హార్డ్ వేర్ రంగంపై దృష్టి పెట్టాలి: జే.ఏ. చౌదరి
posted on Jun 14, 2014 @ 3:28PM
హైదరాబాదు నగరాన్ని ప్రపంచ సాఫ్ట్ వేర్ చిత్రపటంలో స్థానం కల్పించడానికి చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఆ మహాయజ్ఞంలో ఆయనతో కలిసి పనిచేసిన వారిలో జేఏ చౌదరి గారు కూడా ఒకరు. ఆయన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టీ.ఐ.ఈకి ప్రెసిడెంట్ మరియు ప్రముఖ గ్రాఫిక్స్ సంస్థ యన్.వి.ఐ.డీ.ఐ.ఏకు మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత మళ్ళీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సాఫ్ట్ వేర్ సంస్థలను రప్పించి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాది అవకాశాలు పెంచడం, రాష్ట్ర ఆర్ధిక లోటును పూడ్చుకోవలాసిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక అమూల్యమయిన సూచనలు చేసారు. ఆయన ఏమి చెప్పారంటే...
“ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో సాఫ్ట్ వేర్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కానీ మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్ వేర్ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించవలసి ఉంది. అందుకోసం చంద్రబాబు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థతో సహా అనేక దేశ, విదేశీ కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మన రాష్ట్రానికి చెందిన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓ. గా నియమితులవడం మన అదృష్టమనే చెప్పుకోవచ్చును. చంద్రబాబు ఆయనతో కూడా మాట్లాడారు. అటువంటి పెద్ద సంస్థలను రాష్ట్రానికి రప్పించగలిగితే, వాటిని ఇతర సంస్థలు అనుసరిస్తాయి.
మన రాష్ట్రం, దేశం సాఫ్ట్ వేర్ రంగంలో చాలా మంచి పేరు సంపాదించుకొంది. అయితే హార్డ్ వేర్ రంగంపై మనం ఇంకా దృష్టి పెట్టవలసి ఉంది. మనకున్న అపరిమితమయిన మానవ వనరులను వినియోగించుకొని మనం ఈ రంగంలో అభివృద్ది సాధించేందుకు కృషి చేయాల్సి ఉంది. అన్ని విధాల అభివృద్ధి చెందిన చెన్నై నగరానికి సమీపంలో గల నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో, బెంగుళూరుకు దగ్గరగా ఉండే అనంతపురం జిల్లాలలో ఈ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొంటే వెనుకబడిన ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా, ఆ సంస్థలు కూడా త్వరగా నిలద్రోక్కుకోగలవు.
అదేవిధంగా ఓడిస్సా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ సంస్థలు స్థాపించగలిగితే అక్కడ కూడా అభివృద్ధి జరిగి, సంస్థలు త్వరగా నిలద్రోక్కుకోగలవు. వైజాగ్ లో ఇప్పటికే కొన్ని ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి కనుక అక్కడికి కొత్తవి రప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. సాఫ్ట్ వేర్ తో బాటు హార్డ్ వేర్ సంస్థలను కూడా ఏర్పాటు చేసేందుకు గట్టిగా కృషిచేయాల్సుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా హార్డ్ వేర్ సంస్థల స్థాపనకు ప్రోత్సహాకాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది గనుక మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని హార్డ్ వేర్ సంస్థల స్థాపనకు గట్టిగా కృషి చేయాలి. మన రాష్ట్రం సాఫ్ట్ వేర్ రంగంలో మంచి పేరు సంపాదించుకొంది. అదేవిధంగా ఇప్పుడు హార్డ్ వేర్ రంగంపై కూడా మంచి పట్టు సాధించాల్సి ఉంది. చంద్రబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నన్ను మళ్ళీ ఆహ్వానిస్తే తప్పకుండా రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవడానికి సిద్దంగా ఉన్నాను, “ అని తెలిపారు.