బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ ఉద్యోగులు
posted on May 26, 2014 @ 12:56PM
మరొక వారం రోజుల్లో ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలు విడిపోతున్నఈ తరుణంలో ఉభయ ప్రాంతాలకు చెందిన విద్యుత్ ఉద్యోగులు వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలంటూ మెరుపు సమ్మెకు దిగడం బాధ్యతారాహిత్యమే. ఇంతవరకు వేర్వేరు జేఎసీలు పెట్టుకొని రాష్ట్ర విభజనపై కీచులాడుకొన్న విద్యుత్ ఉద్యోగులు, జీతాల పెంపు విషయం వచ్చేసరికి చాలా ఐకమత్యం ప్రదర్శించడం విశేషం. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారినట్లయితే తమకు నష్టం జరగకూడదనే ముందు చూపుతోనే వారు ఇంత అకస్మాత్తుగా సమ్మెకు దిగారు.ఆ విషయం వారే స్వయంగా చెప్పుకొన్నారు కూడా.
రాష్ట్రంలో ప్రభుత్వం లేని ఈ సమయంలో గవర్నర్ పర్యవేక్షణలో రాష్ట్ర విభజన జరుగుతోంది. ఈ సమయంలో మొత్తం అన్ని వ్యవహారాలు సమర్ధంగా చక్కబెట్టవలసిన గురుతరమయిన బాధ్యత ప్రభుత్వోద్యోగులపైనే ఉంది. అందువల్ల ప్రతీ ఒక్క ప్రభుత్వోద్యోగి కూడా ఈ విభజన ప్రక్రియలో చాలా కీలకమయిన పాత్ర పోషిస్తున్నారు. ఇక సంక్లిష్టమయిన విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాలు అన్నీ కూడా రెండు రాష్ట్రాల మధ్య విభజింపబడుతున్నాయి. ఇటువంటప్పుడు కూడా యావత్ రాష్ట్రానికి విద్యుత్ సరఫరాలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకోవలసిన బాధ్యత విద్యుత్ ఉద్యోగుల మీద ఉంది. కానీ వారు తమ బాధ్యత మరిచి, తమ స్వార్ధం చూసుకొంటూ, రాష్ట్రాన్ని, ఇరుగుపొరుగు రాష్ట్రాలని కూడా అంధకారంలోకి నెట్టేందుకు వెనుకాడకపోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర విభజన కీలక దశకు చేరుకొన్న దశలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడం బాధ్యతారాహిత్యమే.
రాష్ట్రంలో మిగిలిన ప్రభుత్వోద్యోగులు కూడా వారిలాగే తమ స్వార్ధం చూసుకొని సమ్మెకు దిగినట్లయితే పరిస్థితి ఏమిటనే ఆలోచన కూడా లేకుండా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. మిగిలిన ప్రభుత్వోద్యోగులు రాష్ట్ర విభజన సజావుగా జరిగేందుకు రేయింబవళ్ళు పనిచేస్తుంటే, విద్యుత్ ఉద్యోగులు మాత్రం తమ స్వార్ధం తాము చూసుకొంటున్నారు. చివరికి గవర్నర్ 27శాతం జీతాలు పెంపుకు అంగీకరించినా ఉద్యోగులు 30 శాతం ఇవ్వనిదే దిగిరాము అంటు ఇంకా మొండిగా సమ్మె కొనసాగించడం చాలా దారుణం. రాష్ట్రం, ప్రజలు, ఏమయినా పరువలేదు, తమ ప్రయోజనాలే తమకు ముఖ్యమని విద్యుత్ ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తుండటం చాలా దారుణం. ఇప్పటికయినా విజ్ఞత ప్రదర్శించి విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించితే వారికి గౌరవప్రదంగా ఉంటుంది.