పార్టీ సమీక్షలనగా ఆత్మస్తుతి, పరనింద
posted on Jun 17, 2014 @ 4:03PM
సాధారణంగా ఎన్నికలలో ఓడిన పార్టీలు సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని ఆత్మవిమర్శ చేసుకొని తమ లోపాలను గుర్తించి సవరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొంటాయి. కానీ మన రాజకీయ పార్టీలు సమీక్షా సమావేశాలను కూడా తమ ప్రత్యర్ధులు, మీడియా ఎత్తిపొడుస్తాయనే భయంతోనే సమీక్షా సమావేశాలను కూడా ఒక తప్పనిసరి తద్ధినంలా నిర్వహించేసి చేతులు దులుపుకోవడం రివాజయిపోయింది. ఎలాగూ అంతమంది నేతలు ఒక చోట కలవడం అరుదు గనుక, అలా కలిసినప్పుడు అందరూ కూడా ఆత్మస్తుతి, పరనిందతో కాలక్షేపం చేసి దానినే సమీక్షా సమావేశాలుగా భావిస్తుంటారు. ఈరోజు విజయవాడలో జరుగుతున్న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాలలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది.
ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, సుబ్బిరామిరెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ, పల్లంరాజు, కిల్లికృపా రాణీ, కొందరు మురళి, మల్లాది విష్ణు తదితరులు అనేకమంది పాల్గొన్నారు. ఇంతమంది హేమాహేమీలు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశాలాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు కనుగొని, వాటిని సవరించుకొనేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. అదేవిధంగా అసలు శాసనసభలో కాంగ్రెస్ తరపున ఒక్క సభ్యుడు కూడా ప్రాతినిధ్యం లేకపోవడం చేత అధికారంలో నున్న తెదేపా ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై చర్చ చెప్పట్టవలసి ఉంది. కానీ పార్టీని వీడిపోయిన కాంగ్రెస్ నేతలను అవినీతిపరులని, పార్టీలో మిగిలినవారు మాత్రమే నిజాయితీపరులని చెప్పుకోవడానికే పుణ్యకాలం కాస్త సరిపోయేలా ఉంది.
ఇక అవకాశం దొరికితే తెదేపాలోకి దూకేసేందుకు తన సోదరుడు ఆనం రామినారాయణరెడ్డి సిద్దంగా ఉన్నారనే సంగతి కూడా మరిచిపోయిన ఆనం వివేకానంద రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం నేతలందరూ ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు కూడబెట్టుకోన్నారని, కానీ పార్టీ ఓడిపోయేలా కనిపించడంతో అనేకమంది తెదేపా, వైకాపాలలోకి దూకేసారని ఆరోపించారు. అలాగని పార్టీలో మిగిలిన వారందరూ నిజాయితీ పరులేనని చెప్పలేనని, వారూ చాలా ఆస్తులు పోగేసారని ఆరోపించారు. ఇక చంద్రబాబుకి రెండు కళ్ళు, రెండు కాళ్ళు, అన్నీ రెండే కోరుకొంటారు గనుక ఆయన కేవలం రెండేళ్ళే అధికారంలో కొనసాగుతారని జోస్యం చెప్పారు. ఆయన మాటలకి కాంగ్రెస్ నేతలందరూ పకపకమని నవ్వారు. కానీ సమీక్షా సమావేశాలలో ఇటువంటి డైలాగులతో సరదాగా కాలక్షేపం చేయడం వలన వారికి వినోదం కలుగుతుంది తప్ప పార్టీకే ఎవిదంగా మేలు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏమయినప్పటికీ కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నపుడు డబ్బులు పోగేసుకొంటారని పార్టీ సమావేశంలోనే ఒక కాంగ్రెస్ నేత చెప్పుకోవడం చూస్తే కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెద్ద తప్పుగా భావించడం లేదని, కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉంటే ఏమి చేస్తారో కూడా స్పష్టమవుతోంది.