ఏపీ రాజధాని అభివృద్ధి మండలి బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఏపీ రాజధాని అభివృద్ధి మండలి బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేసి, ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఆరు జీవోలు విడుదల చేసింది. వాటిలో మొదటి జీఓ ద్వారా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థను రద్దు చేసారు. రెండవ జీఓ ద్వారా రాజధాని యొక్క ఖచ్చితమయిన ఎల్లలను నిర్దారించారు. మొత్తం 122కిమీ పరిధిలో రాజధాని నగరం ఏర్పాటవుతుంది. కానీ 7068 కిమీకు విస్తరించి ఉండే రాజధాని అభివృద్ధి మండలి పరిధిలోకి గుంటూరు జిల్లాలోని 29 మండలాలు, కృష్ణా జిల్లాలోని 29 మండలాలు కలిపి మొత్తం 58 మండలాలు వస్తాయి.
ఈ మండలి పరిధిలోకి కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జి.కోండూరు, కంచికచర్ల, వీర్లుపాడు, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, నూజివీడు, పామిడిముక్కల, తోట్లవల్లూరు, పెదపారపూడి మండలాలు పూర్తిగా వస్తాయి. మొవ్వ, చల్లపల్లి, ఘంటశాల, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, మోపిదేవి మండలాల్లోని చాలా గ్రామాలు వస్తాయి.
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు, పెదకూరపాడు, ముప్పాళ్ల మండలాలు పూర్తిగా వస్తాయి. అచ్చంపేట, క్రోసూరు మండలాలలోని కొన్ని గ్రామాలు వస్తాయి.భట్టిప్రోలు, పొన్నూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాలలో సగానికిపైగా గ్రామాలు వస్తాయి.
రాజధాని అభివృద్ధి మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా, మునిసిపల శాఖ మంత్రి నారాయణ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరిరువురితో కలిపి మండలిలో మొత్తం 11మంది సభ్యులు ఉంటారు. మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్య కార్యనిర్వాహక మండలి చైర్మన్ గా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మండలి కమీషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ కార్యనిర్వాహక మండలి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. త్వరలో మిగిలిన సభ్యుల నియామకాలు కూడా జరుగుతాయి.
ఇప్పటికే రెవిన్యూ శాఖ 20 బృందాలకు అన్ని విధాల శిక్షణ ఇచ్చిసిద్దంగా ఉంచింది. రాజధాని అభివృద్ధి మండలి లాంఛనంగా ఏర్పాటయింది గనుక ఇక ఒకటి రెండు రోజుల్లో భూసేకరణ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది.