దిగివచ్చిన జైరామ్ రమేష్
posted on May 27, 2014 @ 12:16PM
కుహానా మేధావిగా పేరు సంపాదించుకొన్న మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ రాష్ట్ర విభజనలో చూపిన అత్యుత్సాహం గురించి తెలియనివారు లేరు. ఆయన చూసి రమ్మంటే కాల్చివచ్చే బాపతు అని తెలిసినప్పటికీ, సోనియాగాంధీ ఆయననే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి ఏరికోరి పంపారు. రాష్ట్ర విభజనలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు గనుక ఆయననే తెలంగాణకు పంపినట్లయితే కాంగ్రెస్ కు మరింత లబ్ది కలగవలసి ఉంది. పైగా తెలంగాణా ఇచ్చిన కారణంగా కాంగ్రెస్ పార్టీకి మంచి విజయావకాశాలు కూడా బాగా ఉన్నాయి. కానీ జైరామ్ రమేష్ వాచాలత్వం, దుందుడుకుతనంతో తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఊహించనంత ఘోరపరాజయం పాలయింది.
కాంగ్రెస్ పార్టీ చేసిన మరో తప్పు ఏమిటంటే, రాష్ట్ర విభజన తో ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజల వద్దకు కూడా ఆయననే పంపించడం. ఆయన పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడిన మాటల వల్ల సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కకుండా పోయింది. అయితే ఆయన అదృష్టమో, కాంగ్రెస్ దురదృష్టమో కానీ ఆ పార్టీ దేశవ్యాప్తంగా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంతో, ఆయన చేసిన ఘోరతప్పిదాలు కనబడకుండా పోయాయి.
నిన్న మొన్నటి వరకు సకల రాజలాంఛనాలతో ‘రాజు వెడలె రవి తేజములరియగా...కుడి ఎడమలు డాల్కత్తులు మెరియగ..’ అన్నట్లు కాంగ్రెస్ నేతలు వెంటరాగా ఊరేగిన ఆయన, మొన్న డిల్లీలో ఆంధ్రాభవన్ కు వచ్చి చంద్రబాబుని కలిసి రాష్ట్ర విభజనకు సంబందించిన కొన్ని ఫైళ్ళను ఆయనకు అందజేసి, ఆ వివరాలను తెలిపారు. అంతే గాక ఒకవేళ కేసీఆర్ కోరినట్లయితే ఆయనకు కూడా సదరు వివరాలను అందించగలనని మీడియాకు తెలిపారు.
కొన్ని నెలల క్రితం రాష్ట్ర విభజన జరుగుతున్న తీరుని నిరసిస్తూ చంద్రబాబు స్వయంగా డిల్లీలో నిరాహార దీక్ష చేసినా అప్పుడు ఈ జైరామ్ రమేష్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా చంద్రబాబుని వెతుకొంటూ వచ్చి విభజన ఫైళ్ళను అందించడం చూస్తే నవ్వొస్తుంది. ఒకప్పుడు లక్షలాది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తుంటే, వారి ఉద్యమాన్ని, ఆవేదనని అపహాస్యం చేసిన ఇటువంటి కాంగ్రెస్ నేతలకు ప్రజలు తగిన విధంగానే బుద్ధి చెప్పారు. ఇటువంటి అనేకమంది అహంకారులు, కుహన మేధావులు, కుహన లౌకికవాదుల సలహాల వలనే కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టింది.