కేసీఆర్ ధోరణి వలన తెలంగాణకు తీరని నష్టం: చంద్రబాబు
posted on May 24, 2014 @ 2:43PM
తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సచివాలయంలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులపట్ల, తెలంగాణాలో స్థిరపడిన సీమాంధ్రుల పట్ల అనుచితంగా మాట్లాడటాన్ని, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తప్పు పట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ “ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏవిధంగా మాట్లాడినా చెల్లింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నపుడు ప్రజలను భయబ్రాంతులు చేసేలా మాట్లాడటం చాలా తప్పు. ఒక్క సచివాలయమే కాదు యావత్ తెలంగాణాలో ఉన్న ప్రజలందరికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఆయనపై ఉంది. ఏవయినా సమస్యలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప రెచ్చగొట్టడం సరికాదు."
"అసలు కేసీఆర్ యుద్ధం ఎవరి మీద ఎందుకు ప్రకటిస్తున్నారో, ఆ వార్ రూమ్ సమావేశాలు దేనికో నాకు అర్ధం కావడం లేదు. ఆయన ఆవిధంగా మాట్లాడి ఏమి సాధిద్దామనుకొంటున్నారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే, ఈ దేశంలో ప్రజలు ఎక్కడయినా స్వేచ్చగా బ్రతికే హక్కు ఉంది. వారి హక్కులను కాపాడేందుకు చట్టాలు, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయన తాను వాటన్నిటికి అతీతుడిని అనుకొంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగుజాతి ఎన్నటికీ ఒక్కటేనని విషయం ఆయన గుర్తుంచుకోవాలి."
"రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు జాతి అభివృద్ధిలో పోటీపడాలి తప్ప ఈవిధంగా విద్వేషాలు రెచ్చగొట్టుకొంటూ గొడవలు పడటం సరికాదు. రెండు రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ అభివృద్ధి పధంలో ముందుకు సాగాలి. అందుకు నా వంతు సహకారం, కృషి అందించేందుకు ఎల్లపుడూ నేను సిద్దమే. ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ దారుణంగా పడిపోయింది. కేసీఆర్ ఇదేవిధంగా ప్రజలను భయబ్రాంతులను చేసేవిధంగా మాట్లాడుతుంటే అది మరింత పడిపోతుంది. హైదరాబాదుకి సాఫ్ట్ వేర్ కంపెనీలను తీసుకు వచ్చేందుకు నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమ ఫలితంగా హైదరాబద్ నేడు ఈ స్థితికి చేరుకోగలిగింది. దానిని కేసీఆర్ తన మాటలతో కూల్చదలచుకొంటే దాని వలన తెలంగాణకు, ప్రజలకు తీరని నష్టం కలుగుతుంది."
"కేసీఆర్ ఏమిచేసినా, ఏమి మాట్లాడినా చెల్లుతుందని అనుకోవడం పొరపాటు. హైదరాబాదుతో సహా తెలంగాణాలో అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగానిలబడి వారి తరపున పోరాడుతుందని హామీ ఇస్తున్నాను. ఇప్పటికయినా కేసీఆర్ విజ్ఞత ప్రదర్శించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు చొరవ చూపుతారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.