సత్య నాదెళ్ళ మనోడే...ఆయనను పూర్తిగా వాడేసుకోక తప్పదు
posted on Dec 27, 2014 @ 11:00AM
దేశాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోవడం, దాని స్థానంలో సమర్దుడయిన నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో దేశానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఆశ అందరిలో చిగురించింది. అదే సమయంలో ప్రపంచ ప్రసిద్ద మైక్రోసాఫ్ట్ సంస్థకు భారతీయుడయిన సత్య నాదెళ్ళ సి.ఈ.ఓ.గా నియమితులవడం భారత్ కు మరో శుభ పరిణామంగా చెప్పుకోవచ్చును.
ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరియు ఐ.టి.శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ లతో నిన్న సమావేశమయిన ఆయన తమ మైక్రోసాఫ్ట్ సంస్థ తరపున దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. దేశంలో క్రమంగా పెరుగుతున్న పరిశ్రమల, వ్యాపార సంస్థల మరియు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిలువచేసేందుకు తమ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందించేందుకు భారీ పెట్టుబడులతో డాటా సెంటర్లు నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ భారతీయ విభాగంలో ప్రధాని మోడీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటాల్ ఇండియా పధకాలను కూడా ఒక భాగంగా చేసుకొని తదనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొంటామని ఆయన తెలిపారు. భారత్ లో వివిధ అవసరాలకు తగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు తమ సంస్థ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఐటీ రంగంలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకొంది. కానీ ఇంకా ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్ వేర్ ఉత్పత్తి రంగంలో వెనుకబడే ఉంది. ఐ.టి. శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆ రెండు రంగాలను కూడా అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ భారత్ కు సహాయం చేయాలని కోరారు. భారతీయుడయిన ఆయన తన సంస్థ ద్వారా భారతదేశ అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు ముందుకు రావడం చాలా అభినందనీయం.
భారతీయుడయిన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓ. కావడం అటు ఆ సంస్థకు ఇటు భారత్ కు రెంటికీ చాలా ప్రయోజనం చేకూర్చబోతోంది. ఆయన వలన భారత్ కు భారీ పెట్టుబడులు, ఆ సంస్థ సేవలు లభ్యమవుతాయి. భారత్ లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యాలయాలను మరిన్నిటిని తెరిచినట్లయితే, దానిని అనుసరించి అనేక చిన్నా పెద్ద సంస్థలు కూడా భారత్ కు తరలిరావడం తధ్యం. మైక్రోసాఫ్ట్ తో సహా ఆ సంస్థలన్నీ భారత్ లో తమ కార్యకలాపాలు మొదలుపెట్టినట్లయితే, దానివలన భారత ఆర్ధిక పరిస్థితి కూడా మరింత మెరుగుపడుతుంది.
సత్య నాదెళ్ళ భారతీయుడయిన కారణంగానే, మైక్రోసాఫ్ట్ సంస్థ 125 కోట్ల మంది జనాభా ఉన్న ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మార్కెట్ ద్వారా లబ్ది పొందగలుగుతుంది. భారతీయుల అవసరాల గురించి, వారి ఆలోచనా విధానం గురించి, వారి జీవన శైలి గురించి భారతీయుడయిన సత్య నాదెళ్ళకు తెలిసినంతగా మరే సంస్థకి తెలియక పోవచ్చును. అది ఆ సంస్థకు ఒక పెద్ద వరంగా మారబోతోంది. భారతీయ అవసరాలకు అనుగుణంగా తన సంస్థ సేవలను, టెక్నాలజీని అందించగలిగితే, మైక్రోసాఫ్ట్ సంస్థ ఊహించనంతగా భారత్ నుండి లాభాలు ఆర్జించగలదు. దేశంలో నానాటికి పెరుగుతున్న కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్, టాబ్లెట్ పీసీలు, మొబైల్ ఫోన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇంటర్ నెట్, వైఫీ వినియోగం ద్వారా ఆ సంస్థ ఊహించనంత లాభాలు పొందే అవకాశం ఉంది.
అందువలన భారత ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ సంస్థ రెండూ కూడా ఈ సువర్ణావకాశాన్ని ఓడిసిపట్టుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. సత్య నాదెళ్ళ తెలుగువాడయ్యి ఉండటం ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు మరింత కలిసివచ్చే అంశమని చెప్పవచ్చును. అందువలన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల మాటను గుర్తుంచుకొని ఆయన ఆ పదవిలో ఉండగానే ఆయన ద్వారా రెండు రాష్ట్రాలలో భారీ పెట్టుబడులు, ఆ సంస్థ శాఖల ఏర్పాటుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నించడం చాలా అవసరం. ఇటువంటి సువర్ణావకాశం మళ్ళీ వస్తుందని ఆశించలేము.