చక్రి ఆత్మహత్య చేసుకున్నారా?
ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం చిత్ర పరిశ్రమను, ఆయన అభిమానులను విషాదంలో ముంచింది. ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న చక్రి మరణం ఎంతో బాధాకరం. చక్రి మరణించక ముందు రోజు వరకూ ఆయన జీవితం గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కేవలం శరీరం విపరీతంగా లావుగా వుంటుందే తప్ప... మరే విషయంలోనూ ఆయనకు ఎలాంటి లోటూ లేదని అందరూ భావించారు. వందకు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రి కోట్లకు కోట్లు సంపాదించారని అందరూ అనుకుంటారు. అయితే ఆయన జీవితం వెనుక అసలు విషయాలు ఆయన మరణం తర్వాత బయటపడుతున్నాయి. అలా బయటపడిన అనేక విషయాలు చక్రి అందరూ అనుకుంటున్నట్టుగానే స్థూలకాయం కారణంగా గుండెపోటుతో మరణించారా... లేక ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే సందేహాలను ఆయన అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాల్లో కలిగిస్తున్నాయి.
శరీరం విపరీతంగా పెరిగిపోయిన చక్రి నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటూనే వుండేవారు. ఆయన గుండెకు ఎలాంటి సమస్య లేదని డాక్టర్లు చెప్పారని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు. అలాంటప్పుడు ఆయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు మరణిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే చక్రి మరణించిన రోజు అర్ధరాత్రి రెండు.. రెండున్నర వరకు మేలుకునే వున్నారట. తెల్లవారు ఝామున ఆరుగంటలకు చూస్తే చక్రి చనిపోయి వున్నారు. అయితే అప్పటికే ఆయన పూర్తిగా నల్లగా మారిపోయి వున్నారు. ఒకవేళ నిద్రలో గుండెపోటుతో మరణిస్తే శరీరం నల్లగా ఎందుకు మారిపోయింది? అది కూడా కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఆయన శరీరం అలా ఎందుకు మారిపోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చక్రి మరణించిన తర్వాత ఆయన కుటుంబంలో ఉన్న వివాదాలు బయటపడ్డాయి. చక్రి తల్లి, తమ్ముడు, సోదరీమణుల మధ్య, చక్రి భార్య శ్రావణి మధ్య విభేదాలు బయటపడ్డాయి. చక్రికి శ్రావణి విషం పెట్టి చంపేసిందని మిగతా కుటుంబ సభ్యులు ఆరోపించారట. ఈ విషయాన్ని చక్రి భార్యే బయటపెట్టారు. తనను చక్రి వైపు బంధువులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పారు. హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణభయం వుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చక్రితో ఎలాంటి బంధుత్వమూ లేనివారు చక్రి మరణాన్ని తలచుకుని బాధపడుతుంటే, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆస్తిపాస్తుల కోసం చక్రి మరణాన్ని ‘హత్య’గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, వివాదం హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకూ వెళ్ళడం చేశారు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. ఇంత గొడవ అయిన తర్వాత వాళ్ళంతా మనం మనం బంధువులం అనుకుని రాజీ పడిపోయారు. కానీ వారు చేసిన గొడవ వల్ల చక్రికి ఏర్పడిన అప్రతిష్ఠని చెరిపేయగలరా?
చక్రి మరణం తర్వాత జరిగిన గొడవ సంగతి అలా వుంచితే, చక్రి ఆత్మహత్యకు పాల్పడి వుంటారన్న సందేహాలను ఆయన అభిమానులు, సినిమా రంగంలోని వారు వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి ముంచుకొచ్చిన మానసిక ఒత్తిడి చక్రిని ఆత్మహత్యకు ప్రేరేపించి వుండవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వయసులోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న చక్రి బాగానే సంపాదించారు. అయితే ఆయన సంపాదన మొత్తం ఖర్చయిపోయిందని ఆయన భార్యే చెబుతున్నారు. ఒక్క ఇల్లు తప్ప బ్యాంకులో బ్యాలన్స్ ఏమీ లేదని చక్రి బాధపడేవారట. సినిమాలు లేక, పని చేసిన సినిమాలు కూడా విజయ సాధించక చక్రి మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యేవారట. చేతిలో డబ్బు లేదు, సినిమాలు లేవు... ఈ డిసెంబర్ 31వ తేదీ కోసం ఒక ఫంక్షన్ ఈవెంట్ నిర్వహించాలని చక్రికి ఆహ్వానం వస్తే ఆయన చాలా సంతోషించారట. మనకి ఇప్పుడు కొంత డబ్బు వస్తుందని సంబరపడిపోయారట. చివరికి ఆ ఈవెంట్ కూడా కేన్సిల్ అయిపోయేసరికి బాగా డీలా పడిపోయారట. ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన చక్రి ఏదో కాస్తంత డబ్బు వచ్చే ఒక ఈవెంట్ మిస్ అయిందని డీలాపడిపోయారంటే ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఎర్రబస్సు’ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చక్రి ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయేసరికి బాగా నిరాశపడిపోయారట. ఇవన్నీ ఆయన భార్యే వెల్లడించారు.
సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోయింది. బ్యాంక్ బ్యాలన్స్ నిల్ అయింది. దానికితోడు చేతిలో సినిమాలు లేవు. దానికితోడు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా సహకరించని భారీ కాయం. ఉన్న ఫ్రెండ్సందరూ మందుపార్టీ ఫ్రెండ్సే తప్ప మనసుకు ఊరటనిచ్చే ఫ్రెండ్స్ కాదు. చక్రికి పిల్లలంటే ఇష్టం. తమ దంపతులకు పిల్లలు పుడితే వాళ్ళని సినిమా సంగీత రంగంలో తన వారసులుగా తీర్చిదిద్దాలని చక్రి తపించేవారట. అయితే చక్రి భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదట. పిల్లల కోసం ఎన్నో ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. పిల్లలు కలగకపోవడం ఎంత పెద్ద బాధో దాన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది. వీటికి తోడు చక్రి భార్యకి, చక్రి కుటుంబానికి మధ్య నిరంతరం ఘర్షణలు. చక్రి చనిపోయిన ముందు రోజు కూడా చక్రి తల్లి, చక్రి భార్య ఇద్దరూ గొడవపడ్డారట. దాంతో చక్రి కుటుంబం మొత్తం చక్రి ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోయిందట. చక్రికి విజయాల విజయాలు వచ్చి పాపులర్ అయ్యేరేగానీ, మానసికంగా చక్రి చాలా చిన్నపిల్లాడు. అలాంటి చిన్న పిల్లాడిని ఇన్ని ఒత్తిడులు ఒక్కసారిగా చుట్టుముడితే, ఒత్తిడులను తప్పించుకునే దారి కనిపించకపోతే ఏమవుతుంది? ఆ చిన్నపిల్లాడి మనసు ఏ నిర్ణయం తీసుకుంటుంది?
ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక చక్రి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘చస్తే ఏ గొడవాలేదు.. చస్తే ఏ గోలా లేదు’ అనే పాటని చక్రి పాడారు. ఇన్ని ఒత్తిడులు ఎదుర్కొంటున్న చక్రి తన పాటను అనుసరించి వెళ్ళిపోయారా అనే అనుమానాలను ఆయన అభిమానులు, సినిమా పరిశ్రమలోనివారు వ్యక్తం చేస్తున్నారు. చక్రి మరణవార్త తెలిసిన అందరూ... చక్రి బాగా లావుగా వుంటాడు కాబట్టి గుండెపోటు వచ్చి వుంటుందిలే అని అనుకున్నారు. ఇప్పుడు చక్రి జీవితంలోని అసలు గుట్టంతా బయటపడేసరికి ఇప్పుడు ఆయన మరణం మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి.