భగవద్గీతలో ఈ విషయాలు అన్ని వయసుల వారికి గొప్ప పాఠాలు..!
భగవద్గీతలో ఈ విషయాలు అన్ని వయసుల వారికి గొప్ప పాఠాలు..!
భగవద్గీత.. భారతీయులకు అందిన గొప్ప వరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భగవద్గీతను మత పరమైన గ్రంథంగా, ఆధ్యాత్మిక గ్రంథంగానే కాకుండా మానవ జీవితానికి గొప్ప మార్గదర్శక గ్రంథంగా పేర్కొనవచ్చు. ఈ గ్రంథాన్ని అవగాహన చేసుకుని అందులో ఉన్న విషయాలను పాటించాలే కానీ అన్ని మతాలు, అన్ని వయసుల వారు ఎంతో గొప్ప జీవితాన్ని సాగించగలుగుతారు. భగవద్గీతలో ఒక్కో అధ్యాయం ఒక్కో విషయాన్ని బోధిస్తుంది. అయితే ఇందులోని 5 విషయాలు అన్ని వయసుల వారికి సరిపోయే విధంగా, అందరికీ గొప్ప పాఠాలను బోధిస్తాయి. అవేంటో తెలుసుకుంటే..
నీ పని నువ్వు చేసుకో.. ఫలాలను ఆశించకు..
గీత ప్రకారం ప్రతి వ్యక్తి తాను చేసే పనులపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఆ పని చేయడం ద్వారా వచ్చే ఫలితాల గురించి చింతించకూడదు. అలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. కురుక్షేత్ర యుద్దం మొదలయ్యే ముందు అర్జునుడు పరధ్యానంలో ఉన్నప్పుడు, యుద్దం చేయడానికి వెనుకంజ వేసినప్పుడు.. ప్రతి వ్యక్తి ఫలితాలను కోరుకోకుండా, తన విధులను నిర్వర్తించాలని కృష్ణుడు చెప్పాడు. ఆ భగవంతుడు వ్యక్తి చేసే పనిని బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాడు.
సుఖ దుఃఖాలు సమానం..
మనిషి జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలన్నీ ఇంద్రియాలు, వస్తువుల పరస్పర చర్య వల్ల ఉత్పన్నమయ్యేవే. ఈ సుఖ దుఃఖాల మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. దీని వల్ల మనస్సు గందరగోళం పడకుండా ముక్తి మార్గంలో ముందుకు సాగుతుంది. జీవితంలో ఆనందం, దుఃఖం వస్తూనే ఉంటాయి. రెండు పరిస్థితులలోనూ సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. ఆనందంలో అహంకారం లేదా దుఃఖంలో కలత చెందకూడదు.
స్వార్థపూరిత ఉద్దేశాలు వద్దు..
ప్రపంచంలో మనుషులు ఎక్కువగా స్వార్థపూరిత ఉద్దేశ్యాలతో లేదా కోరికలతో జీవిస్తూ ఉంటారు. తను ఒక పని చేయాలన్నా, ఇతరులకు ఏదైనా పని చేసి పెట్టాలన్నా ఖచ్చితంగా ప్రతి ఫలాన్ని ఆశించడం లేదా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా పనిచేయడం వంటివి చేస్తారు. వీటి వల్ల మనస్సు చంచలంగా మారుతుంది. అందువల్ల స్వార్థపూరిత ఉద్దేశ్యాలు లేకుండా వ్యవహరించడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది.
దేవుడిపై నమ్మకం..
దేవునిపై నమ్మకం ఉంచాలి. దేవుడిపై నమ్మకం ఉంచినప్పుడు జీవితం ఎంతో బాగుందనిపిస్తుంది. గీత ప్రకారం దేవునిపై నమ్మకం ఉంచే వ్యక్తి ప్రతి దానికి కలత చెందడం చేయడు. మనస్సు స్థిరంగా ఉండాలంటే దేవుడిపై విశ్వాసం, నమ్మకం కలిగి ఉండటం చాలా అవసరం.
జ్ఞానం..
ప్రతి వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించడానికి నిరంతరం కృషి చేయాలి. జ్ఞానం మనస్సును స్థిరంగా, దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. భగవద్గీతలో మొత్తం ప్రపంచం గురించి జ్ఞానాన్ని అందించే 700 శ్లోకాలు ఉన్నాయి. జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. కానీ గీతలో ప్రస్తావించని సమస్య అంటూ ఏదీ లేదు. భగవద్గీతను అధ్యయనం చేస్తే జీవితంలో ఏ సమస్యకు అయినా సమాధానం దొరుకుతుంది. అలాగే ఎలాంటి పరిస్థితిలో అయినా ఎంతో దృఢంగా ఉండగలుగుతారు.
*రూపశ్రీ.