చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి, పవన్ రాజకీయాల్లోకి...
posted on May 21, 2014 7:20AM
కేంద్రమంత్రిగా, సోనియాగాంధీకి అంతరంగికుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ చైర్మన్ గా ఒకవెలుగువెలిగిన చిరంజీవి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకలా తయారయింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఓడిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆయన మళ్ళీ సినిమాలలో నటించాలని ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం. ఆయన తన 150 చిత్రం గురించి చాలా కాలంగా అభిమానులను ఊరిస్తున్నారు. ఇప్పుడు ఎలాగూ ఇక ఖాళీయే గనుక ముందు ఆ సినిమాను పూర్తిచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఐదేళ్ళు సినిమాలలో నటిస్తూ ప్రజలను మళ్ళీ ఆకట్టుకొనగలిగితే, వచ్చే ఎన్నికల సమయానికి అదేమయినా ఉపయోగపడవచ్చును కూడా.
ఇక ఇంతవరకు సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్, ఈ ఐదేళ్ళలో తన జనసేన పార్టీని నిర్మించుకొని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోవాలని యోచిస్తున్నారు. జనసేన పార్టీ ఈ ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ, రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన పార్టీలు సక్రమంగా పనిచేయకపోతే వాటిపై ప్రజల తరపున పోరాడుతానని కూడా పవన్ చాలా సార్లు చెప్పారు. అందుకోసం ఇకపై తాను సినిమాలు తగ్గించుకొని, రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఈవిధంగా అన్న రాజకీయాల నుండి తప్పుకొని సినిమాలలోకి వస్తుంటే, తమ్ముడు సినిమాల నుండి తప్పుకొని రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్దం అవడం చాలా ఆసక్తికరంగా ఉంది.
గత ఐదేళ్ళుగా చిరంజీవి రాజకీయాలలో ఉన్నప్పటికీ ఇంతవరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోలేకపోయారు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం, ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ, రాజకీయాలలో ప్రవేశించిన రెండు మూడు నెలలలోపునే, రాష్ట్ర రాజకీయాలలో తనదయిన ముద్రవేసి దేశానికి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోడీ మనసు చూరగొని ఎన్డీయే సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు.
పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఆయనలో ఉన్న నిజాయితే. అన్న చిరంజీవి పదవుల కోసం కోట్లాది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియా గాంధీ కాళ్ళ ముందు పెట్టి ఒక సగటు రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి వారి శ్రేయస్సు కోసం పదవులను కాదనుకొని పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాటలలో, వ్యవహారంలో కొట్టవచ్చినట్లు కనబడుతున్న ఆ నిజాయితీయే ప్రజలను, చివరికి మోడీని కూడా ఆకర్షించింది.
రాజకీయనాయకులలో అరుదుగా కనబడే నిబద్దత, ప్రజలకు మంచి చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో పుష్కలంగా ఉన్నాయి గనుక ఇకనయినా తప్పటడుగులు వేయకుండా ముందుకు సాగినట్లయితే, ఆయన చెపుతున్నట్లు వచ్చే ఎన్నికల నాటికి బలమయిన రాజకీయ నాయకుడిగా ఎదగవచ్చును.