కాకినాడ నుండి చెన్నైకి బోట్ జర్నీ!
posted on Dec 29, 2014 @ 2:35PM
కేరళ, బెంగాల్, గోవా వంటి కొన్ని రాష్ట్రాలలో నేటికీ ఒక ఊరు నుండి మరొక ఊరికి పడవల ద్వారా ప్రయాణించేందుకు తగిన కాలువలు, మరబోట్లు వాడకంలో ఉన్నాయి. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో కూడా భద్రాచలం వెళ్లేందుకు గోదావరి మీద చాలా లాంచీలు తిరుగుతున్నాయి. అయితే 1980 వరకు కూడా కాకినాడ నుండి చెన్నై వరకు ఉండే కాలువల ద్వారా సరుకు రవాణా చాలా జోరుగా సాగుతుండేది. కానీ ప్రభుత్వాలు కూడా అశ్రద్ధ చూపడంతో అది మూలపడింది. క్రమంగా కొన్ని చోట్ల ఆ కాలువలు భూకబ్జాదారుల చేతిలో పడి చిక్కి ఒకప్పుడు 32మీటర్ల వెడల్పు ఉండే కాలువలు ఇప్పుడు 6 మీటర్లకు కుచించుకుపోయాయి.
అంతర్గత జలరవాణ వ్యవస్థను అభివృద్ధి చేయడం కూడా మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి. కనుక కేంద్రం అంతర్గత జలరవాణ అధికార సంస్థ, రాష్ట్రంలో యానం-కాకినాడ-రాజమండ్రి-ఏలూరు-విజయవాడ-తెనాలి-నెల్లూరు మీదుగా చెన్నైకి ఉన్న 1100 కిమీ పొడవున్న అంతర్గత జలరవాణ వ్యవస్థను మళ్ళీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో కొద్ది రోజుల క్రితమే విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేసింది.
బకింగ్ హం కాలువగా ప్రసిద్ధి పొందిన ఈ కాలువను పునరుద్దరించి మళ్ళీ జలరవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రాలో వివిధ వస్తు ఉత్పత్తులను చెన్నైకి అదేవిధంగా చెన్నై నుండి ఆంధ్రాకి అతి తక్కువ ఖర్చుతో రవాణా చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. అంతా అనుకొన్నట్లుగా సవ్యంగా సాగితే దీనిని ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చి దిద్దే అవకాశం ఉంది. ఇది రెండు రాష్ట్రాలకు ఒక ప్రత్యేక టూరిస్ట్ ఆకర్షణగా నిలిచే అవకాశం కూడా ఉంది. కనుక ఈ ప్రాజెక్టును పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పట్టుదలగా ఉంది. ఈ కాలువను పునరుద్దరించి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.2000కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుపై ఆరు నెలలలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రం స్థానిక అధికారులను ఆదేశించడంతో చీఫ్ ఇంజనీర్ సుభాకర్ దండపత్ నేతృత్వంలో వారు ఈ మధ్యనే సర్వే బకింగ్ హం కాలువను సర్వే చేయడం మొదలుపెట్టారు.
వారి ప్రాధమిక సర్వేలో ఆ కాలువ పలు ప్రాంతాలలో ఆక్రమణలకు లోనయినట్లు గమనించారు. అదేవిధంగా చాలా చోట్ల పూడికతీసి కాలువ లోతును పెంచవలసి ఉంటుందని గుర్తించారు. సాధారణంగా మరపడవలు తిరిగేందుకు కనీసం 32 మీటర్ల వెడల్పు 2.5 మీటర్ల లోతు ఉండాలి. కానీ ఇప్పుడది చాలా చోట్ల కేవలం ఆరు మీటర్ల వెడల్పు, ఒక్క మీటరు లోతు మాత్రమే ఉంది. అదేవిధంగా ఇదివరకు పరిస్థితులలో కాలువలో చిన్న చిన్న పడవలు మాత్రమే తిరిగేవి కనుక కాలువను దాటేందుకు అనేక చోట్ల తక్కువ ఎత్తులో వంతెనలు నిర్మించబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆధునిక మర పడవలు, భారీ సరుకు రవాణా చేసే లాంచీలను ఈ కాలువలో నడపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నందున ఆ పాత వంతెనల స్థానంలో మరింత ఎత్తున కొత్త వంతెనలు నిర్మించవలసి ఉంటుంది.
ప్రస్తుతం కాకినాడ కెనాల్-50కిమీ, ఏలూరు కెనాల్-139కిమీ, గుంటూరు జిల్లాలో కొమ్మమూరు కెనాల్-119కిమీ, బకింగ్ హం కెనాల్-316కిమీ, దక్షిణ బకింగ్ హం కెనాల్-116కిమీ మరియు పాండిచేరి కెనాల్-22కిమీ పొడవున్న కాలువలున్నాయి. వాటిలో ఆక్రమణలు తొలగించి, పూడికలు తీసి, వాటిపై అవసరమయిన చోట కొత్తగా వంతెనలు నిర్మించాల్సి ఉంది. కేంద్రమే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందున బహుశః రానున్న రెండు మూడేళ్ళలో ఈ పనులన్నీ పూర్తవవచ్చును. ఆంద్ర-తమిళనాడు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఈ అంతర్గత జలరవాణ వ్యవస్థ పునరుద్దరించబడినట్లయితే, అది రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా ఆర్ధికంగా కూడా ఎంతో వెసులుబాటు కల్పించవచ్చును.