చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే తెరాసకు ఉలుకెందుకు?
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ వచ్చే నెల వరంగల్లో పర్యటిస్తారని తెదేపా ప్రకటించగానే, ఊహించినట్లే తెరాస నేతలు చాలా తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టారు. తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “మా రాష్ట్రానికి అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మా రాష్ట్రంలో పర్యటించవలసిన అవసరం ఏమిటి? ఆ కార్యక్రమమేదో ఆయన ఆంధ్రాలోనే పెట్టుకొంటే మంచిది. అలా కాదని తెలంగాణాలో పర్యటించేందుకు బయలుదేరితే మేము చేతులు ముడుచుకొని కూర్చోబోము. మేము ఏమి చేయాలో అది చేస్తాము,” అని హెచ్చరించారు. అందుకు తెదేపా తెలంగాణా నేతలు కూడా ఘాటుగానే స్పందించారు.
తెదేపా అధ్యక్షుడయిన చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తన పార్టీని బలపరుచుకొనేందుకు బయలుదేరితే ఆయనను అడ్డుకొంటామని ఒక బాధ్యతాయుతమయిన మంత్రి పదవిలో ఉన్న మహేందర్ రెడ్డి హెచ్చరించడం చాలా తప్పు. ప్రతీ భారతీయుడికి దేశంలో ఎక్కడయినా స్వేచ్చగా సంచరించే, స్థిరపడే హక్కలు ఉన్నట్లే, ప్రతీ రాజకీయ పార్టీకి దేశంలో ఏ రాష్ట్రంలోనయినా తన పార్టీని ఏర్పాటుచేసుకొని, దానిని బలపరుచుకొని, ప్రజల తరపున పోరాడుతూ, ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉందని మంత్రిగా ఉన్న ఆయనకి తెలియకపోదు. కానీ తెలంగాణా అంటే అదేదో వేరే దేశం అన్నట్లు అక్కడ ఇతరులకి ప్రవేశించే హక్కు లేదని, ప్రవేశిస్తే అడ్డుకొంటామని వాదిస్తే, అందుకు కోర్టులో మరో మారు మొట్టికాయలు తినక తప్పదు.
క్రిందటి సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ‘తెలంగాణాలో కేవలం తెరాస ఒక్కటే ఉండాలి. తమ పార్టీకి అసలు పోటీయే ఉండకూడదు’ అనే ఆలోచనతో కాంగ్రెస్, తెదేపాలకు చెందిన బలమయిన నేతలను, యం.యల్యే.లను కేసీఆర్ తన పార్టీలోకి ఆకర్షించేరు. అయినప్పటికీ తెదేపా తమ పార్టీకి గట్టి పోటీ ఇస్తుండటంతో దానిపై ‘ఆంద్ర ముద్ర’ వేసి బరిలో నుండి తప్పించాలని విశ్వప్రయత్నం చేసారు. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు గనుక తెదేపాను కూడా ఎదుర్కోక తప్పలేదు. ఇప్పుడు మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరికలు వింటుంటే ఆయన కూడా కేసీఆర్ అభిప్రాయాన్నే మళ్ళీ వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ, వైకాపాలు బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటే దానికి లేని అభ్యంతరం తెదేపా చేస్తేనే ఎందుకు? అని ప్రశ్నించుకొంటే నేటికీ తెరాస నేతలు తెదేపాతో ఉనికితో తీవ్ర అభద్రతాభావానికి గురవుతుండటం వలననే కావచ్చును. ఆ రెండు పార్టీలు ఒకే సమయంలో రెండు రాష్ట్రాలలో అధికారం చేప్పట్టాయి. కనుక సహజంగానే ప్రజలు ఇరు ప్రభుత్వాల, ముఖ్యమంత్రుల పనితీరును ప్రజలు నిత్యం బేరీజు వేసుకొని చూస్తూనే ఉంటారు. విద్యుత్ సంక్షోభం పరిష్కరించే విషయంలో అది నిరూపించబడింది. ఒకవేళ తెదేపా ప్రభుత్వం మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో రాజధాని నగరం నిర్మించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగితే ఆ ప్రభావం తప్పకుండా తెలంగాణా ప్రజలపై కూడా పడుతుంది.
కానీ తెరాస ప్రభుత్వం కూడా ఎంత సమర్ధంగా పరిపాలన చేసినప్పటికీ, అభివృద్ధి సాధించినప్పటికీ ఆ ప్రభావం ఆంద్ర ప్రజలపై పడుతుందేమో గానీ, ప్రాంతీయవాదం ఆధారంగానే పుట్టిన తెరాస ఆంధ్రాలోకి ఎన్నడూ కూడా విస్తరించలేదు. కానీ తెదేపా మాత్రం తెలంగాణాలో కూడా ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను తనవైపు తిప్పుకొనే అవకాశం ఉంది. బహుశః అందుకే తెరాస పార్టీ తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నట్లు కనబడుతోంది. లేకుంటే అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నేటికీ కాంగ్రెస్, తెదేపాకి చెందిన నేతలను తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేసేవారు కాదని చెప్పవచ్చును.
తెదేపా, తెరాస రెండు పార్టీలు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు దోహదపడింది కనుక రెండు ప్రభుత్వాలు కూడా సమర్ధంగా పరిపాలించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే వారికి ప్రజలే పట్టం కడతారు. అలాకాక ఈ నాలుగున్నరేళ్ళలో గాలిలో మేడలు కడుతూ ప్రజలకి బంగారు కలలు చూపిస్తూ కాలక్షేపం చేసినట్లయితే, ఈ విధంగా ఇతర పార్టీలను చూసి ఉలికులికి పడక తప్పదు, ఇతర పార్టీలను చూసి అభాద్రతాభావానికి గురికాక తప్పదు. సెంటిమెంట్లు, పోసికోలు కబుర్లతో ప్రజలను ఆకట్టుకోవచ్చునేమో కానీ వారిని కలకాలం తమకే ఓటు వేసేలా చేయలేవు. ఏ పార్టీ విజయానికయినా ఇప్పుడు అభివృద్దే గీటురాయి. ఈ విషయం గుర్తుంచుకొంటే ఎవరికీ భయపడనవసరం లేదు.