రాజధాని అభివృద్ధి మండలి-ఏడు చేపల కధ
posted on Dec 24, 2014 @ 1:26PM
ఇంతవరకు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలే కాక చుట్టుపక్కల గల గన్నవరం, మైలవరం, నందిగామ తదితర ప్రాంతాలు ఇంకా చుట్టుపక్కల అనేక గ్రామాలు అన్నీ కూడా వి.జి.టి.యం.పరిధిలోనే ఉండేవి. ఆ ప్రాంతాలలో ఎక్కడ ఇళ్ళు, అపార్టుమెంటులు కట్టుకోవాలన్నా, లే అవుట్లు వేయాలన్నా ఇంతవరకు వి.జి.టి.యం. బోర్డే అన్ని అనుమతులు మంజూరు చేస్తూ ఉండేది. దాదాపు 7,060 చ.కిమీ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్న ఆ ప్రాంతాలలో జరిగే రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నీ వి.జి.టి.యం. కనుసన్నలలోనే జరిగేవి.
ఇప్పుడు దాని స్థానంలో రాజధాని అభివృద్ధి మండలి రావడంతో ఇప్పుడు ఆ బాధ్యతలు, హక్కులు, అధికారాలు అన్నీదానికే దఖలు పడ్డాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇల్లలకగానే పండగ కాదన్నట్లు రాజధాని అభివృద్ధి మండలి బిల్లును శాసనసభ ఆమోదించినంత మాత్రాన్న సమస్యలన్నీ మటుమాయం అయిపోలేదు. పైగా ఇప్పుడు కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి.
గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో నెలకి రూ.100కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతుంటాయి. వాటిలో భాగంగా నెలకి కనీసం 10, 000 ఇళ్లు డజన్ల కొద్దీ కొత్త లే అవుట్లు వెలుస్తుంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్న వి.జి.టి.యం.ను రద్దయిపోయింది. కానీ దాని స్థానంలోకి వచ్చిన రాజధాని అభివృద్ధి మండలి ఇప్పుడప్పుడే పని మొదలుపెట్టే పరిస్థితిలో లేదు.
ఎందుకంటే మాస్టర్ ప్లాన్ తయారవలేదు. రాజధాని నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని అనుకొని ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా తదనుగుణంగానే అభివృద్ధి చెందాలని అనుకొంటున్నారు. కనుక రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో అడ్డ దిడ్డంగా నిర్మాణాలు జరగకూడదనే ఆలోచనతో ఆ ప్రాంతలన్నిటినీ కూడా రాజధాని అభివృద్ధి మండలి పరిధిలోకి తీసుకు వచ్చేరు. ఆ ప్రాంతాలన్నీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక క్రమ పద్దతిలో అభివృద్ధి చెందితే మున్ముందు సమస్యలు రాకుండా ఉంటాయని ఆయన ఉద్దేశ్యం. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్దం అయితే తప్ప, దాని పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఎక్కడా కూడా కొత్తగా ఎటువంటి కట్టడాలకు అనుమతులు మంజూరు చేయడానికి వీలు లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చివరికి ఎవరయినా తమ ఇంటికి మార్పులు చేర్పులు చేసుకొనేందుకు కూడా అనుమతి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
అయితే సింగపూరు సంస్థ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వడానికి మరో ఆరు నెలలు పడుతుందని స్వయంగా మంత్రులే చెపుతున్నారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే ముందుగా భూసేకరణ తంతు ఒకటి పూర్తి కావలసి ఉంది. కానీ రాయపూడి గ్రామా రైతులు అప్పుడే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు డిల్లీలో లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. పెనుమాక గ్రామ రైతులు ‘ల్యాండ్ పూలింగుకి ఒప్పుకోము’ అంటూ బోర్డులు పెట్టారంటూ వార్తలు వచ్చేయి.
రైతులు భూములు ఇస్తే సింగపూరోళ్ళు వచ్చి డ్రాయింగులు గీసి ఇస్తారు. వాళ్ళు డ్రాయింగులు ఇస్తే రాజధాని అభివృద్ధి మండలి తన పని మొదలుపెడుతుంది. అది పని మొదలెడితే గానీ ఇంటి మీద పెంకు వేసుకోవడానికి కూడా వీలుపడదు. ఇదంతా చూస్తుంటే ఏదో ఏడూ చేపల కధలా తయారయింది చివరికి. ఈ భూముల సేకరణ ఎప్పుడు జరిగేనో...ఆ సింగపూరోళ్ళు డ్రాయింగులు గీసెదెప్పుడో...రాజధాని అభివృద్ధి మండలి పని మొదలు పెట్టేదెప్పుడో...తము ఇళ్లు కట్టుకొనేదెప్పుడో...అంటూ అందరూ భారంగా నిటుర్పులు విడుస్తున్నారు.
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు మధ్యతరగతి వాళ్ళు లక్షల్లో నష్టపోతుంటే బిల్డర్లు కొట్లలో నష్ట పోతున్నారు. మధ్యతరగతి జనాలు బ్యాంకుల నుండి వడ్డీలకి అప్పులు తెచ్చుకొని బిల్డర్ల చేతిలో డబ్బు పోస్తే, ఎలాగూ రాజధాని వచ్చేస్తోంది గనుక బిల్డర్లు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఎడాపెడా భూములు కొనేసి చకచకా ఇళ్లు, అపార్ట్ మెంటులు లేపేసి నాలుగు రాళ్ళూ పోగేసుకొందామని ఆశపడ్డారు. ఇప్పుడు వారందరూ లబోదిబోమని మొత్తుకొంటున్నారు. కనుక ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందేమో?