Read more!

మత్స్యాసనంతో మహిళలకు ఎన్ని లాభాలో...

 

మత్స్యాసనంతో మహిళలకు ఎన్ని లాభాలో...

రోజులో ఎన్నో పనులు. అటు ఇటు తిరుగుతూ ఇంటి పని, పిల్లలు, ఉద్యోగాలు. బ్యాగులు మోసుకుంటూ వెళ్ళాలి, ఇంట్లో బరువులు ఎత్తాలి, పిల్లలు ఎత్తుకోమని మారాము చేస్తే వారిని ఎత్తుకుని తిప్పాలి. భుజాలు, మెడ చెప్పలేనంత నొప్పి పెడతాయి. మందులు తెచ్చి వేసుకుంటే అప్పటికి మాత్రమే కాస్త తేలికపడతారు. తరువాత అంతా మొదటికి వస్తుంది కథ. ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా యోగానే… యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉంటాయి. వీటిని ఆచరించడం వల్ల మహిళల శరీరంలో ప్రతి భాగం పటిష్టమై శరీరం తేలిక అవుతుంది. దీనికోసం అందరూ చెయ్యాల్సిన ఆసనం ఒకటి ఉంటుంది. అదే మత్స్యాసనం. ఈ మత్స్యాసనం వేస్తుంటే మహిళలను వేధించే థైరాయిడ్ సమస్య తుర్రుమని పారిపోతుంది. ఇది మాత్రమే కాకుండా దీనివల్ల వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి మత్స్యాసనం ఎలా వెయ్యాలి?? ఏ సమయంలో వెయ్యాలి?? వంటి విషయాలు తెలుసుకోవాల్సిందే….

మత్స్యం అంటే చేప. ఈ ఆసనం చేప భంగిమలో ఉంటుంది. అందుకే దీన్ని మత్స్యాసనం అని పిలుస్తారు. ఈ ఆసనం ఎలా వేయాలంటే….

మొదట మంచి స్థలం చూసుకుని యోగా మ్యాట్ లేదా మెత్తని దుప్పటి పరచుకుని పద్మాసనం వేసుకుని  కూర్చోవాలి. పద్మాసనం అంటే కుడి కాలిని ఎడమతొడ మీద, ఎడమ కాలిని కుడితొడ మీద వేసుకుని కూర్చోవాలి.

రెండు చేతులను తలకు రెండు వైపులా తీసుకువచ్చి భుజాలను వీలైనంత వరకు పైకి లేపి మెల్లగా తలను వెనక్కు వంచుతూ తలను నేలకు ఆనించాలి. 

ఇప్పుడు రెండు చేతులతో ఎడమ చేతితో కుడి కాలి బొటన వేలిని, కుడి చేతితో ఎడమ కాలి బొటన వేలిని పట్టుకోవాలి. 

బరువును చేతుల మీద వేసి తలను వీలైనంత కిందకు జరుపుతూ భుజాలను, ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. 

ఇలాంటప్పుడు తల కింద భాగం విల్లులాగా వంగి ఉంటుంది. 

ఇది వేయడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. చేయలేము అనుకున్న వారికి మరొక ప్రత్యామ్నాయ మార్గం ఉంది. 

రెండు చేతులనూ తలకు ఇరువైపులా పెట్టుకుని, భుజాలను పైకి లేపి, తలను నేలకు ఆనించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే కొద్దిరోజులలోనే పద్మాసన స్థితిలో ఈ ఆసనం వేయడం అలవాటు అవుతుంది. 

ఈ ఆసనం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే….

మెడ, భుజాల ప్రాంతంలో నొప్పులు క్రమంగా తగ్గుతాయి. అంతేకాకుండా ఆ ప్రాంతాలలో కండరాలు బలంగా మారతాయి. 

మహిళలు సాధారణంగా ఎదుర్కొనే ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. 

మహిళల్లో నెలసరి సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గుముఖం పడతాయి. 

పొట్ట భాగంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఒకవేళ పొట్ట భాగంలో కొవ్వు పేరుకుని ఉంటే అది క్రమంగా తగ్గిపోతుంది.

జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఈ మత్స్యాసనం చక్కగా ఉపయోగపడుతుంది.

శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం వ్యాధి ఉన్నవారికి మత్స్యాసనం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 

అన్నిటికంటే ముఖ్యంగా మత్స్యాసనాన్ని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు వేస్తుంటే ఎంతో వేధించే థైరాయిడ్ సమస్య తగ్గుముఖం పడుతుంది. థైరాయిడ్ వల్ల అప్పటికే వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. 

                                       ◆నిశ్శబ్ద.