ఒకదెబ్బకు రెండు పిట్టలా?
posted on Jun 13, 2014 @ 10:00AM
నిన్న వైజాగ్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో క్విడ్-ప్రో క్రింద జరిగిన అక్రమ భూపంపకాలను గుర్తించి, అటువంటి భూములను తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని నిర్ణయించారు. అందుకోసం మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని వేసేందుకు చంద్రబాబు అంగీకరించారు. క్విడ్ ప్రోకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు ప్రభుత్వం తన తొలి సమావేశంలోనే అతని చుట్టూ మరింత గట్టిగా ఉచ్చు బిగించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా ద్వేషం లేదని, అక్రమంగా కేటాయించబడ్డ ప్రభుత్వ భూములను గుర్తించి వెనక్కు తీసుకోవడానికే ఈ ప్రతిపాదనకు అంగీకరించానని చెప్పుకొన్నారు. కానీ అన్ని నదులు చివరికి సముద్రంలోనే కలిసినట్లుగా, అన్నిక్విడ్ ప్రో కేసులూ చివరికి జగన్మోహన్ రెడ్డి కేసులలోనే కలుస్తున్నాయి గనుక ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన మిగిలినవారందరితో పాటు జగన్మోహన్ రెడ్డికీ మళ్ళీ సమస్యలు తప్పవని అర్ధం అవుతోంది.
ప్రస్తుతం అతనిపై ఇదే వ్యవహారంలో పది చార్జ్ షీట్లు సీబీఐ కోర్టులో ఉన్నాయి. గనుక ఆ కేసులతో సంబంధం ఉన్న భూముల వ్యవహారంలో మంత్రుల సబ్-కమిటీ వేలు పెట్టలేదు కానీ ఇంకా అటువంటివి మరేమయినా ఉన్నాయేమో తెలుసుకొని వాటిని వెనక్కు తీసుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఇదివరకు జగన్ క్విడ్ ప్రో కేసులపై సమగ్ర దర్యాప్తు చేసి, సీబీఐ కోర్టులో జగన్ పై చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణను తిరిగి రప్పించి ఆయనకే ఈ భాద్యతలు అప్పగిస్తే బాగుటుందని మంత్రులు దేవినేని ఉమా, బొజ్జల గోపాల కృష్ణ చేసిన సూచనకు చంద్రబాబుకు అంగీకారం తెలిపారు. త్వరలో కేంద్రంతో మాట్లాడి ఆయనను వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
గత పదేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములు క్విడ్ ప్రో పద్దతిలో అక్రమంగా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు రాజధాని, కొత్తగా స్మార్ట్ సిటీలు, శాటిలైట్ సిటీలు రోడ్లు, భవనాలు నిర్మాణం కోసం వేల ఎకరాల భూములు, డబ్బు చాలా అవసరం. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా పంచబడిన ఆ లక్షల ఎకరాల భూములలో సగమయినా వెనక్కి రాబట్టగలిగినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. పైగా ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఈ వ్యవహారామంతా జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకే పరిమితం చేసినట్లయితే విమర్శలు మూటగట్టుకోవడం తధ్యం.
అయితే అక్రమంగా పంచబడిన భూములను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోనగలిగితే, కాగల కార్యం ఆ లక్ష్మి నారాయణుడే చక్కబెట్టగలరు. అప్పుడు చంద్రబాబు ఆశించినట్లు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవుతుంది.