చంద్రబాబు మరో కొత్త ప్రయోగం, సరికొత్త రికార్డు

  దేశంలో మొట్ట మొదటి సారిగా కాగితం లేకుండా ఐ-ప్యాడ్ లతో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి గూగూల్ హాంగ్ అవుట్స్ ద్వారా ప్రజలతో మాట్లాడబోతున్నారు.   ఈనెల 20వ తేదీన సాయంత్రం ఆరు నుండి ఏడూ వరకు గంటసేపు సాగే ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారు. ఇందుకుగాను ఆసక్తిగలవారు ముందుగా తమ ప్రశ్నలను ఫేస్ బుక్, ట్వీటర్ లేదా గూగూల్ హ్యాంగ్ అవుట్స్ లలో #ఆస్క్ ఏపీ సియం లేదా #ఆస్క్ సిబియన్ (#AskAPCM or #AskCBN) లద్వారా అడగవచ్చును. ఈసారి నైపుణ్యాల అభివృద్ధి మరియు ఉన్నత విద్య అనే రెండు అంశాల మీద ప్రశ్నలు అడిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి సమాధానాలు రాబట్టుకావచ్చును. అయితే ఈ కార్యక్రమం కేవలం ఒక గంట సేపు మాత్రమే సాగుతుంది కనుక కేవలం 15మంది మాత్రమే ఆయనతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ ప్రశ్నలు పోస్ట్ చేసినవారందరితో ఆయన స్వయంగా మాట్లాడలేకపోయినా వారికి ఆయన సమాధానాలు వెళతాయి.   ఇప్పటికే దీని గురించి ఫేస్ బుక్, ట్వీటర్ గూగల్ , రాజకీయ వెబ్ సైట్లలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రిని ప్రశ్నించదలచిన వారు తక్షణమే తమ ప్రశ్నలను పోస్ట్ చేయవచ్చును.

యాదవ్ ఓ సీరియల్ రేపిస్ట్ టాక్సీ డ్రైవర్

  ఇటీవల డిల్లీలో ఉబెర్ క్యాబ్ సర్వీస్ (టాక్సీ సర్వీస్) కు చెందిన శివ కుమార్ యాదవ్ అనే టాక్సీ డ్రవర్ ఒక సాఫ్ట్ వేర్ సంస్థ ఉద్యోగిని ఇంటికి తీసుకువెళుతూ మార్గమద్యంలో కారులో ఆమెపై అత్యాచారం చేసిన తరువాత పోలీసులు అతనిని అరెస్ట్ చేసి లోపల వేశారు. ఆ తరువాత అతని భారిన పడిన మరికొంత మంది మహిళలు కూడా ముందుకు వచ్చి పిర్యాదులు చేయడంతో అతనొక పాత నేరస్తుడేననే విషయం బయటపడింది.   డిల్లీకి సమీపంలో గల రామ్ నగర్ అనే ఒక మురికివాడలో తన ఇంట్లోనే చిన్న పాన్ షాపు నడుపుకొనే 46 ఏళ్ల మహిళపై కూడా అతను కొన్నేళ్ళ క్రితం అత్యాచారం చేసాడు. ఒకే వీధిలో ఉంటున్నందున చనువుగా ఆమెను పిన్ని అని సంభోదిస్తుండేవాడు. కానీ ఒకరోజు ఆ పిన్నినే ఆమె ఇంట్లోనే చెరిచాడు. అయితే నలుగురికి తెలిస్తే తలవంపులని ఆమె భర్త ఈ విషయాన్నీ ఎవరికీ తెలియనీయలేదు. కానీ ఎలాగో అందరికీ తెలిసిపోయింది. అయితే అత్యాచారం చేసిన శివకుమార్ యాదవ్ ను జనాలు ఏమీ అనలేదు కానీ ఆమెను మాత్రం కాకుల్లా పొడుస్తూ చిత్ర హింసలు పెట్టారని ఆమె కన్నీళ్ళు పెట్టుకొంది. ఆ తరువాత 2003లో అతను అదే వీధిలోగల మరొక యువతిని కూడా చెరిచాడు. అయితే ఆమెకు కూడా వీధిలో జనాల నుండి అటువంటి చేదు అనుభవాలే ఎదురవడంతో ఆమె చేసేదేమీ లేక ఆ వీధిని విడిచి ఎక్కడికో వెళ్లిపోయింది.   ఆ తరువాత 2011లో గుర్ గావ్ లో ఒక బార్ డ్యాన్సర్ ని కూడా శివకుమార్ రేప్ చేసాడు. అప్పుడు ఆమె పోలీసు కేసు పెడితే దాదాపు ఏడు నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తరువాత ఆమెతో ఏదోవిధంగా కోర్టు బయట సెటిల్ మెంట్ చేసుకొని జైల్లో నుండి బయట పడ్డాడు. ఆ తరువాత అతను ఆగస్ట్ 2013లో రామ్ నగర్ సమీపంలో గల నాగ్లతార్ అనే ప్రాంతంలో నివసిస్తున్న ఒక 15ఏళ్ల బాలికను తుపాకీ చూపి అత్యాచారం చేసాడు. వెంటనే ఆమె తల్లి తండ్రులు పోలీసులకి పిర్యాదు చేయకుండా ఆమెకు పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసేసి పంపించేసారు. ఆ తరువాత ఆమె భర్తకు ఆ సంగతి తెలిసినప్పుడు అతను పోలీస్ స్టేషన్ లో శివకుమార్ యాదవ్ పై భార్య చేత పిర్యాదు చేయించే ప్రయత్నం చేసాడు. కానీ పోలీసులు పిర్యాదు తీసుకొనేందుకు అంగీకరించలేదు.   ఇంతవరకు ఇంతమంది మహిళల జీవితాలతో చెలగాటమాడుకొన్నప్పటికీ అతనికి ఎటువంటి శిక్షపడకపోవడమే బహుశః అతనికి ఆ దైర్యం కలిగించి ఉండవచ్చును. ఈసారి కూడా తప్పించుకోవచ్చుననే ధీమాతోనే అతను సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసి ఉంటాడు. నిర్భయ కేసు జరిగినప్పుడు దేశమంతా ముక్త కంటంతో ఖండించింది. అప్పుడు కేంద్రం చట్టంలో కొన్ని కటినమయిన మార్పులు చేసింది. ఆ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా నెలకొల్పింది. కానీ ఇంతవరకు ఆ కేసులో నిందితులకు ఎటువంటి శిక్షాపడలేదు. పైగా ప్రభుత్వ ఖర్చులతో జైలులో కులాసాగా గడుపుతున్నారు. వారిలో ఒకరు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొంటున్నాడని ఆ మధ్యన వార్తలు వచ్చేయి. బహుశః చట్టం యొక్క ఈ బలహీనతే ఇటువంటి నేరస్తులకు దైర్యం కల్పిస్తోంది.   కటినమయిన నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ఆనాటి నుండే దేశంలో మహిళలు, బాలికలు చివరికి అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలపై ఇటువంటి మానవ మృగాలు అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. దానికి తోడు సమాజం కూడా భాదితురాలినే దోషిగా చూడటం వలన వారి మనోవేదన ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కారణంగా ఇటువంటి మానవ మృగాలు నేటికీ సమాజంలో విచ్చలవిడిగా తిరుగగలుగుతున్నాయి.   ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు కొలువయ్యి ఉంటారని పెద్దల మాట. అదే విధంగా కలకంటి కన్నీరు ఒలికిన చోట శాంతి ఉండదని మహాభారతం నిరూపిస్తోంది. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేరు ప్రజలు, ప్రభుత్వం, చట్టాలు కూడా. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో.. ఈ చట్టాలు ఆ మానవ మృగాలను ఎప్పటికి శిక్షించగలుగుతాయో...ఎవరికీ తెలియదు. కానీ అంతవరకు స్త్రీ జాతికి ఈ మనోవేదన అనుభవించక తప్పదు.

ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

  ఈనెల 18 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నందున దానికి రెండు రోజుల ముందుగా అంటే ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నిన్న ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే పంట రుణాల మాఫీ కార్యక్రమం మొదలుపెట్టింది కనుక ఆ అంశంపై ఇంతకాలం నానా రభస చేస్తూ దానిని అసెంబ్లీలో కూడా లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకొన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపాకు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే రాజధాని భూముల విషయం, సింగపూర్ సంస్థలతో ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును. రాజధాని భూముల సేకరణలో నేటికీ కొన్ని ఇబ్బందులున్నందున, దానినే అవకాశంగా మలుచుకొని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేయవచ్చును.   సింగపూర్ సంస్థలతో చేసుకొన్న ఒప్పందం గురించి ఇప్పటికే ఆ పార్టీ రభస చేయడం గమనిస్తే, దానిపై వివాదం సృష్టించి ప్రజలలో లేనిపోని అనుమానాలు సృష్టించి అప్పుడు అసెంబ్లీలో కూడా ఆ అంశంపై రభస చేయాలని వైకాపా ఆలోచన కావచ్చును. అయితే పంట రుణాల మాఫీపై ఆ పార్టీ రభస చేస్తున్నప్పుడు కూడా దానిని చూసి చూడనట్లు ఊరుకొని చివరి నిమిషంలో రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించి ఆపార్టీ గాలి తీసేసినట్లే, బహుశః ఈ విషయంలో కూడా చంద్రబాబు తన వ్యూహం సిద్దం చేసుకొని ఉండవచ్చును. అందుకే ప్రభుత్వం అంత నిబ్బరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏమయినప్పటికీ ప్రభుత్వం విద్యుత్, పంట రుణాల మాఫీ, పెన్షన్లు, రాజధాని నిర్మాణం వంటి అన్ని అంశాలలో చురుకుగా ముందుకు అడుగులు వేస్తోంది కనుక ఈసారి కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంపై దానిదే పైచెయ్యి కావచ్చును.

రాజధాని డిజైనింగ్ వరకే ఒప్పందం: మంత్రి నారాయణ

    రాజధాని నిర్మాణం కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చురుకుగా అడుగులు వేస్తోంది. ఒక అత్యద్భుతమయిన అత్యాధునికమైన రాజధాని నిర్మించాలనే ఆలోచనతో నగరాల డిజైయినింగ్ చేయడంలో మంచి అనుభవం, నైపుణ్యం గల సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో మూడు రోజుల క్రితమే ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకొంది. వారు కూడా అంతే చురుకుగా స్పందిస్తూ వెంటనే పని మొదలుపెట్టేసారు. ఒప్పందం సంతకాలు చేసిన మరునాడే రాష్ట్ర రాజధాని సలహా కమిటీ సభ్యులతో సమావేశమయ్యి రాజధాని బృహత్ ప్రణాళిక రూపకల్పన కోసం తాము అవలంభించబోతున్న విధానాలను వివరించి, మూడు దశలలో మొత్తం 22 వారాలపాటు సాగే తమ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఆ మరునాడే అంటే నిన్న బుధవారం నాడు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణతో కలిసి సింగపూర్ నిపుణుల బృందం రాజధాని నిర్మించబోయే 200కిమీ పరిధిలో హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.   అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఏరియల్ సర్వేతో నిపుణుల బృందం చాలా సంతృప్తి చెందింది. దీనివలన రాజధాని నిర్మించబోయే ప్రాంతం, దానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాలు, విస్తారంగా ఉన్న ప్రకృతి వనరులు వంటివన్నీ పరిశీలించగలిగారు కనుక వారికి ఆ ప్రాంతంపై సమగ్ర అవగాహన ఏర్పడింది. త్వరలోనే ఈసారి రోడ్డు మార్గాన్న కూడా అన్ని ప్రాంతాలు పర్యటించి మరింత అవగాహన పెంచుకొన్న తరువాత రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు, డ్రాయింగుల పని మొదలుపెడతారు."   "వారు ఆరు నెలలలోగా ఈ పని మొత్తం పూర్తి చేయవలసి ఉంటుంది. ఈరాత్రికే వారు తమ కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వానికి అందజేసే అవకాశాలున్నాయి. వారు కృష్ణ నది మధ్యలో సహజ సిద్దంగా ఏర్పడిన భవానీ ద్వీపాన్ని చూసి చాలా ముచ్చటపడ్డారు. అటువంటి ద్వీపాలను తాము కృత్రిమంగా సృష్టిస్తుంటామని, కానీ ఆంద్రప్రదేశ్ రాజధాని పక్కనే అటువంటి సహజసిద్దమయిన అందమయిన ద్వీపం ఉండటం చాలా కలిసివచ్చేదిగా ఉందని వారు తెలిపారు,” అని మంత్రి చెప్పారు.   సింగపూర్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందంపై కూడా ప్రతిపక్షాలు వివాదం సృష్టించడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. “ప్రతిపక్షాలు చెపుతున్నట్లుగా ఆ రెండు సంస్థలు ప్రైవేట్ సంస్థలు కావు. ఆ రెండు సింగపూర్ ప్రభుత్వాధీనంలో నడుస్తున్న సంస్థలు. ఒక ప్రభుత్వ సంస్థ మరొక దేశ ప్రభుత్వ సంస్థలతో చేసుకొన్న ఒప్పందాన్ని కూడా తప్పు పట్టగలగడం, దానిపై అనవసర రాద్ధాంతం చేయడం మన ప్రతిపక్షాలకే చెల్లింది. ఆ ఒప్పందంలో దాచిపెట్టేందుకు ఏమీ లేదు. దానిలో ఎటువంటి రహస్యాలు, లొసుగులు లేవు. ఆ ఒప్పందం కేవలం రాజధాని నగరానికి బృహుత్ ప్రణాళికను, మాస్టర్ ప్లాన్ ఇవ్వడం వరకే పరిమితం. ఆ రెండు సంస్థలు రాజధాని నిర్మాణంలో కూడా పాలు పంచుకొంటాయా లేదా అనే విషయం సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తాము."   "ప్రస్తుతానికి వారి పని రాజధానికి డిజైన్, డ్రాయింగులు అందించడం వరకే పరిమితం. వచ్చే ఆరు నెలలలో వారు రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్దం చేసి ఇస్తారు. రాష్ట్రప్రభుత్వంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో వారు సమావేశామవుతూ, రాష్ట్ర అవసరాలను, రాష్ట్ర వనరులను బట్టి రాష్ట్రానికి అన్ని విధాల సరిపోయేవిధంగా రాజధానికి రూపకల్పన చేస్తారు,” అని మంత్రి తెలిపారు.

మరో ఇద్దరితో పవన్ కళ్యాణ్ కటీఫ్

  ‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ తానే స్వయంగా అందర్నీ దూరం చేసుకుంటూ వుంటారా? లేక పవన్ కళ్యాణ్‌కే అందరూ దూరమైపోతూ వుంటారా? ఈ ప్రశ్న ‘‘విత్తు ముందా.. చెట్టు ముందా’’ అనే ప్రశ్నకంటే చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే రిస్కు చేయడం కంటే... అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమయిందో ఆ పాయింట్లోకి వెళ్తే మంచిది. పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లోనూ, వ్యక్తిగతంగానూ ఆయనకి ఎంతోమంది దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా దూరమయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), ‘జనసేన’ పార్టీకి సోలో ప్రతినిధిగా వున్న రాజు రవితేజ కూడా చేరారు. అరె... మొన్నటి వరకూ వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్‌కి జిగిరీ దోస్తుల్లా వున్నారే... ఇంతలోనే ఏమైందన్న సందేహం కలుగుతోంది కదూ?   ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్‌కి బాగా సన్నిహితమైన వ్యక్తుల్లో పీవీపీ కూడా ఒకరు. పీవీపీ అంటే సామాన్యమైన వ్యక్తేమీ కాదు... పెద్ద వ్యాపారవేత్త. సినిమా రంగంలో కూడా విజయాలు సాధించాడు. అలాంటి పీవీపీ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో ఆయనకి చేరువయ్యారు. అలా పవన్‌కి, పీవీపికి మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహంతోనే ‘జనసేన’ పార్టీకి సంబంధించిన రెండు భారీ బహిరంగసభల్ని పీవీపీ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. అందుకు ప్రత్యుపకారంగానే గడచిన ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం టిక్కెట్‌ కోసం పీవీపీని పవన్ కళ్యాణ్ రికమండ్ చేశారు. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ మాట కాదనలేక పీవీపీకి పార్లమెంట్ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయితే ఆ టిక్కెట్ని ఆశించిన తెలుగుదేశం నాయకుడు కేశినేని నాని పట్టుపట్టడంతో చంద్రబాబు పీవీపీకి సారీ చెప్పేశారు. అయితే ఆ దశలో పవన్ కళ్యాణ్ పట్టుబట్టి తనకు టిక్కెట్ ఇప్పిస్తారని పీవీపీ ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎక్కువ చొరవ చూపించకపోవడంతో విజయవాడ ఎంపీ కావాలన్న పీవీపీ కల కరిగిపోయింది.   తన కలను నిజం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా చొరవ చూపలేదని పీవీపీ మనసు కష్టపెట్టుకున్నారని తెలుస్తోంది. అందుకే విజయవాడలో భారీ షాపింగ్ మాల్‌ని నిర్మించిన పీవీపీ దాని ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ని ఆహ్వానించారు. అప్పటి వరకూ సన్నిహితంగా వున్న పవన్ కళ్యాణ్‌‌ని మాత్రం ఆహ్వానించలేదు. అక్కడితో ఆగని పీవీపీ జనసేన సభల కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బుతోపాటు, సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేయాలని పవన్ కళ్యాణ్‌ని డిమాండ్ చేశారట. దాంతో పవన్ కళ్యాణ్ రెండు కోట్లు మినహా మిగతా డబ్బంతా తిరిగి ఇచ్చేశారట. ఆ రెండు కోట్లు త్వరలో సర్దుతానని చెప్పారట. ఇలా వీరిద్దరి స్నేహ సుమం వాడిపోయింది.   ఇక పవన్ కళ్యాణ్‌కి దూరమైన మరో మిత్రుడు రాజు రవితేజ. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని పెట్టకముందు రాజు రవితేజ అంటే ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణే స్వయంగా రాజు రవితేజ తన పార్టీ వ్యవహారాలన్నీ చూస్తారని ప్రకటించడంతో రాజు రవితేజ సడెన్‌గా లైమ్ లైట్‌లోకి వచ్చారు. చాలాకాలంపాటు పవన్ కళ్యాణ్ అంటే రాజు రవితేజ, రాజు రవితేజ అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వీరిద్దరి మధ్య స్నేహ బంధం వెల్లివిరిసింది. అయితే ఆ తర్వాత ఏమైందోగానీ రాజు రవితేజని పార్టీ వ్యవహారాల నుంచి పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టడం ప్రారంభించారు. పార్టీకి సంబంధించి ఏదైనా చెప్పాలంటే తానే చెబుతానని తన పార్టీకి వేరే ప్రతినిధులెవరూ లేరని పవన్ వెల్లడించడంతో రాజు రవితేజ ఎంత వేగంగా లైమ్ లైట్లోకి వచ్చారో అంతే వేగంగా చీకట్లోకి వెళ్ళిపోయారు. ఇదీ జరిగింది. ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌కి ఎవరెవరు చేరువవుతారో.. ఎవరెవరు దూరమవుతారో వేచి చూడాలి.

మోడీ మీద కేసీఆర్ పొగడ్తల వర్షం

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది చాలా పెద్ద మనసు.. ఎవర్నయినా తిట్టే విషయంలో ఎంత ధారాళంగా తిడతారో, పొగిడే విషయంలో కూడా అంత బాగా పొగుడుతారు. గతంలో తిట్టిన వారిని పొగిడే విషయంలో కూడా ఆయన ఎంతమాత్రం వెనుకడుగు వేయరని రాజకీయ పరిశీకులు అంటూ వుంటారు. నిన్న మొన్నటి వరకూ మోడీని మోడీ,.. గీడీ.. సన్నాసి అని తిట్టిన కేసీఆర్ ఇప్పుడు మోడీ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మొన్నామధ్య ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పుడు అందులో పాల్గొన్న కేసీఆర్ మోడీతో ఎంత సన్నిహితంగా మెలిగారో అందరం చూసి తరించాం. ఈ సందర్భంగా దిగిన గ్రూప్ ఫొటోలో కూడా మోడీ, కేసీఆర్ అతుక్కున్నట్టుగా నిలబడ్డారు. తెలియనివాళ్ళెవరైనా చూశారంటే, కేసీఆర్ - నరేంద్ర మోడీ ఇద్దరూ అతుక్కునిగానీ పుట్టారేమోనని అనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకోగానీ కేసీఆర్ ఈ మధ్య నరేంద్ర మోడీ మీద అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. రాష్ట్రంలో బీజేపీ వారితో కూడా చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నారు. సర్లెండి.. కేసీఆర్ ఏమి చేసినా, ఎలా ప్రవర్తించినా అది బంగారు తెలంగాణ కోసమే అనుకోండీ.. అది వేరే సంగతి.   తాజాగా కేసీఆర్ గతంలో తిట్టిన నోటితోనే నరేంద్ర మోడీ మీద పొగడ్తల వర్షం కురిపించారు. ఈ శుభ సందర్భం మంగళవారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం‌లో వచ్చింది. ఈ సమావేశం అలా ప్రారంభమైందో లేదో కేసీఆర్ ఇలా మోడీని పొగడ్డం మొదలుపెట్టారట. ఇటీవల తాను ప్రణాళికా సంఘానికి సంబంధించిన సమావేశానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ పనితీరును చాలా బాగా గమనించానని, ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని, మోడీ తన పనితీరుతో ప్రపంచ ఖ్యాతిని పొందుతున్నారని పొగిడారట. అక్కడితో ఆగారా.. లేదు.. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలకు మోడీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, మొత్తం 66 పథకాలకు నిధులు ఇచ్చే విషయంలో మోడీ ఎంతో చొరవ చూపి తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తున్నారని చెప్పారట. ఇలా మోడీ పొగడ్తల పరంపర నాన్‌స్టాప్‌గా ఓ పావుగంట సేపు కొనసాగిందట. మోడీ అంటే గిట్టని కొంతమంది సభ్యులు మమ్మల్ని పిల్చిన పనేంటో చెప్పండి సార్ అని అనేసరికి కేసీఆర్ పొగడ్తల ప్రపంచం నుంచి బయటపడ్డారట.

అందరినీ ఊరిస్తున్న తమిళనాడులో రాజకీయ శూన్యత

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆమె బెయిలు పొందినప్పటికీ ఆమెపై అనర్హత వేటు పడింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన డి.యం.కె.పార్టీ అధినేత కరుణానిధి (90) వయోభారంతో పార్టీని నడిపించలేక అవస్థలు పడుతుంటే, అతని ఇరువురు కుమారులు అళగిరి, మరియు స్టాలిన్ తండ్రి తరువాత పార్టీని స్వంతం చేసుకొనేందుకు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటుండటంతో ఆ పార్టీ కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది.   ఇదే అదునుగా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆలోచనతో రాష్ట్ర పి.సి.సి.అధ్యక్షుడుగా ఉన్న వాసన్ కాంగ్రెస్ పార్టీని వీడి స్వంత కుంపటి పెట్టుకొన్నారు. తమిళ సినిమా రంగాన్ని శాసిస్తున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ ని తన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు గట్టిగానే చేసారు. కానీ అవీ ఫలించలేదు. రాష్ట్రంలో నెలకొన్న ఈ రాజకీయ అస్థిరతను చూసి రజనీకాంత్ కూడా రాజకీయాలలోకి ప్రవేశించాలని కొంచెం ఊగిసలాడారు. కానీ దైర్యం చేయలేకపోయారు.   అలాగే తమిళనాట విశేష ఆదరణ ఉన్న మరో హీరో విజయ్ కూడా రాజకీయపార్టీ పెట్టేందుకు ఊగిసలాడుతున్నారు. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది అభిమానులు, 350 అభిమాన సంఘాలు ఉన్నందున, వారి మద్దతుతో రాజకీయాలలో చాల తేలికగా రాణించవచ్చని భావించారు. అందుకు ఆయన అభిమానులు కూడా మద్దతు తెలిపారు. కానీ ఆయన తండ్రి మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. సినీ రంగంలో పతాక స్థాయికి చేరి మంచి పేరు, డబ్బు, అభిమానుల ఆదరణ సంపాదించుకొంటున్న ఈ సమయంలో దానిని వీడి, రాజకీయాలలో ప్రవేశించడం అంటే ఆత్మహత్యతో సమానమని ఆయన గట్టిగా హెచ్చరించడంతో విజయ్ కూడా ఆ ఆలోచన విరమించుకొన్నారు.   అయితే రాజకీయాలలో చేరాలనే ఆ దురద మాత్రం వదిలించుకోలేక పోయారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలలో దేనిలోనూ చేరే అవకాశం, ఆలోచనా రెండూ లేవు కనుక ఆయన త్వరలో బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని తహతహలాడుతున్న బీజేపీ కూడా ఆయన వంటి మంచి ప్రజాధారణగల నేత వచ్చి చేరుతానంటే తప్పకుండా స్వాగతిస్తుంది. ఆయన కనుక చేరితే తమిళనాట నెలకొన్న ఈ రాజకీయ శూన్యతను బీజేపీ భర్తీ చేసేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేయవచ్చును. బీజేపీ కాక మరో నాలుగయిదు ప్రాంతీయ పార్టీలు కూడా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.   అయితే జయలలితపై అనర్హత వేటు పడినప్పటికీ, ఆమె అధికారంలో లేనప్పటికీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నది మాత్రం ఆమె వీర విధేయులే. పైగా అధికార అన్నాడియంకె ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. మరోనాలుగున్నరేళ్ళ వరకు అసెంబ్లీకి ఎన్నికలు కూడా లేవు. కనుక ఆమె కూడా చాలా నిశ్చింతగానే కనిపిస్తున్నారు.

జగన్ కి ఆ వివరాలు ఎందుకు?

  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆదాయం, ఖర్చులు, అప్పులు, ప్రణాళికేతర ఖర్చులు వంటి వివరాలు కోరుతూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ వ్రాసారు. కేంద్రప్రభుత్వం తన ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారిక వెబ్ సైట్లో ఉంచుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ వివరాలన్నిటినీ ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో పెడుతున్నట్లయితే ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకొనే అవకాశం కలుగుతుందని సూచించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాలపై అర్ధవంతమయిన చర్చలు చేయాలనే ఉద్దేశ్యంతోనే తానీ వివరాలు కోరుతున్నానని, అందువల్ల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా తను కోరిన వివరాలను తనకు అందజేయాలని ఆయన ముఖ్యమంత్రిని లేఖలో కోరారు.   అయితే దానికి ఆర్ధిక మంత్రి చాలా ఘాటుగా బదులిచ్చారు. అనేక ఆర్ధిక నేరాలలో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అటువంటి వివరాలు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. వీలయితే అతనే తన అక్రమాస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించి, తన అధికారిక వెబ్ సైట్లో కూడా ఆ వివరాలు పెడితే బాగుంటుందని సూచించారు. యనమల మంచి ధీటుగా, చాలా ఘాటుగానే జవాబు ఇచ్చారు.   అయితే జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక నేరాలలో నిందితుడిగా ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కనుక ఆ వివరాలు కోరే హక్కు అతనికి ఉంటుంది. ఒకవేళ ఆయనకు నిజంగా ఆ వివరాలు కావలసి ఉండి ఉంటే, ఆయన ముఖ్యమంత్రికి ఈ విధంగా లేఖ వ్రాసే బదులు, ఒక ప్రజా ప్రతినిధి హోదాలో లేదా క్యాబినెట్ ర్యాంక్ హోదా అనుభవిస్తున్న ఒక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సంబంధిత అధికారులకు నేరుగా లేఖ వ్రాసి ఉండేవారు. అప్పుడు వారు ఆయన కోరిన వివరాలను అందజేయడానికి నిరాకరిస్తే అప్పుడు ఆయన ఆ సంగతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి ఉంటే, ఆయనను ఎవరూ అనుమానించే, విమర్శించే అవకాశం ఉండేది కాదని చెప్పవచ్చును.   కానీ ఆయన ఉద్దేశ్యం ఆ వివరాలు సేకరించడం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటువంటి సమాధానం ఏదో రాబట్టడమే కనుక ముఖ్యమంత్రికి లేఖ వ్రాసారు. ఆయన హించినట్లే ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఘాటుగా బదులిచ్చారు. కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏదో దాస్తోందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేయవచ్చును.   కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా పాలనలో పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు కనుకనే ఆయన క్రమంగా కాగితాలు, ఫైళ్ళ స్థానంలో కంప్యూటర్లను ప్రవేశపెడుతున్నారు. క్రిందటి సారి జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎక్కడా కాగితం ఉపయోగించకుండా కంప్యూటర్లతోనే ఆయన సమావేశం నిర్వహించారు. ఆ కంప్యూటర్లలో నిక్షిప్తమయిన వివరాలు అన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ పద్దతిలో ఆన్ లైన్లో భద్రపరిచారు. ఒకవేళ పాలనలో లొసుగులు, అక్రమాలు జరుగుతున్నట్లయితే ఎవరూ కూడా ఈ విధంగా వివరాలను కంప్యూటర్లలో భద్రపరిచే సాహసం చేయరని జగన్ కూడా గుర్తించవలసి ఉంది. అతను నిజంగా సభలో అర్ధవంతమయిన చర్చల కోసమే ఆ వివరాలు కోరి ఉండి ఉంటే ప్రభుత్వం ఆ వివరాలను క్షణాలలో అతనికి అందజేయగలదు. కానీ అతను ప్రభుత్వంపై ఏదో రకంగా బురద జల్లే ఉద్దేశ్యంతోనే ఈవిధంగా లేఖ వ్రాసి ఉండవచ్చనే అభిప్రాయంతోనే బహుశః యనమల ఆ విధంగా సమాధానం ఇచ్చి ఉండవచ్చును. ఏమయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలలో ఇది కూడా ఒక వివాదానికి దారి తీయవచ్చును. దీనిపై సభలో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య వాగ్వాదం జరగడం తధ్యం.

ఈ-టీవీ, సాక్షి ఛానళ్ళ ప్రసారాలపై కూడా వేటు?

  గత ఐదున్నర నెలలుగా తెలంగాణాలో ఆంధ్రజ్యోతి, టీవి-9 న్యూస్ ఛానళ్ళపై నిషేధం కొనసాగుతున్న సంగతి, దానిపై సుప్రీంకోర్టులో పిటిషను వేయడం గురించి అందరికీ తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా ఆంధ్రాకు చెందిన మరో రెండు న్యూస్ ఛానళ్ళు(ఈ-టీవి ఆంద్రప్రదేశ్ మరియు సాక్షి) కూడా ప్రసారం కావడం లేదని సికింద్రాబాద్ లోని మారేడ్ పల్లి, సైనిక్ పూరి, తార్నాక, హబ్సిగూడా మరియు ఉప్పల్ ప్రాంతాల ప్రజల నుండి పిర్యాదులు అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై ఎటువంటి నిషేధము లేదని గ్రేటర్ హైదరాబాద్ కేబిల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు యల్. హరి గౌడ్ తెలిపారు. జంట నగరాలలో దాదాపు 90శాతం కేబిల్ ప్రసారాలను నాలుగు కేబిల్ ఆపరేటింగ్ సంస్థలు నిర్వహిస్తున్నాయని, వారి మధ్య ఈ ప్రసారాల ద్వారా వచ్చే ఆదాయం పంచుకోవడంలో ఏమయినా సమస్యలు ఏర్పడినట్లయితే ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఆ కారణంగా యం.యస్.ఓ.లు సదరు న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకి ‘క్యారీయింగ్ ఫీజ్’ చెల్లించడంలో ఆలస్యం అవడం చేత తాత్కాలికంగా ఏవయినా చానల్స్ నిలిచిపోయి ఉండవచ్చు తప్ప కొత్తగా దేనిపైనా ఎటువంటి నిషేధం లేదని చెప్పారు. ఇంతవరకు నిలిపివేయబడిన టీవి-9 న్యూస్ ఛానల్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో ప్రసారం అవుతున్నట్లు సమాచారం.

ఎర్ర పార్టీలకీ కులం స్టిక్కర్లు ..

  కడవంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువేనన్నట్లుగా ఏ రంగంలో ఎంత సుప్రసిద్దులయినప్పటికీ వారు కూడా వారి కులానికి, మతానికీ, ప్రాంతానికీ కట్టుబడి వ్యవహరించక తప్పదు. భారతదేశం రాజకీయాలలో కుల మతాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తాము 100 పర్సంట్ లౌకికవాద పార్టీలమని భుజాలు చరుచుకొనే కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఈ కులసమీకరణలు లేకుండా ఏ శుభకార్యం తలపెట్టవు అంటే అతిశయోక్తి కాదు. అందుకు కాంగ్రెసే కాదు ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు లెఫ్ట్ పార్టీలతో సహా. కులమతాల లెక్కలకు తాము అతీతులమని చెప్పుకొనే లెఫ్ట్ పార్టీలు, చివరికి మావోయిష్టులలో కూడా అప్పుడప్పుడు ఈ కులసమీకరణాలు సరి చూసుకోక తప్పడం లేదీరోజుల్లో. అందుకే జనాలు కూడా కులాల వారిగా కార్తీకమాసంలో వన(కుల) భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అందరికీ తెలిసిందే.   ఒకప్పుడు అవి కేవలం విందు వినోద సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమయ్యి ఉండేవి. కానీ ప్రజలలో కుల చైతన్యంతో బాటు రాజకీయ చైతన్యం కూడా క్రమంగా పెరుగుతుండటంతో, ఈ వన (కుల)భోజనాలకి తమ ‘కులపోడు’ అయిన ఏ రాజకీయ నాయకుడినో తోలుకొని రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది. ఆ విధంగా ఆ నేతతో పరిచయం చేసుకొని ఎప్పుడయినా అవసరపడితే తమ ఆ కులపోడి సహాయం పొందాలనే ఆలోచన నిర్వాహకులదయితే, కులపోళ్ళు ఓట్లు అంటే పెరట్లో కోళ్ళవంటివని నమ్మే సదరు నేతలు కూడా వారు పిలవగానే ఆ పేరంటానికి వచ్చి హాజరు వేయించుకొని, టోటల్ ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఓసారి లెక్క చూసుకొన్నాక, తాము కులపోళ్ళకి ఏవిధంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నదీ చెప్పుకొని, అవసరమయితే తమని సంప్రదించమని ఒక అభయహస్తం పడేసి, ఎన్నికల సమయంలో గుర్తుంచుకోమని ఒక విన్నపం చేసుకొని దర్జాగా వచ్చిన కారులోనే వెళ్ళిపోతారు. ఆవిధంగా వన(కుల) భోజనాలు పూర్తవుతుంటాయి.   ఇక విషయంలోకి వస్తే, ఈ వన(కుల) భోజనాలకి రమ్మనిపిలిస్తే రాము పొమ్మని చెప్పే సాహసం ఎవరూ చేయలేరు. చివరికి కులం, మతం పేరు చెపితే కళ్ళెర్ర జేసే ఎరెర్ర పార్టీ ఓళ్ళు కూడా కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అలాగని వస్తే మీడియావాళ్ళు ఇలా కాకుల్లా పొడిచేసే ప్రమాదం ఉంటుంది. చట్టానికి ఎవరూ అతీతులు కానట్లే ఎవరూ కూడా కులానికి అతీతులు కారు గనుక ఎర్రనేతలు ఫోటోలు బ్యానర్లు కూడా వన(కుల) భోజనాలలో ప్రత్యక్షం అవుతున్నాయి. దైర్యం ఉన్నవాళ్ళు చడీ చప్పుడు చేయకుండా వెళ్లివచ్చేస్తున్నారు. లేకుంటే ఏదో ఊర్లోనో, రాష్ట్రంలోనో ఓ ఎర్ర మీటింగ్ పెట్టుకొని తప్పించుకొంటారు. అయినప్పటికీ నిర్వాహకులే కొంచెం చొరవ తీసేసుకొంటూ ‘ఈడూ మన కులపోడే’ అనే ఫోటో బ్యానర్లు పెట్టేసుకొని మమ అనిపించేస్తున్నారు.   ఇటువంటి సమస్యే సీపీయం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి టీ. వీరభద్రం, ఖమ్మం జిల్లా కార్యదర్శి పి. సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బి. హేమంత్ రావు, పార్టీ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వర రావు, సీపీఐ (యం.యల్.) న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నేత పోటు రంగ రావు, తదితరుల ఫోటోలున్న ఫ్లెక్సీ బ్యానర్లు ఇటీవల జిల్లాలో నిర్వహించిన వన(కుల) భోజనాల కార్యక్రమంలో దర్శనమిచ్చాయి. అయితే వాటిని ఖండిస్తే ఏమవుతుందో వారికీ తెలుసు కనుక తమ ఫోటోలు, బ్యానర్లు పెట్టుకొనంత మాత్రాన్న తమకి ఆ కుల ఫీలింగ్ అంత లేదని చెప్పుకొనేందుకు మిక్స్ డ్ విజిటేబిల్ కర్రీ లాగ అందరు కులపోళ్ళన్ని పోగేసి మళ్ళీ వారు ‘సమానత్వ భోజనాలు’ అనే కార్యక్రమాలు నిర్వహించ వలసివచ్చింది.   ఎన్నికలు వచ్చే వరకు ఈ కుల, మతాతీతం ట్యాగ్ కాపాడుకోవడం కోసం ఈ తిప్పలు తప్పవు. కానీ ఎన్నికలలో మాత్రం కంప్యూటరో లేకపోతే ఓ కాలిక్యులెటర్ పట్టుకొని మరీ పక్కగా కులసమీకరణాల లెక్కలు సరిచూసుకొన్న తరువాతనే సీట్ల కేటాయింపులు చేస్తారు. దానిని బట్టే జనాల ఓట్లు కూడా పడుతుంటాయి. ఏమి చేస్తాం కులానికి ఎవరూ అతీతులు కారాయె మరి!

ఇక అవి కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగమే

  ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ఏడు మండలాలను, ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను, కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఏడు మండలాల బదిలీ ప్రక్రియ ఈ మధ్యనే పూర్తయిందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణరావు తెలిపారు. ఆ మండలాలతో బాటు అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేయబడ్డారు. కనుక వారికి ఈ నెల నుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే జీతాలు చెల్లించబోతున్నట్లు ఆయన తెలిపారు. పరిపాలనా సౌలభ్యం మరియు భౌగోళిక స్థితిని బట్టి ఆ ఏడు మండలాలో కొన్నిటిని తూర్పు గోదావరి మరి కొన్నిటిని పశ్చిమ గోదావరి జిల్లాలలో విలీనం చేసారు. కనుక రాష్ట్ర పోలీస్ పరిధి కూడా ఆ మేరకు పెంచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.   అదేవిధంగా భద్రాచలం సమీపంలో ఆంద్ర సరిహద్దులో గల ఏటిపాక కేంద్రంగా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రెండు జిల్లాలలో విస్తరించిన ఆ ఏడు మండలాలు దాని క్రిందకు వస్తాయి. ఈ పని పూర్తయిన తరువాత నుండి ఆ ఏడు మండలాలలో నివసిస్తున్న ఆదివాసీల పునరావాసానికి అవసరమయిన చర్యలు చెప్పట్టడం మొదలయ్యే అవకాశం ఉంది. కొత్తగా రాష్ట్రంలో విలీనమయిన ఈ మండలాలకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిని విస్తరించేందుకు అవసరమయిన మార్గదర్శకాలు, ఏర్పాటు మరొక వారం రోజుల్లో పూర్తవుతాయని ఆయన తెలిపారు.

మరో ఉద్యమమా... తమరికో దండం...

  ఆ పెద్దమనిషి ఒక ప్రభుత్వోద్యోగి. ఉద్యోగ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారన్న విషయం అలా వుంచితే, విప్లవం పేరు చెప్పి కుర్రాళ్ళని రెచ్చగొట్టడంలో, ఉద్యమం పేరుతో ప్రాంతీయ విభేదాలను పెంచడంలో ఆయనకు ఆయనే సాటి. ముగిసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర తక్కువేమీ కాదు. ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ ఆయన రోజుకు రెండు మూడుసార్లు తెలంగాణ యువతకు పిలుపునిచ్చేవారు. అయితే ఆయన పిలుపు పుణ్యమని అనలేముగానీ, అప్పట్లో తెలంగాణలో యువకుల ఆత్మహత్యలు మాత్రం బాగా పెరిగిపోయాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన టీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సహకారం కూడా అలాంటి ఇలాంటి సహకారం కాదు. టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నిటినీ తెలంగాణ ప్రజలకు దూరం చేయడంలో ఆయన తనవంతు పాత్రని విజయవంతంగా పోషించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ పార్టీకి అంత సేవ చేసి వుండరేమో... ఈయన గారు మాత్రం ఆ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈయనకి పెద్దపెద్ద పదవులు రావడం ఖాయమని అప్పట్లో చాలామంది గుసగుసలాడుకున్నారు. కొంతమంది బాహాటంగానే అన్నారు. అయినప్పటికీ ఈ సారు ఎంతమాత్రం వెనకడుగు వేయకుండా టీఆర్ఎస్‌కి అండగా నిలబడ్డారు.   ఉద్యమ ఫలితమో, ఆత్మహత్యల ప్రభావమో, రాజకీయ క్రీడలో భాగమోగానీ.. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. మంచో, చెడో ఒక చారిత్రక పరిణామం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఎవరి బతుకు వారు బతకాలని డిసైడైపోయింది. ఆరకంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ముగిసింది. అలా ఉద్యమం ముగిసిందో లేదో... ఇలా రాజకీయ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉద్యమంలో సదరు పెద్దమనిషి చిటికెన వేలు పట్టుకుని నడిచిన చాలామంది ఉద్యమకారులు ఎమ్మెల్యేలు అయిపోయారు. ఎంపీలు అయ్యారు. రకరకాల పదవులు పొందారు. అయితే సదరు పెద్దాయనని మాత్రం పలకరించినవాళ్ళెవరూ లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించేవరకూ పెద్దాయనని ఎంతో గౌరవించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. తన శాయశక్తులా టీఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేశా కదా.. తనకు కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందని, ఏదో ఒక మంచి పదవి తనకు దక్కుతుందని ఎదురుచూశారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోయేసరికి షాక్‌కి గురైన ఆయన గత కొంతకాలంగా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడిపోయారు. తనను ఎంతమాత్రం పట్టించుకోని కేసీఆర్ మీద బాహాటంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని వున్నా, ఒకవేళ తాను నోరు జారితే ‘దారిలో వున్న’ పదవి కూడా రాకుండా పోతుందేమోనని ఓర్పు వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు దాటినప్పటికీ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు, గుర్తింపు రాకపోవడంతో ఆయన ఇప్పుడు గొంతు సవరించుకుని విమర్శల పరంపరను ప్రారంభించారు.   గత కొద్ది రోజులుగా సదరు పెద్దమనిషి కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ సాధించే పోరాటం అయిపోయిందని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సరిగా పనిచేసేలా చేసే పోరాటం చేయాల్సి వుందని పిలుపు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ తెలంగాణ మేధావులు, కేసీఆర్ వ్యతిరేక శక్తులు గుర్తుకు వచ్చారు. వాళ్ళందరూ తనకు అండగా వుంటే మరో పోరాటం చేపట్టాలని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వున్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని ఆయన బాధగా చెబుతున్నారు. ప్రభుత్వాన్ని సరిగా పనిచేసేలా ఉద్యమించబోతున్నానని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన మీటింగులు ఏర్పాటు చేసే పనిలో వున్నారు. మొన్నటి వరకూ పదవి ఏదైనా వస్తుందేమోనని ఆశగా ఎదురుచూసిన ఆయన ఇక తనకు అలాంటి ఛాన్స్ లేదని స్పష్టంగా తెలిసిపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఉద్యమం కబుర్లు చెబుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆయనచెప్పినట్టుగా ఉద్యమాలు చేసే స్థితిలో లేరని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా విద్యార్థులతోపాటు తెలంగాణలోని ఎన్నో వర్గాలు నష్టపోయాయి. ఇప్పుడు కాస్తంత ప్రశాంతంగా ఉన్నాయి. మళ్ళీ ఉద్యమాలంటూ ఈ పెద్దమనిషి చేస్తున్న హడావిడిని ప్రజలు హర్షించరని అంటున్నారు. అందువల్ల తెలంగాణ ప్రజలు సదరు పెద్దమనిషి చేపట్టిన కొత్త ఉద్యమానికో దండం అంటున్నారని పరిశీకులకులు చెబుతున్నారు.

కేసీఆర్ అమెరికా పర్యటన ఎప్పుడో...ఎందుకో?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హైదరాబాద్ లో గల అమెరికన్ కౌన్సిలేట్ కార్యాలయానికి వెళ్లి డిప్లోమేటిక్ వీసా కోసం అవసరమయిన ఫార్మాలిటీలు పూర్తి చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన కార్యాలయ అధికారులు ఇంతవరకు ఎన్నడూ కూడా ఆయన వీసా కోసం దరఖాస్తు చేయబోతున్నట్లు కానీ, అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగానీ చెప్పలేదు. అందువల్ల కేసీఆర్ నిన్నవీసా కోసం దరఖాస్తు చేసి రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇటీవల సింగపూర్ వెళ్ళి వచ్చిన తరువాత ఆయన కొత్త పరిశ్రమల ఊసు ఎత్తలేదు గానీ, సింగపూర్ పర్యటన ప్రభావమో ఏమో తెలియదు గానీ హుస్సేన్ సాగర్ చుట్టూ వంద అంతస్తుల భవనాలు కట్టిస్తానని, ఇందిరా పార్క్ వద్ద ప్రపంచంలోకెల్లా ఎట్టయినా భవనం కట్టిస్తానని ప్రకటించేశారు. హైదరాబాద్ ఈ కొస నుండి ఆ కొసకి స్కై వేలు, ఎక్స్ ప్రెస్ హైవేలు కట్టించేసేందుకు ఫిక్స్ అయిపోయారు.   అయితే ఈసారి ఆయన అమెరికా ఎప్పుడు, ఎందుకు వెళతారో ఇంకా తెలియవలసి ఉంది. ఇప్పటికిప్పుడు కాక పోయినా వచ్చే ఏడాదిలోనయినా ఆయన అమెరికా వెళ్ళడం తధ్యంలా కనబడుతోంది. రాజకీయ నేతలకు ఇచ్చే ఈ వీసాకు గడువు పదేళ్ళు ఉంటుంది. కనుక అప్పటిలోగా ఎన్నిసార్లయినా అమెరికా వెళ్లి రావచ్చును.   బహుశః తన సింగపూర్ పర్యటన ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, తెలంగాణా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన అమెరికా వెళ్లి వారి ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకు రావాలని ఆశిస్తున్నారేమో? అందుకే అయితే అది మంచి ఆలోచనేనని చెప్పవచ్చును. కొన్ని పత్రికలలో ఆయన హెల్త్ చెకప్ కోసమే అమెరికా వెళ్ళాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చేయి. కానీ దానికోసం ఆయన డిప్లోమేటిక్ వీసా తీసుకోనవసరం లేదు. అదేవిధంగా అమెరికాలో ఉన్న తన బంధుమిత్రులను కలిసి వచ్చేందుకు కూడా ఇటువంటి వీసా అవసరం లేదు. కనుక ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకే ఆయన అమెరికా వెళ్లాలని భావిస్తుండవచ్చును. కానీ ఎప్పుడు వెళతారనేది ఆయనే చెప్పాలి.   వచ్చే ఫిబ్రవరి నెలలో 2015-16 ఆర్ధిక సం.నికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టవలసి ఉంది కనుక, బహుశః ఆ పని పూర్తయిన తరువాత ఎప్పుడయినా ఆయన అమెరికా వెళతారేమో. కాకపోతే ఈసారి అమెరికా వెళ్లి వచ్చిన తరువాత అసలు పని పక్కనబెట్టి మరేదో తలకెత్తుకోకుంటే చాలు.

జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు చురకలు

  వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పంట రుణాల మాఫీ అంశాన్ని రాజకీయ అస్త్రంగా చేసుకొని అధికార తెదేపాపైకి గురిపెడుతుంటే, తెదేపా కూడా సరిగ్గా అదే అంశంతో వైకాపాపై ఇరుకున బెట్టే ప్రయత్నం చేసింది. ఈ అంశాన్ని అందిపుచ్చుకొన్న వైకాపా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంది.   అయితే వారి కార్యక్రమానికి సరిగ్గా 24గంటల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.50,000లోపు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.1.50లక్ష వరకు రుణాలను రెండు దశలలో మాఫీ చేయబోతున్నట్లు తేదీలతో సహా ప్రకటించడంతో, రుణాల మాఫీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రజలలో నిలదీద్దామనుకొన్న వైకాపా కంగుతింది.   ప్రభుత్వం రుణాల మాఫీ చేతున్నట్లు ప్రకటించిన తరువాత కూడా ఇంకా ధర్నాలు దేనికి చేస్తున్నట్లు అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగని ఇంతవరకు వచ్చిన తరువాత ఇప్పుడు ధర్నాలు చేయకుండా వెనక్కి తగ్గితే పార్టీ పరువుపోతుంది. తీరాచేసి ధర్నాలు చేసేక జనాలు రాకపోయినా పార్టీ పరువు పోతుంది. అందుకే ఈ ధర్నాల కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అందరూ చెమటోడుస్తున్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రుణాలు మాఫీ చేయడమే తప్పు, సాధ్యం కాదన్నట్లు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ రుణాలు మాఫి చేయమని ధర్నాలు ఎందుకు చేస్తున్నట్లు? అతను సాధ్యం కాదని చెప్పిన దానిని ప్రభుత్వం సాధ్యమేనని చేసి చూపుతున్నప్పుడు ఇంకా ధర్నాలు ఎందుకు చేస్తున్నట్లు? అతనికి ప్రతీ అంశాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయం చేయడం అలవాటుగా మారింది. అందుకే ఈ పంట రుణాల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. అయితే దాని వలన ఆయనకి ఏమి ప్రయోజనం ఉంటుందో కూడా చెపితే బాగుంటుంది, అని జగన్ కి చురకలు వేసారు.

తితిదే బోర్డులో సభ్యత్వం కోసం నేతల పోటీలు

  ప్రజాసేవకే కాదు దేవుడి సేవకీ ఈ రోజుల్లో పోటీ పెరిగిపోయింది. స్వామి కార్యంతో బాటే స్వకార్యం కూడా నెరవేరుతుంది గాబట్టే దానికీ డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆగస్ట్ నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన తరువాత ఇంతవరకు దానికి కొత్త బోర్డును నియమించలేదు. ఈ నెలాఖరులోగా ఆపని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇంతవరకు తితిదే బోర్డులో చైర్మన్ తో కలిపి మొత్తం 15మంది సభ్యులు ఉండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణాకు కూడా బోర్డులో సభ్యత్వం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంఖ్యను 18కి పెంచేందుకు సిద్దమయ్యారు. అయితే మరో 18 సీట్లు పెంచినా కూడా సరిపోయేలా కనబడటం లేదు. కారణం తితిదే బోర్డులో సభ్యత్వం కోసం పోటీ పెరిగిపోవడమే.   ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన తెదేపా నేతలకు పోటీగా బీజేపీ నేతలు కూడా వస్తున్నారు. వారు కాకుండా తెలంగాణా ప్రభుత్వం తరపున బోర్డులో చోటు కల్పించాలని కొందరు తెరాస నేతలు కోరుతున్నట్లు సమాచారం. ఆంధ్రాకు మూడు, తెలంగాణాకు మూడు సీట్లు అనుకొన్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో ఆ ఆరు సీట్లకీ చాలా మందే పోటీ పడుతున్నారు. వారు సరిపోరన్నట్లు బీజేపీ నేతలు కూడా తమకూ బోర్డులో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.   ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకే కాక దక్షిణాదిన ఉన్న తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల నుండి కూడా ఒక్కో సభ్యుడిని బోర్డులో తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంటే ఆ మూడు రాష్ట్రాలకి మూడు సీట్లు పోయాయన్నమాట. తెలంగాణా తెదేపా నేతలు తమకు కనీసం మూడు సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు రెండు సీట్లు మాత్రమే కేటాయించాలని భావిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా బరిలోకి దిగడంతో తెలంగాణా తెదేపా నేతలు తమ సీట్లను బీజేపీ ఎక్కడ ఎగరేసుకు పోతుందో అని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణా తెదేపా నేతలు సండ్ర వీరయ్య, జి. సాయన్నలతో సహా మరి కొంత మంది పోటీలో ఉన్నారు. ఇక ఆంధ్రాలో అయితే ఆ లిస్టు చేంతాడంత పొడవు ఉంది. గాలి ముద్దు కృష్ణం నాయుడు, సి.యం. రవిశంకర్, చదలవాడ, భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుండి మరో ముగ్గురు పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరులోగా తితిదే బోర్డును ఏర్పాటు చేయవచ్చును. దానిలో ఎవరెవరికి అవకాశం దొరుకుతుందో వేచి చూడాలి.

ఏపీ ప్రభుత్వానికి గన్నవరం రైతులు షాక్

  రాజధాని నిర్మాణానికి భూసేకరణ కోసం తిప్పలుపడుతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి గన్నవరం మండలంలో రైతులు ఊహించని విదంగా పెద్ద షాక్ ఇచ్చారు. గన్నవరంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలనే ఆలోచనతో కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో 417 ఎకరాల భూసేకరణకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ మండలంలో గల అన్ని గ్రామాల రైతులు తమకు కూడా తూళ్ళూరు రైతులకు ఇస్తున్నటువంటి ప్యాకేజీయే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ రేట్ ప్రకారం ధర చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అప్పుడు రైతులు కూడా భూసేకరణం చట్టంలో ఉన్న నియమనిబంధనలను తెలివిగా ఉపయోగించుకొని తమ భూములను ప్రభుత్వ ధర కంటే రెట్టింపు ధరతో రిజిస్ట్రేషన్లు చేయించుకొంటున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 60వేలు ఉన్నట్లయితే, రైతులు దానిని 1.20 లక్షలకి రిజిస్ట్రేషన్ చేయించుకొంటున్నారు.   భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయబడిన ధరను రైతులకు చెల్లించినపుడే వారి భూములు స్వాధీనం చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాక ఆ కారణంగా వారు కోల్పోయిన ఇల్లు, ఫలసాయం ఇచ్చే చెట్లు, ఉపాధి వంటివాటికీ రాష్ట్ర ప్రభుత్వమే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. కనుక అప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా తూళ్ళూరు మండలంలో రైతులకు ఇస్తున్న ప్యాకేజీనే ఇవ్వవలసిఉంటుంది. లేదా భూసేకరణ సంగతి ఇక మరిచిపోక తప్పదు.   ఈ విధంగా రైతులు ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కల్పించారు. విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం సహాయం చేస్తానని హామీ ఇచ్చింది కనుక భూసేకరణకు అవసరమయిన ఈ సొమ్మును కేంద్రాన్నే సమకూర్చమని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు స్థానిక యం.యల్యే. వల్లభనేని వంశీ తెలిపారు. అయితే ఏ సంస్థ నిర్మాణానికయినా, భూమిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది కనుక కేంద్రం కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయకపోవచ్చును. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో భూసేకరణ ఏవిధంగా చేస్తుందో వేచి చూడాలి.

ఏపీలో విద్యుత్ ఫుల్: చంద్రబాబుకే ఫుల్ క్రెడిట్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన మూడు నెలలలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభం అరికట్టిన తీరు గమనిస్తే ఆయన చాలా ముందు చూపుతో చాలా చురుకుగా చర్యలు చెప్పట్టినట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయన స్పీడు మేము అందుకోలేకపోతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పడం అతిశయోక్తికాదనిపిస్తోంది.   చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే డిల్లీ వెళ్లి రాష్ట్రానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టుని సంపాదించుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆ తరువాత కూడా అదే మెరుపు వేగంతో కేంద్రం నుండి అదనపు విద్యుత్, మహారాష్ట్రలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుండి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా వంటివి అన్నీ చక్కబెట్టేయడంతో రెండు మూడు నెలలలోనే రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడగలిగింది. ఆయన కార్యదీక్ష చూసి కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ సైతం మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు.   రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడింది కదాని చంద్రబాబు నాయుడు చేతులు దులిపేసుకోకుండా, 2015-16సం.లలో అవసరమయిన విద్యుత్ కోసం ఇప్పటి నుండే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం గమనిస్తే కామినేని మాటలు నిజమని అంగీకరించక తప్పదు.   వచ్చే ఏడాదిలో ముఖ్యంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే వివిధ విద్యుత్ సంస్థలతో 2,000మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొన్న ఏపీ ట్రాన్స్ కో సంస్థ, తమిళనాడు, ఓడిషా, కర్ణాటక రాష్ట్రాలలో గల 20 ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి అదనంగా ఇంకో 2,100 మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం కూడా ఒప్పందాలు చేసుకొంది. కేవలం ధర్మల్ విద్యుత్ సంస్థల నుండే కాక హైడల్ మరియు సోలార్ (619 మెగావాట్స్) విద్యుత్ ఉత్ప్పత్తి కేంద్రాల నుండి కూడా విద్యుత్ పొందేవిధంగా ఒప్పందాలు చేసుకొన్నారు. తద్వారా విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు.   ఓడిషాలో గ్రిడ్ కో సంస్థ నుండి 300 మెగావాట్స్, కర్ణాటకలోని శాతవాహన మరియు జే.యస్. డబ్ల్యు. నుండి 780 మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొన్నారు. తమిళనాడులోని మీనాక్షి సింహపురి, థర్మల్ టెక్ మరియు జైస్వాల్ పవర్ కంపెనీలతో, ఇతర రాష్ట్రాలలో స్టెరిలైట్, జేపీయాల్, టాటా పవర్, స్టెరిలైట్ ఎనర్జీ, సల్సర్ స్టీల్, వందన విద్యుత్, మరియు జి.యం.ఆర్.ఈ.టి.యల్. విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఒక యూనిట్ రూ. 3.50 నుండి రూ. 4.00 ధరతో విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందాలు జరిగాయి.   అదేవిధంగా కేంద్రప్రభుత్వ సహకారంతో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలలో ఏర్పాటు చేయబడిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో కూడా విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ సోలార్ విద్యుత్ ధర చాలా అధికంగానే ఉంది. ఒక్కో యూనిట్ ధర రూ. 8.22 నుండి రూ. 17.91 వరకు ఉంటుంది. కానీ ఏపీ ట్రాన్స్ కో సంస్థ మాత్రం రూ. 3.70 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన దానిని కేంద్రప్రభుత్వమే సదరు సంస్థకు నేరుగా చెల్లిస్తుంది. ఈ రాయితీ సోలార్ విద్యుత్ పధకంలో తొలుత అనంతపురం నుండి 40 మెగావాట్స్, చిత్తూరులో గల ఎక్మీ సోలార్ నుండి 40 మెగావాట్స్, అనంతపురం, చిత్తూరు మరియు కర్నూలులోగల ఎక్మీ క్లీన్న్ టెక్ నుండి 160 మెగావాట్స్, సింగపూర్ కి చెందిన సన్న్ ఎడిషన్ ఎనర్జీ హోల్డింగ్స్ నుండి 30 మెగావాట్స్, రెయిన్ సిమెంట్స్ నుండి 22 మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందాలు జరిగాయి.   ఇక ప్రస్తుతం కృష్ణపట్నంలో నిర్మాణంలో ఉన్న రెండవ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి త్వరలోనే రాష్ట్రానికి 800 మెగావాట్స్ విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందాలన్నిటి కారణంగా వచ్చే సం.లో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకపోవచ్చునని ఏపీ ట్రాన్స్ కో సంస్థ చైర్మన్ కే. విజయానంద్ తెలిపారు.   ఇవికాక తూర్పు గ్రిడ్ నుండి మరో 2,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంది. కానీ అక్కడి నుండి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్ మిషన్ లైన్లు వేయవలసి ఉంది. అందుకోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు ఇంకా చాలా కాలం పడుతుంది కనుక వచ్చే ఏడాదిలో అక్కడి నుండి విద్యుత్ సరఫరా రాలేకపోవచ్చును. కానీ భవిష్యత్తులో అక్కడి నుండి 2,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు అవకాశం ఉందని స్పష్టమవుతోంది.   ఇరుగు పొరుగు రాష్ట్రాలతో విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంటూనే మరోవైపు రాష్ట్రంలో థర్మల్ మరియు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేస్తున్నారు. వచ్చే ఏడాదికి బయట రాష్ట్రాల నుండి కొంత విద్యుత్ కొనుగోలు చేయవలసి వచ్చినా 2016-17నాటికి రాష్ట్రం విద్యుత్ ఉత్ప్పత్తిలో స్వయం సంవృద్ది సాధించి, ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ సరఫరా చేయగల స్థితికి చేరుకోగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఓసీటీఎల్ కంపెనీ.. ఛలో ఏపీ..

  కామినేని గ్రూప్‌కి చెందిన ఓసీటీఎల్ (ఆయిల్ కంట్రీ ట్యూబులార్ లిమిటెడ్) మెల్లగా తెలంగాణ రాష్ట్రం నుంచి దుకాణం సర్దేసి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం ప్రాంతానికి వెళ్ళిపోయే ఆలోచనలో వుంది. ఈ సంస్థ డ్రిల్లింగ్ పైపుల తయారీలో వుంది. ప్రస్తుతం ఈ కర్మాగారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి దగ్గర వుంది. చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతలో ఉపయోగించే ఐదు రకాల పరికరాలను ఈ సంస్థ తయారు చేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆయిల్ సంస్థలతో ఈ కర్మాగారం అనుబంధాన్ని కలిగి వుంది. ఈ కర్మాగారంలో మొత్తం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తాము తమ కర్మాగారాన్ని తెలంగాణ రాష్ట్రంలో మూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించక తప్పని పరిస్థితులు ఏర్పాడ్డాయని కామినేని గ్రూప్ డైరెక్టర్ కామినేని శశిధర్ చెప్పారు. ఈ కర్మాగారాన్ని తరలించాలని ఆలోచించడానికి దారితీసిన పరిస్థితులను ఆయన వెల్లడించారు.   ఈ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంఘాలన్నీ ఇటీవల ఒక్కటయ్యాయి. అందరూ కలసి నిరంతరం మూకుమ్మడిగా సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెల కారణంగా సంస్థ నష్టాలబాటలో నడుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి సంస్థ యాజమాన్యం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీలు కాలేదు. ఈ సమస్యను పరిష్కరించండి మహాప్రభో అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో ఈ కర్మాగారాన్ని ఏపీకి తరలించాలని అనుకుంటున్నామని శశిధర్ తెలిపారు. ఓసీటీఎల్ కర్మాగారం తయారు చేసే ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు నుంచే ఎగుమతి చేస్తారు. అలాంటప్పుడు ఎంచక్కా కృష్ణపట్నం దగ్గరే కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గడంతోపాటు కార్మికుల సమస్యలు కూడా తీరిపోతాయన్న ఆలోచనలో కంపెనీ యాజమాన్యం వున్నట్టు తెలుస్తోంది. కృష్ణపట్నంతోపాటు విశాఖ, కాకినాడ పోర్టుల సమీపానికి కంపెనీలను తరలించే అవకాశాలున్నట్టు సమాచారం.   కామినేని గ్రూప్‌కి నార్కట్‌పల్లి దగ్గరే ఓసీటీఎల్ కంపెనీ మాత్రమే కాకుండా కామినేని స్టీల్ అండ్ పవర్, యునైటెడ్ సీమ్‌లెస్ ట్యూబులర్ అనే రెండు కంపెనీలు కూడా వున్నాయి. ఈ కంపెనీలను ఈ గ్రూపు 2,500 కోట్ల రూపాయల వ్యయంతో స్థాపించింది. కొద్ది మాసాల క్రితం ఈ కంపెనీలన్నిటినీ మరో మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో విస్తరించాలని కామినేని గ్రూపు భావించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో విస్తరించడం మాట అటు ఉంచి, అన్ని కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కి తరలించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కి తరలించడానికి రెండు వందల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. కర్మాగారాల్లో ఇప్పుడున్న మెషినరీలో 75 శాతం తిరిగి ఉపయోగపడతాయి. అందువల్ల రెండు వందల కోట్లు పోతేపోయాయి.. ఏపీకి వెళ్ళిపోయి మనశ్శాంతిగా కంపెనీలను నడుపకోవాలని కామినేని గ్రూప్ ముఖ్యులు భావిస్తున్నట్టు సమాచారం.

మిస్టర్ జంప్ జగ్గారెడ్డి

  ఇంతకాలం పార్టీలు మారేవారిని ‘జంప్ జిలానీ’ అంటూ వస్తున్నాం. అయితే ఇక నుంచి ‘జంప్ జిలానీ’ అని కాకుండా ‘జంప్ జగ్గారెడ్డి’ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చకచకా పార్టీలు మారేస్తున్నారు కాబట్టి. మొదట్లో జగ్గారెడ్డి బీజేపీలో వున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే వున్నారు. టీఆర్ఎస్ ప్రభంజనం కారణంగా సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరే ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్, జగ్గారెడ్డి ఒకరినొకరు పొగుడుకున్నారు. అయితే ఆ ప్లాన్ ఎందుకో వర్కవుట్ కాలేదు. చివరికి జగ్గారెడ్డి బీజేపీలో చేరారు. నేను మొదట్లో బీజేపీలోనే వుండేవాడిని, తిరిగి మాతృ పార్టీకి వచ్చానని సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పారు. బీజేపీ అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన జగ్గారెడ్డిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా హైకమాండ్ నుంచి అనుమతి కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జగ్గారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడాన్ని సంగారెడ్డి కాంగ్రెస్ వర్గాలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అయినా పొన్నాల తలచుకుంటే ఇవన్నీ మబ్బుల్లా తొలగిపోతాయి. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు. ‘జంప్ జగ్గారెడ్డి’ అనే పేరును సార్థకం చేసుకుంటారు.