జమ్మూ, కాశ్మీర్ లో బీజేపీ-పి.డి.పి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం?
posted on Dec 25, 2014 @ 2:29PM
జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడం, బీజేపీ-25 సీట్లు, పీపుల్స్ డెమోక్రేటిక్ పార్టీ (పి.డి.పి.)కి-28 సీట్లు, ఇంతవరకు అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి- 17 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి-12, ఇతరులకి-7 సీట్లు రావడంతో అక్కడ ఇప్పుడు ఏ పార్టీ దేనితో జత కడుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం 87 సీట్లు గల జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ లేదా కూటమికయినా కనీసం 44 సీట్లు అవసరం.
28 సీట్లు సాధించిన పి.డి.పి.కి కాంగ్రెస్ (12) మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. కానీ కేవలం కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యపడదు కనుక మరో నలుగురు స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు కూడా అవసరం ఉంటుంది. కానీ వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కనుక బీజేపీ లేదా తన రాజకీయ ప్రత్యర్ధి నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు ఇస్తే తప్ప పి.డి.పి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు.
భవిష్యత్ అంధకారంగా మారిన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడం కంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో సుస్థిరమయిన పాలన అందించవచ్చని, అప్పుడు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కూడా బాగా సహాయపడుతుందని పి.డి.పి. భావిస్తోంది.
అయితే మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో చేతులు కలిపినట్లయితే మిగిలిన అన్ని పార్టీల నుండి తీవ్ర విమర్శలు మూటగట్టుకోవలసి ఉంటుందనే భయం కూడా పి.డి.పి.ని వెనక్కు లాగుతోంది. ఒకవేళ బీజేపీ మద్దతు తీసుకొంటే ఉప ముఖ్యమంత్రి పదవి, మరి కొన్ని కీలక పదవులు జమ్మూ ప్రాంతం నుండి ఎంపికయిన బీజేపీ సభ్యులకే ఇవ్వవలసి ఉంటుందనే భయం కూడా ఉంది. కానీ దానికి అంతకంటే గత్యంతరం కూడా లేదు.
ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా “బీజేపీ ద్వారములు అన్ని పార్టీలకు తెరిచియే ఉన్నవి” అని ప్రకటించారు. అంటే ఏ పార్టీకయినా మద్దతు ఇచ్చేందుకు లేదా మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బీజేపీ సిద్దమని ఆయన చెప్పినట్లే భావించవచ్చును. ఇప్పటికే ఏడుగురు స్వతంత్ర అభ్యర్దులను పార్టీ వైపుకు తిప్పుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతవరకు ప్రతిపక్షంలో కూర్చొనేందుకు సిద్దమంటూ చెపుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని తనే ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయన పి.డి.పి.కి లేదా పి.డి.పి. ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కనుక ఆయన బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దమని పరోక్షంగా ప్రకటించినట్లే భావించవచ్చును. ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే మొత్తం 42 మంది అవుతారు. స్వతంత్ర సభ్యులు ఏడుగురు కూడా బీజేపీకే మొగ్గు చూపడం నిజమనుకొంటే అప్పుడు బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. కానీ ఎన్నికల సమయంలో ఒమర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేపీ ఇప్పుడు మళ్ళీ అతనితోనే జత కడితే విమర్శలు ఎదుర్కోక తప్పదు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, పి.డి.పి.లు కలిసి (రొటేషన్ పద్దతిలో మంత్రి పదవులు పంచుకొనే షరతు మీద) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.