకాక చంద్రబాబు అయోమయంలో పడిపోయినట్టు సమాచారం. దానికితోడు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా రంగంలో నిలిచిన రవిశంకర్ కంఠంనేని ఇప్పుడు స్థానికంగా మండలి బుద్ధ ప్రసాద్‌కంటే బలమైన అభ్యర్థిగా వుండటంతో చంద్రబాబుకు కృష్ణాజిల్లాలో పరువు పోయేట్టుందే అని దిగులు పట్టుకుందని సమాచారం. తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేయడంతోపాటు, స్థానిక ప్రజల సమస్యల మీద పూర్తి అవగాహన, ఆ సమస్యల పరిష్కారం విషయం అవగాహన వున్న వ్యక్తిగా రవిశంకర్ కంఠంనేనికి అవనిగడ్డ నియోజకవర్గంలో మంచి గుర్తింపు వుంది. వ్యక్తిగతంగా కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు స్థానిక ప్రజల్లో ఆయన మీద అభిమానం వుంది. ఇప్పుడు అవనిగడ్డలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైకాపా అభ్యర్థుల కంటే టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన రవిశంకర్ కంఠంనేనికే ఎక్కువ బలం వుందని స్పష్టంకావడంతో తెలుగుదేశంతో పాటు మిగతా రెండు పార్టీలు ఈ స్థానంలో గెలుపు మీద ఆశలు వదిలేసుకుని చేతులెత్తేసినట్టు తెలుస్తోంది.

జగన్‌కి కారు.. వైకాపాలో కంగారు!

  లక్షల కోట్లు వెనకేసుకున్న జగన్ సార్ ఎన్నికల కమిషన్‌కి సమర్పించిన నామినేషన్‌లో, అఫిడవిట్‌లో తాను సొంత కారు కూడా లేనంత పేదవాడినని పేర్కొన్నారు. లక్షల కోట్ల ఆస్తుల్ని వందల కోట్లకు తగ్గించి చూపడంతో సంతృప్తి చెందకుండా, కారు కూడా లేదని చెప్పడం ఎన్నికల కమిషన్ చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టడం కాక మరేమవుతుంది? అయితే ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో జగన్ గారికి అసలు ఆస్తుల సంగతి ఎలా వున్నా, అయ్యగారి పేరు మీద రెండు ఖరీదైన కార్లు వున్న విషయం బయటపడింది. ఒకటేమో నల్లరంగు బీఎండబ్ల్యు కారు. నంబర్ ఎపి 09 బీఎన్ 2345, మరోటి స్కార్పియో నంబర్ ఎపి 09 బీబీ 1229. ఈ రెండు కార్ల విషయంలో జగన్ తప్పుడు ప్రమాణపత్రం ఇవ్వడంతో ఇప్పుడు ఈ ఇష్యూ ఎటువైపు దారి తీస్తుందోనని వైకాపా వర్గాల కంగారు పడుతున్నాయి. ఈ విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే జగన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంతోపాటు ఏడాదిపాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం వుంది. అయితే ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని తనకు తానుగా పరిశీనలోకి తీసుకోదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో జగన్ మీద ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

నారా లోకేష్‌పై దాడి : టీఆర్ఎస్ వాళ్ళకి మెంటలెక్కిందా?

  టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి హోల్‌సేల్‌గా మెంటలెక్కిందా అనే సందేహాన్ని ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాల వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ దగ్గర్నించి గల్లీలో వుండే ఛోటా లీడర్ వరకు మెంటలెక్కినట్టు అందరూ విచిత్రంగా బిహేవ్ చేయడం చూసి జనం ఈ నిర్ణయానికి వచ్చారు. గతంలో వేసిన మెంటల్ వేషాల సంగతి అలా వుంచితే, తాజాగా నారా లోకేష్ తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తుంటే ఆయన మీద మద్యం సీసాలు, మామిడికాయలతో దాడిచేయడం మెంటల్ పని కాక మరేమిటని జనం ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్‌కి తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం లేకపోతే, ఆ పార్టీ అధికారంలోకి రావడం నచ్చకపోతే ఆ విషయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప ఇలా భౌతిక దాడులకు పాల్పడటం న్యాయం కాదని తెలంగాణ ప్రజలే అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రావడం కోసం కృషి చేసిన ఒకపార్టీగా టీఆర్ఎస్ మీద వున్న గౌరవం ఇలాంటి సంఘటనల వల్ల మెల్లమెల్లగా తగ్గిపోతోందని వారు అంటున్నారు. నారా లోకేష్ మీద మాత్రమే కాకుండా హైదరాబాద్‌లో తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి దానం నాగేందర్ మీద కూడా తెరాస కార్యకర్తలు దాడి చేశారు. ప్రచార కార్యక్రమంలో గందరగోళం సృష్టించారు. ఈ ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడం అసంభవమని తెరాసకి అర్థమైపోయింది. ఎవర్ని ఎన్నిరకాలుగా తిట్టినా తెలంగాణ ప్రజలు తెరాసను నమ్మడం లేదు. ఆ డిప్రెషన్‌లో టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పవన్, కిరణ్ ఇద్దరు త్యాగ మూర్తులు

  పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డిల జనసేన, జై సమైక్యాంధ్ర పార్టీల మధ్య కొన్ని సారూప్యతలు, తేడాలు ఉన్నాయి. ఇద్దరూ ఎన్నికల ముందే పార్టీలు స్థాపించారు. ఇద్దరూ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తునందునే పార్టీలను స్థాపించారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తున్నారు. ఇద్దరూ ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. కిరణ్ సమైక్యం కోసమే ఎన్నికలలో పోటీ చేయకుండా త్యాగం చేశానని చెపుతుంటే, పవన్ దేశ సమగ్రతని కాపాడటం కోసం ఇంకా అనేక చిన్న చితకా కారణాలతో ఎన్నికలని త్యాగం చేసారు. కిరణ్ నేటికీ సమైక్యరాగం తీస్తుంటే, పవన్ మోడీజంలో ఉన్న మజా వేరెందులో లేదని బల్లగుద్ది చెపుతున్నారు. కిరణ్ ఎక్కడా కనబడని స్వంత పార్టీకి డప్పుకొట్టుకొంటుంటే, పవన్ మాత్రం బీజేపీకి డప్పు కొడుతున్నారు.   ఇక పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీకి రెండో సభతోనే మంగళ హారతి పలికేయగా, కిరణ్ మాత్రం ఎవరు వెంట వచ్చినా రాకున్నా, ఎవరు ఆదరించినా లేకున్నా ఒంటరిగా పార్టీని నెట్టుకుపోతూనే ఉన్నారు. పైగా ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో కూడా తన అభ్యర్ధులను నిలబెట్టారు. కానీ, పొట్లూరి వరప్రసాద్ కాళ్ళావెళ్ళా పడినా పవన్ కళ్యాణ్ కనీసం ఆయనను కూడా పోటీలో నిలబెట్టలేదు. పవన్ కళ్యాణ్ తెదేపా, బీజేపీలకు మద్దతు ప్రకటించినప్పటికీ ఆయన ఇంతవరకు కేవలం బీజేపీకి మాత్రమే ప్రచారం చేసారు. తెదేపాకు చేస్తారో లేదో తెలియదు. కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ సమైక్యమయిపోవచ్చును. కానీ జనసేన ఎవరి వెనుక నడవాలన్నా పార్టీలో ఆయన తప్ప మరెవరూ లేరు గనుక, ఎన్నికల తంతు పూర్తయిపోగానే సినీపరిశ్రమకి తిరిగి వెళ్లిపోతారేమో!

పవన్‌ జీ.. సికింద్రాబాద్‌లో ప్రచారం చేయవా ప్లీజ్!

      వెండితెర పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ అయ్యాడు. తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ సంబంధాలు అంతంతమాత్రంగానే వున్నప్పటికీ, ఆయన బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీన్ని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మంచి అవకాశంగా తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌ని బాగా వాడుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తమ నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేస్తే తమ దశ తిరిగిపోతుందని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి కొంతమంది అడ్వాన్స్ అయిపోయి పవన్ కళ్యాణ్‌ని సంప్రదిస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పవన్ కళ్యాణ్‌ని కలిశారు. రాజకీయంగా తనకున్న సుదీర్ఘ అనుభం గురించి, దేశానికి తాను చేసిన సేవ గురించి పవన్ కళ్యాణ్‌కి వివరించిన దత్తాత్రేయ  ఈ ఎన్నికలలో సికింద్రాబాద్‌కి వచ్చి తనకు ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని, వయసు కూడా పైబడిందని, అందువల్ల తనమీద కాస్తంత అభిమానం చూపించి తనకు ప్రచారం చేయాల్సిందిగా దత్తాత్రేయ పవన్‌ని కోరినట్టు సమాచారం. మిగతా అభ్యర్థుల మాదిరిగా డబ్బు వెదజల్లే అవకాశం తనకి లేదని, అంతేకాకుండా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా తన గెలుపుకి సహకరించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమరే నన్ను కాపాడాలని పవన్‌ని దత్తాత్రేయ కోరినట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఏ విషయం తర్వాత చెబుతానని దత్తాత్రేయతో అన్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు గారూ.. సీఎం రమేష్‌ని కంట్రోల్ చేయండి

      తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నాయకుడు సీఎం రమేష్ పెద్ద సమస్యగా మారారని తెలుగుదేశం నాయకులే ఆరోపిస్తున్నారు. సీఎం రమేష్‌ని నమ్మిన తెలుగుదేశాధినేత చంద్రబాబు ఆయన్ని తన కోటరీలో చేర్చుకుంటే సీఎం రమేష్ తనకు లభించిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. చంద్రబాబుతో సన్నిహితంగా వుండే అవకాశాన్ని పార్టీని బలోపేతం చేయడానికి కాకుండా పార్టీని మరింత బలహీనపరచడానికి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయి.   సీమాంధ్రలోని అనేక  నియోజకవర్గాలలో పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన అనేకమంది నాయకులకు టిక్కెట్లు రాకుండా చేసి, బయటి నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు వచ్చేలా చేశారన్న ఆరోపణలు కూడా సీఎం రమేష్ మీద వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలలో ఓడిపోయే అభ్యర్థులను తెలుగుదేశం నిలబెట్టడానికి కూడా ఆయన కారణమని అంటున్నారు. చాలామంది తెలుగుదేశం రెబల్స్ గా పోటీ చేయడానికి సీఎం రమేష్ అనుసరించిన విధానాలే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న ఈ అభిప్రాయాలు తాజాగా బహిర్గతమయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డికి ఈసారి టిక్కెట్ రాకపోవడానికి సీఎం రమేష్ ప్రధాన కారణమని ఆయన అనుయాయులు ఆరోపిస్తున్నారు. తనకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో కనుక్కోవడానికి లింగారెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లింగారెడ్డి వర్గీయులు సీఎం రమేష్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇంతకాలం పార్టీలోనే వున్న గుట్టు రట్టయింది. ఇప్పటికైనా చంద్రబాబు సీఎం రమేష్‌ని అదుపులో పెట్టి పార్టీని కాపాడాలని పలువురు నాయకులు చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రాజ్యసభలో సీఎం రమేష్ తెలుగువారి పరువు పోయేలా ప్రవర్తించిన విషయాన్ని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.