రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు బ్లూ ప్రింట్ సిద్దం చేసారా?
posted on Jun 15, 2014 @ 3:26PM
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి క్యాబినెట్ సమావేశం తరువాత రాష్ట్ర రాజధానితో బాటు వైజాగ్, తిరుపతి మరియు నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. పదమూడు జిల్లాలలో ఒక్కో ప్రాంతానికి ప్రత్యేకమయిన వనరులున్నాయని, వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొనేలా ఆ ప్రాంతాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు సిద్దం చేస్తామని ఆయన తెలిపారు. నిన్న ఆయనతో సమావేశమయిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తమతో కూడా మళ్ళీ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారని తెలిపారు. అభివృద్ధి అంతా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా మొత్తం అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయాలని ఆయన కోరుకొంటున్నారని వారు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం అన్ని విధాల తగిన స్థలం కోసం తమ అన్వేషణ కొనసాగిస్తామని, అయితే ఈ విషయంలో తాము ఆయనకు కేవలం సలహాలు, సూచనలు మాత్రమే చేస్తామని అంతిమ నిర్ణయం ఆయనే తీసుకోవలసి ఉంటుందని వారు తెలిపారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నందున రాజధానితో బాటు ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు, వాటికీ ఉన్న అవకాశాలు, అవసరమయిన వనరులు, నిధుల గురించి కూడా తమ నివేదికలో చేర్చుతామని తెలిపారు. రేపటి నుండి రాయలసీమలో పర్యటించి ఆ ప్రాంతపు వివరాలు కూడా సేకరిస్తామని తెలిపారు. చంద్రబాబు, శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు చాలా లోతుగా చర్చించారు గనుక ఇప్పుడు రాజధాని నిర్మాణం, ఇతర నగరాలు, పట్టణాలు అభివృద్ధి విషయంలో వారందరూ సరయిన అవగాహనకు వచ్చి ఉండవచ్చును. అందువల్ల ఈసారి కమిటీ నుండి మరింత నిర్దిష్టమయిన, మెరుగయిన ప్రతిపాదనలు సూచనలు సలహాలు వచ్చే అవకాశం ఉంది.
ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్య నాయుడు వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఎటువంటి అనుమానాలు, అపోహలకు లోను కావద్దని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉన్న సంగతి కేంద్రానికి కూడా తెలుసునని, అందువల్ల కనీసం మొదటి సంవత్సరం ఆ లోటును కేంద్ర ప్రభుత్వమే భరించవచ్చని ఆయన తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురయినా కేంద్రం వాటిని అధిగమించి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని తెలిపారు. వాటిలో కొన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండవచ్చును గనుక ఆ విధంగా కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాల అభివృద్దికి కేంద్రం నుండి అధనపు నిధులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఆర్ధిక సమస్యలున్నాయి తప్ప సహజ వనరులు, మానవ వనరులకు లోటు లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్ధికంగా సహాయపడతామని స్పష్టమయిన హామీ ఇస్తోంది గనుక ఇక ప్రయత్నా లోపం లేకుండా కేంద్రం నుండి నిధులు రాబట్టుకొంటూ, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాల్సి ఉంది.