వచ్చే ఎన్నికల నాటికి వైకాపా జెండా మారుతుందేమో?
posted on Jan 5, 2015 @ 8:35PM
ఆంధ్రలో చంద్రప్రభుత్వం రెండేళ్ళు మహా అయితే నాలుగేళ్ళు ఉంటుందని, ఆ తరువాత తానే ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి ఘంటాపదంగా చెపుతున్నారు. అందుకే తుళ్ళూరు రైతులను అధైర్యపడవద్దని, తను ముఖ్యమంత్రి అవగానే ఎవరి భూములు వారికి ఇచ్చేస్తానని హామీ కూడా ఇస్తున్నారు. ఆ భూముల మీద రాజధాని నిలబడిన తరువాత అదెలా సాధ్యపడుతుందో ఆయనే చెప్పి పుణ్యం కట్టుకొంటే బాగుండేది.
ఇదివరకు ఒకపక్క రాష్ట్ర విభజన జరిగిపోతుంటే, నాకు ముప్పై మంది యంపీలను, ఓ 115 మంది శాసనసభ్యులను ఇచ్చినట్లయితే డిల్లీలో చక్రం తిప్పి అడ్డేస్తానని ఆయన హామీ ఇచ్చినప్పుడూ జనాలు ఇలానే చాలా కన్ఫ్యూస్ అయిపోయారు. ఆ కన్ఫ్యూస్ లోనే ఆయనకి ఓటేయడం మరిచిపోయినట్లున్నారు. అయినప్పటికీ గతం గతః కనుక మళ్ళీ వచ్చే ఎన్నికల తరువాత ఆంధ్రాలో ఆయనే ముఖ్యమంత్రి అయిపోదామని డిసైడ్ అయిపోయారు. చాలా సంతోషం.
ఇక ఆ మధ్యన ఎప్పుడో ఆయన హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణాలో కూడా తమ పార్టీయే అధికారంలోకి రాబోతోందని ప్రకటించేశారు. వైకాపా, కాంగ్రెస్, బీజేపీలు తప్ప అధికార తెరాసతో సహా అన్ని పార్టీలు కూడా తెలంగాణా నుండి ఊడ్చిపెట్టుకుపోతాయని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతో, తనకు బాగా అచ్చి వచ్చిన బాణాన్ని తెలంగాణాపైకి వదిలారు. ఆ బాణం అంటే మన షర్మిలమ్మ తెలంగాణాపైకి రివ్వున అలా దూసుకువెళ్లి నలుగురినీ ఓసారి పరామర్శించేసి తిరిగి వెనక్కి వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడప్పుడే వెళ్ళేలాలేరు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించడం లేదు.
మొన్నటి వరకు వైకాపా గట్టు మీద కూర్చొని అందరి మీద విరుచుకుపడ్డ రామచంద్ర రావు ఎవరికీ చెప్పాపెట్టకుండా గట్టు దూకేశారు. అంతకు ముందు మరో ఇద్దరు ముగ్గురు జంప్ అయిపోయారు. మళ్ళీ మరో పెద్దాయన శూన్యమాసం అని కూడా చూడకుండా ఈరోజు పార్టీలో నుండి జంప్ చేసేసారు. ఆయన మరెవరో కాదు అశ్వారావుపేట యం.యల్యే. తాటి వెంకటేశ్వర్లు. ఆయన ఉండేది వైకాపాలో అయినా తెదేపా నేత తుమ్మలతో మంచి దోస్తీ ఉండేది. అందుకే ఆయన వెంటే నేనూ సైతం అంటూ తెరాసలోకి వెళ్లిపోయేందుకు బ్యాగ్ సర్దేసుకొని వెళ్ళిపోతున్నారు.
గమ్మతయిన విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం పార్టీకి చెందిన వైరా యం.యల్యే. మదన లాల్ తెరాసలోకి దూకేసినప్పుడు, అయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈయనే ఓ లేఖ వ్రాసి పట్టుకొని వెళ్లి స్పీకర్ మధుసూధనాచారి చేతిలో పెట్టి వచ్చేరు. కానీ ఇప్పుడు ఈయనే ఆ పార్టీలోకి దూకేస్తున్నారు. ఇక వైకాపాకు తెలంగాణాలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఒక్కరే మిగిలారు. కనుక ఇప్పుడు ఆయన వెళ్లి తాటి మీద అనర్హత వేటు వేయమని స్పీకర్ ని కోరుతారేమో. కానీ ఆయన కూడా బ్యాగ్ సర్దేసుకొన్నారని, కాకపోతే కాస్త వారం వర్జ్యం చూసుకొని వెళదామని ఆగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా వెళ్ళిపోతే ఇక వైకాపాకు తెలంగాణా శాసనసభతో పనుండదు. ప్చె! ఏమిటో...వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో అన్ని పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెపితే అన్నిటి కంటే ముందుగా వైకాపాయే తుడిచిపెట్టుకుపోతోంది. కానీ తెలంగాణాలో వైకాపా ఖాళీ అయిపోతున్నా, జగనన్న కానీ ఆ పార్టీ నేతలు గానీ ఏనాడూ కించిత్ బాధపడినట్లు లేదు. బహుశః వైకాపాను తెరాసలో విలీనం చేస్తున్నామని భావిస్తున్నారో ఏమో?
ఆంధ్రాలో కూడా సేమ్ టు సేమ్ పరిస్థితే కనబడుతోంది. కొంత మంది బీజేపీ తీర్ధం పుచ్చుకొని తరిస్తుంటే మరికొంతమంది తెదేపా కండువాలు కప్పుకోవాలని తహతహలాడుతున్నారు. బహుశః ఇదంతా చూసే కాబోలు ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఉండే అజిత్ జోగీ అనే కాంగ్రెస్ పెద్దాయన జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇచ్చేరు. నిప్పులేనిదే పొగరాదు కనుక తెర వెనుక అటువంటి ప్రయత్నాలు ఏమయినా జరుగుతున్నాయేమోనని అనుమానించక తప్పడం లేదు. ఇలాగయితే వచ్చేఎన్నికల తరువాత జగనన్న ముఖ్యమంత్రి అవడం, రాజన్న రాజ్య స్థాపన చేయడం, స్వర్ణ యుగం తీసుకురావడం ఎలాగో అర్ధం కావడం లేదు.