ఆంధ్రా విద్యార్ధులను ఎవరు ఆదుకొంటారు?
posted on Jun 16, 2014 @ 11:08AM
హైదరాబాదులో చదువుకొంటున్న ఆంధ్రా విధ్యార్దులకు, తెలంగాణా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించిన కేసీఆర్, ఈ విద్యా సంవత్సరం నుండి కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అందువల్ల ఈరోజు ఆయన నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనను కూడా చర్చకు పెట్టబోతున్నారు. బహుశః ఈ ప్రతిపాదనకు ప్రతిపక్షాల నుండి మిశ్రమ స్పందన రావచ్చును.
ఆయన తెలంగాణా ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈవిధంగా కొంత భారం తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు చెపుతున్నప్పటికీ, తెలంగాణా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలందరినీ సమానంగా చూడవలసిన ఆయన, ఆంద్ర విద్యార్దులపట్ల ఈవిధంగా వివక్ష చూపాలనుకోవడం వలన విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చును. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కొన్ని సూచనలు చేసి అందుకు ఆయన అంగీకరిస్తే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఏమయినప్పటికీ, తెలంగాణాలో పుట్టి పెరిగి అక్కడే చదువుకొంటున్న విద్యార్ధులు, తెలంగాణా విద్యార్ధులు, ఆంధ్రా నుండి వచ్చిన విద్యార్ధులకు కేసీఆర్ ప్రభుత్వం వేర్వేరు విధానాలు అవలంభించాలనుకొంటే అది విద్యార్ధులలో కూడా చీలికలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆంద్ర విద్యార్ధులలో, వారి తల్లి తండ్రులలో అభద్రతా భావం సృష్టిస్తుంది. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం ఈవిషయంలో ప్రతిపక్షాల సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మేలు.
ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వని పక్షంలో దానిపైనే ఆధారపడి చదువుకొంటున్న వందలాది విద్యార్ధులు చదువులు కొనసాగించలేని దుస్థితి ఏర్పడుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో హైదరాబాద్ కు చెందిన విద్యార్ధులు మరణించినపుడు చంద్రబాబు స్వచ్చందంగా ముందుకు వచ్చి తక్షణమే సహాయచర్యలు చేప్పట్టి, మరణించిన విద్యార్ధులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఏవిధంగా మానవతా దృక్పదం ప్రదర్శించారో అదేవిధంగా కేసీఆర్ కూడా ఆంధ్రా విద్యార్దులపట్ల మానవతా దృక్పధంతో స్పందిస్తే అందరూ హర్షిస్తారు. ఒకవేళ తన ప్రభుత్వమొక్కటే వారి భారం మోయలేదని ఆయన భావిస్తే ఆయన చంద్రబాబుని సంప్రదించి ఇరు ప్రభుత్వాలు విద్యార్ధుల భాద్యతను స్వీకరిస్తే అందరూ హర్షిస్తారు.