వికలాంగుల పెన్షన్ పై బాబు మెలిక
posted on Jun 12, 2014 @ 9:10PM
ఎన్నికలలో హామీలివ్వడం ఎంత తేలికో అధికారం చేప్పట్టిన తరువాత వాటిని అమలుచేయడం అంత కష్టం. ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రుణాలమాఫీ విషయంలో అప్పుడే నిరూపించి చూపగా, ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు దానిని మరోమారు నిరూపించి చూపారు. వ్యవసాయ రుణాల సంగతి తేల్చేందుకు కమిటీ వేస్తున్నట్లు మొదటి రోజే ప్రకటించేశారు గనుక దాని గురించి ఆలోచించేందుకు మరో 45రోజుల గడువు సంపాదించుకొన్నారు. అందువల్ల ఆ విషయంలో ఆయనను విమర్శించడానికి అవకాశం లేదు. కానీ వికలాంగులకు పెన్షన్ విషయంలో మాత్రం చిన్న మెలికపెట్టడం ద్వారా కొంతయినా ఆర్ధిక భారం తగ్గించుకొనే ప్రయత్నం చేయడంతో, బహుశః రేపటి నుండి ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపించవచ్చును. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 80శాతం అంగ వైకల్యం ఉన్నవారికే రూ.1500 పెన్షన్ ఇస్తామని, అంతకంటే తక్కువ ఉన్న వారికి రూ.1000 మాత్రమే ఇస్తామని ప్రకటించారు.
ఎన్నడూ అబద్దం ఆడని ధర్మరాజు అంతటివాడు కురుక్షేత్ర యుద్దంలో కౌరవ సేనలకు నాయకత్వం వహిస్తున్న ద్రోణాచార్యుల వారిని నిలువరించలేకపోవడంతో, ఆయనను మానసికంగా దెబ్బతీసి ఆయనపై పైచేయి సాధించేందుకు, “అశ్వత్థామ హతః...కుంజరః” (ఆయన కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అని బిగ్గరగా అరిచి, మెల్లగా ఆ పేరు గల ఏనుగు అని పలుకుతాడు). ధర్మరాజు కూడా అబద్దం ఆడినప్పటికీ, కుంజరః అని ద్రోణాచార్యుల వారికి వినపడనంత మెల్లగా పలికడం ద్వారా అపవాదు తప్పించుకొన్నాడు.
ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబులు కూడా అదేవిధంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని, వికలాంగులకు పెన్షన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రజలందరి చెవులు చిల్లులు పడేంత బిగ్గరగా అరిచి చెప్పారు. కానీ కేవలం 2013-14సం.లలో లక్షలోపు తీసుకొన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, బంగారు నగలు కుదువబెట్టి తెచ్చుకొన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయమని కేసీఆర్, 80శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవారికి రూ.1000 మాత్రమే ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత చల్లగా చెపుతున్నారు.
బహుశః వారిరువురూ మున్ముందు ఈ “అశ్వత్థామ హతః...కుంజరః” ఫార్ములాను ఇంకా చాలాసార్లు ప్రయోగించవచ్చును. అందువల్ల ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా కూడా ఆ ‘కుంజర’ శబ్దం కోసం ఇకపై చెవులు నిక్కబొడుచుకొని వినేందుకు సిద్దంగా ఉండక తప్పదు.