స్వశక్తిని నమ్మే చంద్రబాబుకి స్వామీజీలతో పనేంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ఎవరూ ఊహించని, కనీవినీ ఎరుగని పని పనిచేశారు. చంద్రబాబు నాయుడేంటి.. ఈ పని చేయడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసిన పని ఏమిటంటే, ఆయన ఒక స్వామీజీ హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ చంద్రబాబు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. సదరు స్వామీజీ చంద్రబాబు చేత ప్రత్యేక పూజలు చేయించారు. ఆ స్వామీజీ మరెవరో కాదు.. ప్రకాశం జిల్లాకు చెందిన వివాదాస్పద స్వామీజీ రామదూత స్వామి. రామదూత స్వామీజీ మీద భూ కబ్జాలకు సంబంధించిన ఎన్నో ఆరోపణలున్నాయి. అలాంటి స్వామీజీ నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం వింతల్లోకెల్లా వింత!
రాజకీయ నాయకులు స్వామీజీల దగ్గరకి వెళ్ళడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మామూలే. అయితే చంద్రబాబు నాయుడు లాంటి ప్రాక్టికల్ వ్యక్తి ఇలా స్వామీజీ దగ్గరకి వెళ్ళడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడి మీద కొన్ని నిశ్చితాభిప్రాయాలు వున్నాయి. చంద్రబాబు నాయుడు స్వశక్తిని నమ్ముకుంటారు. ఏ పనినైనా శ్రమశక్తి ద్వారానే సాధిస్తారు. స్వామీజీలు, బాబాల దగ్గరకి ఆయన వెళ్ళరు.. వారిని ఆయన దగ్గరకి రానివ్వరు. కానీ, ఆదివారం జరిగిన సంఘటన ప్రజల నమ్మకానికి విరుద్ధంగా వుంది. తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపినప్పటికీ ప్రజలు ఆయన్ని పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ ఆయన నిరాశపడకుండా తన శక్తిని తాను నమ్మకున్నారు. ప్రజల్లో తనమీద వున్న నమ్మకాన్ని నమ్మకున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారంటే దానికి కారణం ప్రజలకు ఆయన మీద వున్న నమ్మకం, తెలుగుదేశం కార్యకర్తల శ్రమే తప్ప స్వామీజీలు కాదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సింది చంద్రబాబు నాయుడి శ్రమే తప్ప స్వామీజీల ఆశీస్సులు కాదు.
ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ క్షేమం కోరుకుని రామదూత స్వామీజీ ఆశీస్సుల కోసం వెళ్ళారని కాసేపు అనుకుందాం. ఆ కోణంలో చూసినా రామదూత స్వామీజీకి అంత సీను లేదు. ఎందుకంటే గతంలో ఆయన్ని సందర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న చాలామంది రాజకీయ నాయకులు, సినిమావాళ్ళు బావుకుందేమీ లేదు. వాళ్ళెవరిమీదా సదరు స్వామీజీ ఆశీస్సులు ఫలించలేదు. వాళ్ళంతా ఫెయిల్యూర్స్ బాటలోనే నడిచారు. ఉదాహరణకి గాలి జనార్దనరెడ్డిని తీసుకుందాం. ఆయన గతంలో చాలాసార్లు రామదూత స్వామీజీని సందర్శించడానికి ఆయన ఆశ్రమానికి హెలికాప్టర్లో వెళ్ళేవారు. హెలికాప్టర్లో పెట్రోలు అయిపోయేలా ఎన్నిసార్లు స్వామీజీ చుట్టూ తిరిగినా గాలి జనార్దనరెడ్డికి, ఆయన తమ్ముడికి జైల్లోపడే రాత తప్పలేదు. ఇంకా మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, జయప్రద, అమర్‌సింగ్, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మాజీ మంత్రి మునియప్ప... ఇలాంటి రాజకీయ నాయకులందరూ రామదూత స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించుకుని ఆశీస్సులు అందుకున్నవారే. స్వామీజీ అశీస్సులు అందుకోకముందు అందరూ బాగానే వున్నారు. ఆశీస్సులు అందుకున్న తర్వాత అదేం చిత్రమోగానీ ఎవరూ బాగాలేరు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నాలుగైదుసార్లు స్వామీజీ ఆశ్రమానికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఆశీస్సుల పుణ్యమా అని ఆ తర్వాత ఎడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. ఆయన ఇంతవరకూ రాజకీయంగా నిలదొక్కుకోలేక అల్లాడుతున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘శక్తి’ సినిమా తీసే సమయంలో చీటికి మాటికి రామదూత స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి ఆశీస్సులు అందుకునేవారు. ఆయన ఎన్ని ఆశీస్సులు అందుకున్నా ‘శక్తి’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలాంటి ఉదాహరణలన్నీ చూస్తే రామదూత స్వామీజీ ఆశీస్సులకు అంత పవర్ లేదని అర్థమవుతోంది. పవర్ లేని సంగతి అలా వుంచితే, సదరు స్వామీజీ ఆశీస్సులు అందుకున్న అందరి కెరీర్లూ రివర్స్ గేర్‌లో నడిచాయి. చదివిస్తే ఉన్నమతి పోయిందన్నట్టు, ఈ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే కింగుల్లాంటి వాళ్ళు కూడా డంగైపోయారు.
అందువల్ల మేమెంతో గౌరవించే చంద్రబాబు నాయుడు గారూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు మీ స్వశక్తితో ఒక సైనికుడిలా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్వామీజీల సందర్శనానికి వెళ్ళడాన్ని ప్రజలు ఎంతమాత్రం జీర్ణించుకోలేదు. కాబట్టి మీరు ఇలాంటి స్వామీజీల చుట్టూ తిరగడం మానేయండి. ఆ తిరిగేదేదో ప్రజల చుట్టూ తిరగండి. ప్రజల్ని, తెలుగుదేశం విజయానికి తోడ్పడిన కార్యకర్తల్ని ఆదుకోండి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే వుంటాయి.. మీకు ఏ స్వామీజీలు.. బాబాజీల ఆశీస్సులు అవసరం లేదు.