జనవరిలో నారా లోకేష్ తెలంగాణా పర్యటన?
posted on Dec 31, 2014 7:21AM
ఇంతవరకు తెర వెనుకనే ఉంటూ తెదేపాను బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్న నారా లోకేష్, ఇకపై నేరుగా ప్రజలలోకి వచ్చి పార్టీని వారికి మరింత దగ్గర చేయాలని భావిస్తున్నాట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నంలోనే ఆయన వచ్చే నెలలో తెలంగాణాలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నట్లు తాజా సమాచారం.
తెలంగాణ ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో కూడా ఎంతో పటిష్టంగా ఉన్న తెదేపా, తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస ఆకర్షణకులోనయి కొంతమంది సీనియర్ నేతలు, యం.యల్యేలు. వారి అనుచరులు పార్టీని వీడి తెరాసలో జేరిపోవడంతో తెలంగాణాలో తెదేపా చాలా బలహీనపడింది. కానీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టడంతో తెలంగాణాలో పార్టీ కోసం సమయం కేటాయించలేకపొతున్నారు. బహుశః అందుకే ఆయన కుమారుడు నారా లోకేష్ ఇకపై తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసేందుకు చొరవ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఆయన తెలంగాణాలో పర్యటనలు ప్రారంభిస్తే, అప్పుడు తెరాస నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడవలసి ఉంది. ఒకవైపు నారా లోకేష్ తెదేపాను బలపరుచుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, మరో వైపు షర్మిల కూడా వైకాపాను బలోపేతం చేసుకొనేందుకు ఇప్పటికే పరామర్శ యాత్రల పేరిట తెలంగాణాలో పర్యటించారు. కనుక ఒకవేళ నారా లోకేష్ కూడా తెలంగాణాలో యాత్రలు మొదలుపెట్టినట్లయితే అప్పుడు తెరాస, తెదేపా, వైకాపాల మధ్య మాటల యుద్ధం అనివార్యమవవచ్చును.
అయితే, షర్మిల పరామర్శ యాత్రపై స్పందించని తెరాస, నారా లోకేష్ తెలంగాణా పర్యటనలపై విరుచుకుపడినట్లయితే, అది తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అవగాహన గురించి ప్రశ్నించేందుకు తెదేపాకు అవకాశం కల్పించినట్లవుతుంది కనుక తెరాస వెంటనే స్పందించకపోవచ్చును.