Read more!

మోక్షం గురించి ఆలోచించేవారు దీన్ని తప్పక తెలుసుకోవాలి....

 

మోక్షం గురించి ఆలోచించేవారు దీన్ని తప్పక తెలుసుకోవాలి....


భగవంతుడిని మనం ఏది కోరుకోవాలి?? అనే సందిగ్ధావస్త చాలా మందిలో ఉంటుంది. పునర్జన్మను ప్రసాదించమని కొరుకోవాలా?? లేక మోక్షం కోసం ప్రార్థించాలా అనేదినర్థం కాదు.  ఏది శ్రేయస్కరమో నిర్ణయించుకోలేని సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు 'భగవంతుడా! నాకు ఏది శ్రేయస్కరమో దానినే ప్రసాదించు తండ్రీ' అని ప్రార్థించడం ఉత్తమం. మనిషిలో వికాసం కలగాలి అంటే అందరూ స్వామి వివేకానంద మాటలను తప్పనిసరిగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. స్వామి వివేకానంద పలు సందర్భాల్లో చెప్పిన కొన్ని మాటలు గమనిస్తే..

 "ఎవరైతే తమ సర్వస్వాన్నీ పరుల కోసం త్యాగం చేస్తారో అలాంటివారి కోసం మోక్షమే వచ్చి తలుపు తడుతుంది. అలా కాకుండా నిరంతరం 'నా ముక్తి, నా ముక్తి' అని వెంపర్లాడే వారికి ఎన్నటికీ శ్రేయస్సు లభించదు”.

 “ఇతరులకంటే ముందు 'నాకు ముక్తి కావాలి' అని భావించేవాడు స్వార్థపరుడు. 'అందరికీ ముక్తి లభించిన తరువాతే నాకు ముక్తి. స్వర్గ సుఖాలు కూడా నాకు వద్దు. ఇతరులకు సహాయం చేయడానికి అవసరమైతే నరకానికి వెళ్ళడానికైనా నేను వెనుకాడను' అని అంటాడు నిస్వార్థపరుడు".

 "నా దేశంలో ఒక్క వీధి కుక్క సైతం ఆకలితో ఉన్నంత వరకూ దాని క్షుద్బాధ తీర్చడమే నా పరమ ధర్మం. సజీవ శివుణ్ణి ఆరాధించడానికి ఎన్ని జన్మలు ఎత్తడానికైనా నేను సిద్ధమే!”. ఇవి వివేకానందుడి మాటలు. ఇవి మాత్రమే కాదు 

దీనికి మరొక ఉదాహరణ..

మహాభక్తుడు ఏకనాథ్ గంగోత్రి నుంచి కావడిలో గంగా జలాన్ని మోసుకొంటూ రామేశ్వరంలోని శివుణ్ణి అర్చించడానికి కాలినడకన బయలుదేరాడు. అలా యాత్ర కొనసాగుతుండగా దారిలో ఒక గాడిద వడదెబ్బకు స్పృహతప్పి పడివుంది. మరణావస్థలో ఉన్న ఆ గాడిదను చూసిన ఏకనాథుడు 'ముందు ఈ సజీవ శివుణ్ణి గంగాజలంతో అర్చించడం ముఖ్యం' అని తలచి కుండలోని గంగాజలాన్ని గాడిద నోట్లో పోశాడు. వెంటనే స్పృహతప్పి పడివున్న గాడిద తేరుకుంది.

ఏకనాథుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల తనకు రాబోయే పుణ్యం, ముక్తి, మోక్షాల గురించి ఏమాత్రమూ ఆలోచించ కుండా తన కళ్ళ ముందు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మూగ జీవిని సాక్షాత్తూ ఆ రామేశ్వరుని అర్చనతో సమానంగా భావించి సేవించాడు.

He who has more of this unselfishness is more spiritual and nearer to Shiva than anybody else. - Swami Vivekananda

'ఎవరిలోనైతే నిస్వార్థ భావం ఉంటుందో వారే గొప్ప ఆధ్యాత్మిక సంపన్నులు. అలాంటి వారే భగవంతునికి అత్యంత సన్నిహితులు' అని అంటారు స్వామి వివేకానంద.

నిజానికి ప్రపంచం, భగవంతుడు వేరుకాదు. ప్రపంచమంతటా నిండి వున్నది ఆ భగవంతుని చైతన్యమే! కాబట్టి సాటి జీవిలో శివుణ్ణి దర్శించి సేవిస్తే ఆ మోక్షమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.

To be unselfish is salvation itself... 'స్వార్థరాహిత్యమే మోక్షం'. ఇదే స్వామీజీ ప్రపంచానికి అందించిన అనుష్ఠాన వేదాంతం. దీన్ని ఆచరణాత్మకం చేస్తే మనం నిత్య ముక్తులమే!

                                          *నిశ్శబ్ద.