పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొన్న యంపీ చిరంజీవి
ఆశయం, ఆలోచన మంచిదయితే దేవుడు కూడా అటువంటి పనులకు సహాయం అందిస్తాడని పెద్దలు అంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ కార్యక్రమానికి పార్టీలకతీతంగా పార్లమెంటులో యంపీలు, కేంద్రమంత్రులు స్పందిస్తూ తమ తమ నియోజక వర్గాలలో గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు నడుం కడుతున్నారు. మోడీని, బీజేపీని అమితంగా ద్వేషించే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీతో సహా అనేకమంది కాంగ్రెస్ యంపీలు తమకు నచ్చిన గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయదానికి సిద్దపడటం విశేషం.
అధినేత్రి బాటలోనే నడుస్తూ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా తన స్వస్తలమయిన పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు మండలంలో గల పేరుపాలెం గ్రామాన్ని దత్త తీసుకొంటున్నట్లు ప్రకటించారు. తన యంపీ లాడ్స్ నిధులతో ఆ గ్రామంలో నీళ్ళు, మురుగు కాలువలు, లెట్రిన్ల నిర్మాణం, విద్యుత్, విద్యా, వైద్య సదుపాయాలూ కల్పించి అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు.
ఇంతవరకు 344మంది లోక్ సభ సభ్యులు, 86మంది రాజ్యసభ సభ్యులు దేశంలో వివిధ గ్రామాలను దత్తత తీసుకొన్నారు. వారిలో అశోకగజపతి రాజు, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, చిరంజీవి, సచిన్ టెండూల్కర్, సుషమా స్వరాజ్, జితేంద్ర సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, సుప్రియ సూలె తదితర యంపీలున్నారు.
పార్టీల కతీతంగా సాగుతున్న ఈ మహా యజ్ఞంలో కాంగ్రెస్, బీజేపీ, తెదేపాలతో సహా వైకాపా, తృణమూల్ కాంగ్రెస్, జే.డి.యు.,ఆర్.జే.డి.,యన్.సి.పి.,అన్నాడియం.కె.,యల్.జే.పి., జే.యంయం.,మరియు అనేక ఇతర రాజకీయ పార్టీలకు చెందిన యంపీలు పాలుపంచుకోవడం విశేషం.
ఇంతవరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా దేశంలో అన్ని పార్టీలను ఈవిధంగా ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి దేశాభివృద్ధికి కష్టపడేలా చేయలేదు. కనీసం ఇటువంటి ఆలోచన కూడా ఎవరికీ కలగలేదు. కానీ మోడీ అధికారం చేపడుతూనే దేశాన్ని ప్రగతి పధం వైపు నడిపించేందుకు ప్రయత్నించడమే కాక అందులో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన యంపీలను కూడా భాగస్వాములు చేయడం విశేషం. ఈ మహా ప్రస్తానం మోడీ నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతోందని చెప్పవచ్చును.