వైజాగ్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం
posted on Jun 10, 2014 @ 4:43PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు తన మొట్ట మొదటి మంత్రివర్గ సమావేశం విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రవిశ్వవిద్యాలయంలో రెడ్డి ఆడిటోరియంలో జూన్ 12న ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబోతున్నారు. ఇంతకాలం ఇటువంటి కార్యక్రమాలన్నీ కేవలం హైదరాబాదుకే పరిమితంయ్యేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విశాఖలోనే జరగబోతుండటంతో విశాఖ నగరవాసులు చాల సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.
కానీ నాలుగైదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలందరూ కలిసి నిర్మించుకొన్న హైదరాబాదు నగరాన్ని వదులుకొని, ఇటువంటి అతి ముఖ్యమయిన అధికారిక కార్యక్రమాలను కూడా విశ్వవిద్యాలయాలలో నిర్వహించుకోవలసిరావడం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాత్కాలికంగా మరొక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసుకోవలసి రావడం చూస్తే ఆంధ్రప్రజల హృదయాలు బాధతో కలుక్కుమనక మానవు. ఇందుకు కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు.
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలని చూసుకొని, హైదరాబాదును 10 ఏళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించేసి హడావుడిగా రాష్ట్రవిభజన కానిచ్చేసింది. హైదరాబాదులో రెండు ప్రభుత్వాలకు భవనాలను కేటాయించింది. ఇంతవరకు రాష్ట్రమంతా ఒక్కటే గనుక హైదరాబాదులో ప్రభుత్వం కొలువై ఉండటం ఎవరికీ వింతగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత, రాష్ట్రంతో భౌగోళికంగా ఏవిధంగానూ సంబందమూ లేని హైదరాబాదు నుండి రాష్ట్ర పాలన చేయడం అంటే చాలా వింతగా ఉంటుంది.
హైదరాబాదులో ముఖ్యమంత్రికి, రాష్ట్రమంత్రులకు, ఉన్నత పోలీసు అధికారులకి కార్యాలయాలు ఉండవచ్చు గాక కానీ అవేవీ మనవి కావనుకొన్నపుడు, అక్కడ ఉండటం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడో అక్కడ తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని అక్కడి నుండే ప్రభుత్వ పాలన సాగించుకోవడమే ఉత్తమం. అయితే దానికీ మరికొంత సమయం అవసరం గనుక అంతవరకు ప్రభుత్వానికి ఈ తిప్పలు తప్పవు. అందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు.