కరెన్సీ కట్టలతో కూడా కష్టాలేనట!
బ్యాంకుల్లో కరెన్సీ కట్టలు దొంతర్లు చూస్తే ఎవరికయినా ముచ్చటేస్తుంది. కానీ ఆ కరెన్సీ కట్టలతో జరిగే లావాదేవీల కోసమే మన దేశంలో బ్యాంకులు ఏడాదికి రూ 21,000 కోట్లు ఖర్చు చేయవలసి వస్తోందంటే నమ్మబుద్ధి కాదు. కానీ అది పచ్చి నిజం.
అభివృద్ధి చెందిన దేశాలలో క్రమంగా కరెన్సీ వినియోగం తగ్గిపోతూ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్ లైన్ నగదు బదిలీలు జరిగుతుంటే మన దేశంలో నిరక్షరాశ్యత, పేదరికం, కోట్లాదిమందికి నేటికీ బ్యాంకు ఖాతాలు కూడా లేకపోవడం, భారతీయులకు కరెన్సీ నోట్లను దాచుకోవాలనే తపన, ఆ నగదును సురక్షితంగా ఒక చోట నుండి మరొక చోటికి తరలించవలసి రావడం వంటి అనేక కారాణాల వలన ప్రతీ ఏడాది దేశంలో బ్యాంకులన్నీఅన్నివేల కోట్లు ఖర్చు చేయవలసి వస్తోంది.
ఈ కారణంగానే ప్రతీ ఏటా లక్షల కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించవలసి వస్తోంది. మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ నోట్ల సెక్యురిటీ కోడ్స్ మార్చవలసి రావడం, చిరిగిన, పాడయిపోయిన పాత నోట్ల స్థానంలో ఈ కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకురావడం, వాటితో లావాదేవీలు నిర్వహించవలసి రావడంతో ఈ అదనపు భారం తప్పడం లేదు. అంటే నోటుకి ఉన్న విలువే కాదు ఆ నోటును చెలామణిలో ఉంచడానికి కూడా ఖర్చు తప్పదన్నమాట.
ఒక్క డిల్లీ నగరంలోనే ప్రజలు ఏడాదికి కనీసం 60 లక్షల గంటలపాటు ఈ కరెన్సీ నోట్లతో లావాదేవీలు నిర్వహించుతున్నారని మాస్టర్ కార్డ్ సంస్థ వారు ఇటీవల విడుదల చేసిన ‘కాస్ట్ ఆఫ్ క్యాష్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో తెలియజేయబడింది. మరి యావత్ భారతదేశంలో ఉన్న 123 కోట్ల మంది కలిసి ఎన్ని లక్షల కోట్ల గంటల సమయం ఈ కరెన్సీ వ్యవహారాలకోసం వెచ్చిస్తున్నారో ఎవరూ లెక్క కట్టలేరేమో. నేటికీ భారత దేశ జనాభాలో మూడవ వంతు మంది గత 15 ఏళ్లలో ఎన్నడూ బ్యాంకు గడప ఎక్కనే లేదట. కారణాలు అందరికీ తెలిసినవే పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వగైరా వగైరా. అందుకే ప్రధాని మోడీ జన్ ధన్ యోజన అంటూ అందరి చేత బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారేమో. కానీ పైసా రాబడి లేని వారి చేత ఎన్ని కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపిస్తే మాత్రం ఏమి ప్రయోజనమో మోడీ వివరించలేదు.
కానీ 2007 సం.నుండి పట్టణ ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ పేమెంట్లు 2.6% to 6.8% వరకు వృద్ధి చెందింది. అది ప్రతీ ఏటికీ ఇంకా వేగంగా పెరుగుతోంది. బ్యాంకులు ఆర్ధిక సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్లను విరివిగా ప్రోత్సహించడం అందుకు అవసరమయిన సదుపాయాలూ కల్పించడం, గుండు సూది నుండి కుక్క పిల్లల వరకు అన్నీ కూడా ఆన్ లైన్లో కొనుగోలు చేసే అవకాశాలు పెరగడంతో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలలో ఈ కరెన్సీ వాడకం క్రమంగా కొంచెం తగ్గు ముఖం పడుతోంది.
2007 సం.లో ఏటీయం ల ద్వారా రూ.3లక్షల కోట్లు లావాదేవీలు జరిగితే అది 2012 నాటికి రూ 18 లక్షల కోట్లకు చేరుకొంది. కానీ అంత మాత్రాన్న భారతదేశంలో కరెన్సీ నోట్లతో లావాదేవీలు ఏ మాత్రం తగ్గలేదు పైగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే మూడేళ్ళలో భారత్ చైనా దేశాలలో ఏడాదికి 16,000 కోట్ల నుండి 17,300 కోట్ల నోట్లు చెలామణిలో ఉంటాయని ఒక అంచనా. అంటే వాటి ముద్రణ, తరలింపు, వాటితో లావాదేవీలు, పాత నోట్ల ఉపసంహరణ వగైరా తంతు అంతా కూడా పెరుగుతుందన్న మాట.