మహిళల శారీరక దృఢత్వానికి యోగాసనాలు!

 

మహిళల శారీరక దృఢత్వానికి యోగాసనాలు!

మహిళలకు ఇంటా, బయటా పని చేయడం వల్ల సహజంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలను, పెద్దవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళలపైనే ఉంటుంది. వీటన్నిటి తరువాతే మహిళలు తమ గురించి తాము ఆలోచించుకోగలుగుతారు. ఈ మల్టీ టాస్కింగ్ అనేది మహిళలను శారీరకంగా కూడా డిస్టర్బ్ చేస్తుంది. మహిళలు శారీరకంగా ఎంత దృఢంగా ఉంటే అంత చురుగ్గా ఉంటారు. మహిళలు శారీరకంగా దృఢంగా ఉండటానికి యోగాకు మించి గొప్ప ఆప్షన్ లేదు.

కింది యోగాసనాలు మహిళలను దృఢంగా ఉంచుతాయి.

★చక్రవాకాసనం:- 

దీన్ని కాట్-కౌ-ఫోజ్ అని కూడా అంటారు. చక్రవాకాసనం వేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. మహిళలను ఎక్కువగా  వేధించే సమస్యలలో వెన్ను సమస్య ముఖ్యమైనది అందుకే మహిళలు ఈ చక్రవాకాసనంను రోజూ వేయడం మంచిది.

విధానం!!

◆మెత్తని ప్రదేశంలో మోకాళ్ళ మీద కూర్చోవాలి. 

◆ఇప్పుడు చేతులను ముందుకు చాపి వాటిని అలాగే వంచుతూ నేల మీద ఆనించాలి. 

◆తల, వీపు, పిరుదులు సమాంతరంగా ఉండాలి. 

◆తలను కాస్త కిందకు వంచి మెల్లిగా ఊపిరి వదలాలి. 

ఈ ఆసనాన్ని ఒక నిమిషం పాటు వెయ్యాలి. 

★అర్ధ ఉత్తనాసనం:- 

అర్ధ ఉత్తనాసనం వేయడం వల్ల మహిళల్లో గర్భసంచి దృఢంగా మారుతుంది. జీర్ణసంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా మలబద్దకాన్ని నివారిస్తుంది.

విధానం!!

◆నిటారుగా నిలబడుకోవాలి.

◆రెండు కాళ్ళ మధ్య ఒకటి లేదా ఒకటిన్నర అడుగుల దూరం పాటించాలి.

◆ నడుము భాగంలో వంచి వీపును సమాంతరంగా ఉంచి చేతులు కిందకు వదలాలి.

◆శరీర బరువును కాలి వేళ్ళమీద ఉండేలా చూసుకోవాలి.

◆ఈ ఆసనాన్ని ఒక నిమిషం పాటు చేయాలి.

గమనిక:- నెలసరిలో ఉన్న మహిళలు, రక్తస్రావం అవుతున్నవారు, కళ్ళు తిరిగే సమస్య ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు.

★అర్ధ చక్రాసనం:-

అర్ధ చక్రాసనం వేయడం వల్ల భుజాలు, నడుము బలంగా తయారవుతాయి. కాళ్ళలో బలం పెరుగుతుంది.

విధానం!!

◆నిటారుగా నిలబడుకోవాలి.

◆ పాదాల మధ్య ఎలాంటి ఖాళీ ఉండకుండా దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.

◆ రెండు చేతులను మెల్లిగా పైకి ఎత్తి సూర్య నమస్కార భంగిమలోకి వెళ్ళాలి.

◆ రెండు అరచేతులు కలిపి ఉంచి మెల్లగా వీలైనంత వరకు వెనక్కి వంగాలి. వెనక్కి పడకుండా శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అదే భంగిమలో కొన్ని సెకెన్ల పాటు ఉండాలి.

★బాలాసనం:-

బాలాసనం వేయడం వల్ల ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఒత్తిడి తగ్గడం వల్ల మహిళల్లో చాలావరకు సమస్యలు దూరమవుతాయి. ఇంకా మహిళల్లో నెలసరి సమస్యలు కూడా బాలాసనం వల్ల పరిష్కారం అవుతాయి.

విధానం!!

బాలాసనం వేయడం చాలా సులభం.

◆ మొదటగా మెత్తని ప్రాంతంలో కూర్చోవాలి. పచ్చికమీద లేదా, మెత్తని వస్త్రం పరచుకుని మోకాళ్ళ కూర్చోవాలి. 

◆ పాదాలను నేలకు అలాగే ఆనించి పాదాల మీద పిరుదులు ఉండేలా కూర్చోవాలి. ఇలా కూర్చున్న భంగిమను వజ్రాసనం అని అంటారు.

◆ తరువాత నెమ్మదిగా ముందుకు వంగి తల నుదురు భాగాన్ని నేలకు తాకేలా చేయాలి.

◆ రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపి అదే భంగిమలో నెమ్మదిగా శ్వాసక్రియ జరపాలి.

◆ ఈ ఆసనం వేస్తున్నంత సేపు శరీరాన్ని బిగుతుగా ఉంచకుండా వదులుగా ఉంచుకోవాలి.

◆ ఈ ఆసనాన్ని ముప్పై నుండి అరవై సెకెన్ల పాటు వేయాలి.


పైన చెప్పుకున్న ఆసనాలను మహిళలు ప్రతిరోజు వేస్తుంటే శరీరం ఎంతో దృఢంగా ఉంటుంది.


                                      ◆ నిశ్శబ్ద.