డామిట్! కధ అడ్డం తిరిగింది
బీహార్ రాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగిపోతున్నాయి. గత ఎన్నికలలో తమ జే.డి.(యు) పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, ఆ కుర్చీలో తనకు అత్యంత విధేయుడయిన జితన్ రామ్ మంజీని కూర్చోబెట్టి రిమోట్ తో పరిపాలన చేయాలనుకొన్నారు. మొదట్లో జితన్ రామ్ విధేయత చూపినా కుర్చీలో కుదురుకొన్నాక, తనపై పెత్తనం చేస్తున్న నితీష్ కుమార్ ని చూసి చిరాకుపడటం మొదలుపెట్టారు. కానీ ఆయన అంత త్వరగా సెటిల్ అయి తనకే జర్కులిస్తారని ఊహించని నితీష్ కుమార్ మళ్ళీ ‘నా కుర్చీ నాకిచ్చేయమని’ పేచీ మొదలుపెట్టారు. ఒకసారి ఆ కుర్చీలో కూర్చొంటే మళ్ళీ ఎవరికీ లేవబుద్ధి కాదని ఆయనకీ తెలుసు. ఆయన కూడా ఆ ఇదితోనే కుర్చీ కావాలని పేచీ పెడుతున్నారు. కానీ ఆ కుర్చీబాగా అలవాటయిపోవడంతో జితన్ రామ్ మంజీ చస్తే అందులో నుండి లేవనని బిగదీసుకొని కూర్చొండిపోయారు.
ఇంత ప్రేమగా ‘కుర్చీ ఇచ్చేయమని అడుగుతున్నా జితన్ రామ్ వినకపోవడంతో ఇక లాభం లేదనుకొని నితీష్ కుమార్ అటువైపు నుండి నరుక్కు రావడం మొదలుపెట్టారు. పేరుకి శరద్ యాదవ్ జేడీ (యూ) పార్టీకి అధ్యక్షుడే కానీ ఆయనని, పార్టీని కూడా నడిపేది తనే గాబట్టి యం.యల్యే.లందరినీ సమావేశానికి హాజరయ్యి తనను వారి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోమని నితీష్ కుమార్ హుకుం జారీ చేయడం, వారు వెంటనే ఆయననే ఎన్నేసుకోవడం చకచకా జరిగిపోయాయి.
కానీ జితన్ రామ్ కూడా గురువును మించిన శిష్యుడే. కనుక వెంటనే మంత్రి వర్గాన్ని సమావేశపరిచేసి అందరూ తనకు మద్దతు ఈయకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసి పడేద్దామని ప్రపోస్ చేసారు. కానీ ఏడుగురు తప్ప అందరూ దానిని అప్పోస్ చేయడంతో, హుటాహుటిన డిల్లీ వెళ్లి మోడీని కాంటాక్టు చేసి చూసారు. ఆయన ఏమి హామీ ఇచ్చారో ఏమో గానీ డిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత జితన్ రామ్ హనుమంతుల వారిలా రెచ్చిపోయారు.
“నితీష్ కుమార్ కి అధికార దాహం బాగా ఎక్కువయిపోయిందని, అందుకే ఎంచక్కా నడుస్తున్నతన ప్రభుత్వాన్ని కూలద్రోసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు చట్టం, రాజ్యాంగం వంటివాటి మీద బొత్తిగా నమక్కం గౌరవం లేవంటూ” చీల్చి చెండాడేశారు. ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి ఆ మాత్రం చాలదూ? అనుకొంటూ తక్షణమే శరద్ యాదవ్ చేత వేలి ముద్ర వేయించేసి పార్టీ నుండి బయటకి సాగనంపేసారు.
ఆ తరువాత గవర్నరు కేశరీ నాద్ త్రిపాటిని కలిసి ‘నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనేందుకు రెడీ’ అంటూ నితీష్ కుమార్ తన వెనకే వచ్చిన యం.యల్యేలందరినీ ఆయన ముందు నిలబెట్టారు. కానీ గవర్నరు వెంటనే ‘ఒకే’ అనేయకుండా ‘నాకు కొంచెం టైం కావాలని’ చెప్పేసరికి నితీష్ కుమార్ షాక్ అయిపోయారు.
నితీష్ కుమార్ అలా బయటకు వెళ్ళగానే, ఇంకా ముఖ్యమంత్రి సీటుని అంటిపెట్టుకొనున్న జితన్ రామ్ మంజీ కూడా రయ్యిమని కారేసుకొని గవర్నరు దగ్గరకు వచ్చి, “మావాళ్ళు అందరూ నాకు హ్యాండిచ్చేసినా, తమరు అనుమతిస్తే ఎక్కడ కావాలంటే అక్కడే నేను నా బలం నిరూపించుకోగలనని” బల్లగుద్దిమరీ చెప్పి వచ్చేసారు.
ఇదంతా చూసి నితీష్ కుమార్ చాలా డిస్సప్పాయింట్ అయిపోయారు. ఏదో గాలిలో తేలుతూ వెళ్లి ముఖ్యమంత్రి కుర్చీలో సెటిల్ అయిపోదామనుకొంటే మధ్యలో బీజేపీ అడ్డుపడుతోందని చాలా బాధపడిపోయారు. “బీజేపీకి అధికార దాహం బాగా ఎక్కువయిపోయింది. జితన్ రామ్ మంజీని అడ్డుపెట్టుకొని అధికారం చేప్పట్టాలని అంతగా ఉబలాటం ఉంటే దానికి ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు?” అంటూ తెగ చికాకు పడిపోయారు. “నేను శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చెపుతుంటే గవర్నరు దొరవారు పట్టించుకోకుండా ఇంకా టైం కావాలంటే దానర్ధం ఏమిటి?” అంటూ ఎక్కడో డిల్లీలో ఉన్న మోడీని, అమిత్ షాకి కూడా వినిపించేలా గద్గద స్వరంతో ప్రశ్నించారు.
ఆయన బాధ చూసి వాళ్ళు కరగలేదు. గానీ బీజేపీ అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ కొంచెం ఇస్ట్రాంగుగానే రియాక్ట్ అయ్యారు. “నితీష్ కుమార్ కి పదవీ కాంక్ష ఉందనే సంగతి ఎన్డీయే నుండి బయటపడినప్పుడే తెలుసు. కానీ ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేక ముఖ్యమంత్రి కుర్చీలో నుండి దిగిపోయిన పెద్దమనిషి ఏవిధంగా ప్రధానమంత్రి అయిపోదామని కలగన్నారో...ఏమో..మళ్ళీ అది తన వల్లకాదని తెలుసుకొని ముఖ్యమంత్రి కుర్చీలో సెటిల్ అయిపోదామని ప్రయత్నిస్తున్నాడు. అసలు న్యాయం, ధర్మం, చట్టం, రాజ్యాంగం వంటి వాటి మీద ఆయన గారికి నమ్మకం ఉంటేగదా?” అంటూ పాత జ్ఞాపకాలన్నిటినీ త్రవ్వి పోశారు.
“గవర్నరు దొరవారు శాసనసభను సమావేశపరిచేందుకు అనుమతిచ్చిన తరువాత మా పార్టీ ఏమి చేయబోతుందో మీకే అర్ధం అవుతుంది” అని ఒక మంచి క్లూ కూడా ఇచ్చేసారు. అది చూసి జితన్ రామ్ మంజీ తెగ సంతోషపడిపోతుంటే, నితీష్ కుమార్ ‘డామిట్ కధ అడ్డం తిరిగింది’ అని తెగ బాధపడిపోతున్నారు.