బీజేపీలో బొత్స చేరిక ఖాయమా?
posted on Dec 23, 2014 @ 12:28PM
మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నట్లు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనను పక్కను పెట్టి రఘువీరా రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటి నుండి ఆయన పార్టీకి దూరంగా మసులుతున్నారు. అప్పటి నుండే ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఈ మధ్యనే బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఆయనతో విజయనగరంలో సమావేశమయిన తరువాత ఆయన పార్టీలోకి చేరేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మీడియాకు చెప్పినట్లు వార్తలు వచ్చేయి.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్-కమిటీ గత ప్రభుత్వాల హయంలో జరిగిన అక్రమ మైనింగ్ లైసెన్సులను, భూకేటాయింపులను, ఇసుక త్రవ్వకాలు, ఎర్ర చందనం స్మగిలింగ్, లిక్కర్ సిండికేట్, రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలలో జరిగిన అవినీతి అక్రమాలను త్రవ్వి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తోంది. బొత్స సత్యనారాయణను కూడా విడిచిపెట్టేది లేదని సబ్ కమిటీలో మంత్రులు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఈ కేసుల నుండి బయటపడాలంటే బీజేపీలో చేరడమే ఏకైక ఉపాయంగా కనబడుతోంది. పైగా రాష్ట్రంలో, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా కనబడుతున్నప్పుడు, ఆయనని పక్కన పెట్టిన పార్టీని పట్టుకొని వ్రేలాడటం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. కనుక బీజేపీ అనుమతిస్తే ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.
అయితే తనపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కేసుల పెట్టకుండా నిలువరించాలనే షరతుతోనే ఆయన బీజేపీలో చేరినట్లయితే అప్పుడు ఆ బీజేపీ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసినా లేకపోతే ఆయన బీజేపీలో చేరిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టినా అది తెదేపా-బీజేపీల స్నేహానికి గండి కొట్టవచ్చును. ఆయనను తీవ్రంగా వ్యతిరేకించే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ బొత్సను పార్టీలో చేర్చుకొన్నట్లయితే అప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు ఇష్టపడకపోవచ్చును.
బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకొంటే కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించవచ్చనే భ్రమ కూడా మంచిది కాదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో ఆయన ప్రవర్తించిన తీరును చూసి కాపు సామాజిక వర్గం కూడా ఆయనకు దూరంగా జరిగింది. అందుకే సాధారణ ఎన్నికలలో ఆయన కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ కూడా గెలవలేకపోయారు. ఒకవేళ ఆయనను బీజేపీలో చేర్చుకొంటే ఎన్నికల ప్రచార సభలలో ఆయనను తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ (ఆయన సామాజిక వర్గానికే చెందిన) కూడా బీజేపీకి దూరం అవవచ్చును.
ఎప్పటికయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విభజన వ్యవహారంలో పార్టీ అధిష్టానాన్ని తప్పు ద్రోవ పట్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చేయి. కనుక ఇప్పుడు కూడా ఆయన అటువంటి ప్రయత్నాలే చేసినట్లయితే కేంద్రం సహాయం అందక రాష్ట్రాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కనుక ఒకవేళ బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకోదలిస్తే ముందుగా ఈ పర్యవసనాలన్నిటినీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి ఉంటుంది.