ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థల స్థాపనకు ప్రణాళికలు సిద్దం
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణంతో బాటు రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి మరియు నెల్లూరు నగరాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూడా అవసరమయిన స్థలాలను, సిద్దంగా ఉన్న భావన సముదాయాలను అధికారులు గుర్తించడం పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సుమారు 60 లక్షల చదరపు అడుగులు వైశాల్యం గల భవనాలు సిద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విశాఖలోనే మధురవాడ వద్ద ఏర్పాటు చేసిన వి.యస్.ఈ.జెడ్. ఇన్క్యుబేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇన్క్యుబేషన్ టవర్లో సుమారు 50,000 చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు, కాకినాడలో 25 ఎకరాల స్థలం, సర్పవరం ఐ.టి. సెజ్ లో 7,000 చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు, విజయవాడలో ఏ.పి.ఐ.ఐ.సి.కి చెందిన పారిశ్రామికవాడలో 2.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు, అక్కడే యస్.టి.పి.ఐ. ఇన్క్యుబేషన్ సెంటర్లో 15,000, చదరపు అడుగులు, అదేవిధంగా తిరుపతిలో 15, 000 చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు సిద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇవి ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ కంపెనీల స్థాపనకు చాలా అనువుగా ఉన్నందున, ఆ పరిశ్రమలు స్థాపించాలనుకొన్న వారికి వెంటనే అనుమతులు మంజూరు చేసి తక్షణమే ఆ భవనాలలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అన్నిటి కంటే ముందుగా విశాఖ, విజయవాడ మరియు తిరుపతి పట్టణాలలో ఈ ఎలక్ట్రానిక్ పార్కుల స్థాపన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఐటీ పరిశ్రమల స్థాపనకు సిద్దంగా ఉన్న ఈ భవనాలే కాకుండా ఇంకా విశాఖలో ఐ.టి. జోన్ గా గుర్తింపబడిన మధురవాడ వద్ద 152 ఎకరాల స్థలము, దానికి చేరువలోనే గంభీరం అనే ప్రాంతంలో ఏ.పి.ఐ.ఐ.సి.కి చెందిన పారిశ్రామిక వాడలో మరో 50 ఎకరాలు సాఫ్ట్ వేర్ పార్కులు ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నాయి.
అదేవిధంగా విశాఖ జిల్లాలో అచ్యుతాపురం వద్ద గల పూడి గ్రామం వద్ద మరో 20ఎకరాల స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఆద్వర్యంలో టెక్నాలజీ ఫర్ సిస్టమ్స్ ప్రోగ్రాం అనే పధకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 15 ప్రాంతాలలో ఐ.టి సంస్థలకు అవసరమయిన పరిశోధనశాలలు మరియు శిక్షణా సంస్థలు మొదలయినవి ఏర్పాటు చేయబడుతాయి. వాటిలో ఒకటి ఈ పూడి గ్రామం వద్ద ఏ.పి.ఐ.ఐ.సి. గుర్తించిన ఈ 20ఎకరాలలో రూ.120కోట్ల పెట్టుబడితో స్థాపించబడతాయి.
ఇందుకోసం కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే అభివృద్ధి చేయబడిన ఆ భూములు అందుబాటులోకి రాగానే అక్కడ ఈ అత్యాధునిక యంత్ర పరికరాలతో కూడిన ఈ సంస్థలు ఏర్పాటు చేయబడతాయని వైజాగ్ యంపీ మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. హరిబాబు తెలిపారు. వీటితోబాటు విశాఖలో ఐ.టి.ఐ.ఆర్.తో మరియు విశాఖ, తిరుపతి మరియు అనంతపురం పట్టణాలలో ఐటి మరియు మెగా ఎలక్ట్రానిక్ పార్కులను ఏర్పాటు చేసేందుకు, కాకినాడలో మెగా ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్క్ ఏర్పాటుకు అవసరమయిన ప్రణాళికలు అధికారులు సిద్దం చేస్తున్నారు.