శభాష్ అసదుద్దీన్ జీ!
తాలిబాన్ ఉగ్రవాదుల కంటే అతి భయంకరమయిన, కిరాతకమయిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. సిరియా, ఇరాక్, జోర్డాన్ దేశాలలో ముస్లిం మరియు క్రీస్టియన్ మతాలకు చెందిన అనేకమంది యువతులను, పెళ్ళయిన మహిళలను, అభంశుభం తెలియని బాల, బాలికలను చెరపట్టి సెక్స్ బానిసలుగా ఉపయోగించుకొంటున్నారు. అందుకు నిరాకరిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నారు. కొందరిని బజారు వస్తువుల్లా అమ్మేస్తున్నారు. ఎందుకూ పనికి రారనుకొన్నవారిని సజీవంగా భూస్థాపితం చేసేస్తున్నారు. చిన్నారి పసిపిల్లల పట్ల కూడా వారు చాలా కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో చెరలో చిక్కిన అనేకమంది చిన్నారులు, బాల బాలికలు, వృద్ధులు ఆకలి దప్పులతో అలమటించి చనిపోతున్నారని, ఉగ్రవాదుల నుండి వారినందరినీ తక్షణమే కాపాడలేకపోతే వేలాదిమంది బలయిపోతారని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల సంఘం తన తాజా నివేదికలో ప్రకటించింది.
ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇంతవరకు అనేకమంది విదేశీయులను అతి కిరాతకంగా గొంతు కోసి చంపారు. తమకు బందీగా చిక్కిన జోర్డాన్ దేశానికి చెందిన ఒక పైలట్ ని అంతకంటే అతి కిరాతకంగా ఒక ఇనుప బోనులో బందించి అతనిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసి, దానిని తమ అధికారిక వెబ్ సైట్లో పెట్టడం యావత్ ప్రపంచాన్ని కలవరపరిచింది. వారు అతనిని సజీవ దహనం చేస్తున్న సమయంలో అతను కళ్ళు మూసుకొని అల్లాను ప్రార్దిస్తూ మరణించడం యావత్ ముస్లిం సోదరులను తీవ్రంగా కలచివేసింది.
వారి ఆకృత్యాలను చూస్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ దీనిపై స్పందిస్తూ “జీహాద్ అంటే రక్తపాతం, విధ్వంసం కాదనీ, యువత తమ బస్తీలలో ఉన్న సమస్యలపై పోరాటం చేసి వాటిని పరిష్కరించడమే జిహాద్ గా భావించాలని హితవు పలికారు. నిన్న ఆయన హైదరాబాద్ లోని జామియా నిజామియాలో మీడియాతో మాట్లాడుతూ, ఇస్లాంకు ఐఎస్‌ఐఎస్ ప్రధాన శత్రువన్నారు. దానితో ఇస్లాం మతానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. జిహాద్ పేరిట ఉగ్రవాదులు చేస్తున్న అకృత్యాలు, సృష్టిస్తున్న రక్తపాతాన్ని ఇస్లాం మతం అంగీకరించదని ఆయన అన్నారు.
జిహాద్ పేరిట ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు చేస్తున్నఆకృత్యాలను యావత్ ముస్లిం సోదరులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. జీహాద్ పేరిట ఇంటర్నెట్, మొబైల్‌లలో కనిపించే సమాచారం చూసి యువత దారితప్పుతోందనీ, ఉగ్రవాది హఫీజ్ సయీద్ లాంటి సంఘ విద్రోహ శక్తులు పొందుపరచిన సమాచారమే అందులో ఉంటుందన్నారు. ముస్లిం యువత అటువంటి వారికి దూరంగా ఉంటూ సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేయాలని ఆయన కోరారు.
జీహాద్‌కు అసలయిన అర్ధం, నిర్వచనం తెలుసుకోవలంటే యువత ముస్లిం మతగురువులు మౌలానాలను సంప్రదిస్తే తెలుస్తుందన్నారు. నిజంగా జీహాద్ చేయాలనుకుంటే యువత తమ తమ బస్తీ పరిసరాల్లోని చెడు సమస్యలపై దృష్టి సారించాలని అసదుద్దీన్ కోరారు. ప్రజాస్వామిక దేశమయిన భారతదేశంలో ప్రజల మత స్వేచ్ఛను ఆపడం ఎవరి తరం కాదన్నారు.
యంపీ అసదుద్దీన్ ఒవైసీ అందరికంటే ఈ సమస్యను గుర్తించి ఈవిధంగా మీడియా ముందుకు వచ్చి ఉగ్రవాదుల చర్యలను ఖండించడం చాలా అభినందనీయం. రాష్ట్రంలో మరియు దేశంలో మతగురువులు, ముస్లిం ప్రముఖులు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ సినీ నటులు, మేధావులు, రచయితలు అందరూ కూడా ఇదేవిధంగా ముందుకు వచ్చి దేశంలో ముస్లిం యువత దారి తప్పకుండా కాపాడుకొంటే, దేశానికి, యువతకి కూడా చాలా మేలు చేసినవారవుతారు.