Read more!

జీవితం అర్థమవ్వాలంటే ఇది తప్పక తెలుసుకోవాలి!

 

జీవితం అర్థమవ్వాలంటే ఇది తప్పక తెలుసుకోవాలి! 

మనమందరం గొప్పగా జీవించడం గురించి ఆలోచిస్తాం. కానీ నిజానికి ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది . గొప్పగా మరణించడం గురించి! మనమంతా ఎప్పుడూ. మరణం గురించి భయపడుతూవుంటాం. కానీ వాస్తవానికి జీవితం గురించి, ఉన్నతంగా బతకడం గురించి, జన్మను సార్థకం చేసుకోవడం గురించి, జీవితాన్ని ఫలవంతం చేసుకోవడం గురించి భయపడాలి. ఈ చిన్న జీవితాన్ని అర్థవంతంగా ఎలా చేసుకోవాలో, మనం బతుకుతూ ఇతరులను బతక నివ్వడమెలాగో తెలుసు కోవాలి విశేషమేమిటంటే-మన ప్రాచీన భారతీయ గాథలన్నీ మానవ జీవన వికాసం ఎలా ఉండాలో వివరించేవే. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు... ఇలా ఒకటేమిటి ప్రతీదీ మనిషి మనిషిగా బతకడమెలాగో ప్రతి మాట ద్వారా, ప్రతి ఘట్టం ద్వారా, ప్రతి పాత్ర ద్వారా వివరించాయి. మనిషి బతకడానికి డబ్బు కావాలి, మనిషి తన కోరికలూ తీర్చుకోవాలి. ఎటొచ్చీ వీటి విషయంలో ధర్మాధర్మ విచక్షణతో వ్యవహరిస్తూ బాధ్యతల్ని నెరవేర్చి, మానవ కల్యాణం కోసం జీవించాలి.

మహాభాగవతంలో ఆరవ స్కంధంలో చిత్రకేతోపాఖ్యానం అనే కథ ఉంది. చిత్రకేతువు అనే మహారాజు మహా బలవంతుడు, ధనవంతుడు, విశాల రాజ్యం కలిగినవాడు. ఆయనకు చాలామంది భార్యలున్నారు. కానీ ఆ రాజుకి పిల్లలు లేరు. సంతానం లేదన్న చింతతో ఆ రాజు రోజురోజుకీ ఎండాకాలం చెరువులా క్షీణించి పోసాగాడు.

అలాంటి బాధాతప్తుడయిన చిత్రకేతు మహారాజు దగ్గరకు ఓ రోజు అంగిరసుడనే మునీశ్వరుడు వచ్చాడు. విషయం తెలుసుకొన్నాడు. పుత్రకామేష్టి యాగం చేయమని సూచించాడు. ఆ రాజు అలానే చేశాడు. ఆ యజ్ఞశేషాన్ని తన పెద్ద భార్య కృతద్యుతికి అందించాడు. కృతద్యుతి గర్భం ధరించి నవమాసాల తర్వాత ఒక కొడుకుని కన్నది.

సంతానం కలగడంతో రాజు, రాణి - ఇద్దరి ఆనందానికి అవధుల్లేవు. కొడుకు మీద తీవ్రమైన ప్రేమాభిమానాలతో రాజు తన ఇతర భార్యల్ని పట్టించుకోవడం మానేశాడు. దాంతో వారిలోని కుటిలత్వం, క్రూరత్వం బయటకొచ్చాయి. దరిమిలా ఒకానొక రోజున ఎవ్వరూ చూడకుండా ఆ సవతులంతా రాకుమారుడికి విషప్రయోగం చేశారు. పిల్లవాడు నిద్రించిన వాడు నిద్రించినట్లే మరణించాడు.

లేకలేక కలిగిన ఏకైక కుమారుడు, చక్కగా పెరిగి పెద్దవుతున్నవాడు, వంశోద్ధారకుడు... అలా నిర్జీవంగా పడి ఉండడం చిత్రకేతు మహారాజుని, కృతద్యుతిని తీవ్రంగా బాధించింది. వారు విలవిలా ఏడుస్తుండడంతో అంగిరస మహాముని విచ్చేశారు. మరణించిన కొడుకు కాళ్ళదగ్గర నిశ్చేష్టుడై విలపిస్తూ కూచొని ఉన్న రాజుతో ముని పలికిన మాటలు- మరణం గురించి మానవుడు ఎలా ఆలోచించాలో బోధిస్తాయి.

"ఓ మహారాజా! నదిలో ప్రవాహవేగానికి ఇసుక రేణువులు కొట్టుకొని పోతుంటాయి. అవి అక్కడక్కడా కుప్పలు కుప్పలుగా కలుస్తుంటాయి, మళ్ళీ చెదిరిపోతుంటాయి. అట్లే - ప్రాణులు కాలప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉంటారు, పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ ఉంటారు. నేను, నీవు ఇంకా ఇక్కడ ఉన్నవారంతా ఇప్పుడు... ఈ క్షణంలో కలిసి జీవించి ఉన్నాం. కానీ భవిష్యత్లో మృత్యువు కబళించి వేస్తుంది. ఇప్పుడు కలిసి ఉన్నవాళ్ళం అప్పుడు కలిసి ఉండం. చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకొంటూ... ఆడుకొంటూ... అంతలోనే వాటిని వదిలిపెట్టి వేరే ఆటలోకి జారిపోతాడు. అలాగే... మానవ జీవితమంతా ఆటే!"

ఈ మాటల్ని వింటే మనందరికీ ఒక సందేహం వస్తుంది. ఎలాగూ మరణం తప్పదు కాబట్టి ఇక చదువెందుకు, ధనం సంపాదించడం ఎందుకు, అసలు పుట్టడమే ఎందుకు, అని అనిపిస్తుంది. కానీ మరణం గురించిన రహస్యాన్ని... అసలు సత్యాన్ని తెలుసుకొంటే... ఈ నేల మీదకు మనం శాశ్వతంగా ఉండడానికి రాలేదనీ, వెళ్తూవెళ్తూ కనీసం ఒక్క గుండు సూదినైనా పట్టుకుపోలేమనీ, ఉన్నంతలో ఈ జీవితాన్ని సార్థకం చేసుకొనే దిశగా పయనిస్తామనీ, అనవసర వివాదాలు, రాగద్వేషాలు, సంకుచిత స్వార్థాలు ఉండవనీ, మనం వెలుగుతూ ఇతరులకు వెలుగునిస్తూ జీవించడం ఎలాగో నేర్చుకొంటామనీ అర్థమవుతుంది.

                                            *నిశ్శబ్ద.