ఆడవారి చేతులకు అందాన్ని చేకూర్చే ఆసనాలు!

 

ఆడవారి చేతులకు అందాన్ని చేకూర్చే ఆసనాలు!

మహిళలు తమ రోజువారి ఇంటి పనులలో చాలా శాతం చేతులతో చేసేవే ఎక్కువ ఉంటాయి. అందువల్ల వారి చేతులు చాలా తొందరగా బలహీనం అవుతుంటాయి చేతి కండరాలు నొప్పిగా ఉండటం, చేతుల్లో ఎముకలు బలహీనం అవ్వడం, అది కాస్తా ఎముకలు పెలుసుబారడానికి దారి తీస్తుంది. ఇలా బలహీనమైన చేతులతో ఇంకా ఇంకా పనులు కొనసాగిస్తే అప్పుడు చేతులు ఇంకా ఎక్కువ దెబ్బతిని చివరికి పనులు చేయలేని స్థాయికి చేరుకుంటారు.

సాధారణంగా చాలామంది మహిళలు ఇంట్లో ఎక్కువ పనులు చేస్తున్నాం ఇదే బోలెడు వ్యాయామం అనుకుంటారు. కానీ అది చాలా తప్పని మహిళా ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మహిళల ఆరోగ్యానికి ఖచ్చితంగా వ్యాయామం అనేది తప్పనిసరిగా ఉండాలని, అది ఎంతో గొప్పగా సహాయపడుతుందని తెలిపారు. కొందరు తెలిసో తెలియకో వ్యాయామాలు చేసేటప్పుడు కూడా పొరపాట్లు చేసేస్తుంటారు. అలాంటి వాళ్ళు తిరిగి పనులు చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. 

అయితే మహిళల చేతులను దృఢంగా ఉంచుకోవడానికి యోగాలో అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల బలమైన చేతులు మాత్రమే కాకుండా చేతుల ఆకృతి కూడా ఎంతో బాగుంటుంది.  

చేతులకు బలాన్ని, అందాన్ని ఇచ్చే అయిదురకాల ఆసనాలు!!

భుజాంగాసనం:-

ఈ ఆసనం వేయడం కష్టమేమి కాదు. మొదట ఆసనాలు వేయడానికి మెత్తని దుప్పటి లేదా యోగా మ్యాట్ వేసుకోవాలి. 

బోర్లా పడుకోవాలి. అరచేతులను నేలమీద ఉంచి బలం ప్రయోగిస్తూ మెల్లగా తల నుండి మొదలుపెట్టి నడుము వరకు పైకి లేపాలి. ఆ భంగిమలో 25 నుండి 30 సెకెన్లు ఉన్న తరువాత తిరిగి మామూలు స్థితికి రావాలి. ఇదే భుజంగాసనం.

ఈ ఆసనం వల్ల భుజానిలు, చేతులు, చేతి ఎముకలు బలపడతాయి. అంతే కాకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి పొట్ట కండరాలు బలపడతాయి.

అధోముఖ శ్వనాసన:-

ఈ ఆసనాన్ని డౌన్ వార్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్ అంటారు. కుక్క నిలబడుకుని ఉన్నప్పుడు ఉండే భంగిమనే కొద్ది మార్పులు చేస్తే ఈ ఆసనాన్ని వేయచ్ఛు. 

కాళ్ళమీద ముందుకు వంగి దూరంగా సాగి రెండు చేతుల సహాయంతో ఉండాలి. వి(v) ఆకారాన్ని తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందప్పుడు. ఇప్పుడు తలను మెల్లగా లోపలికి తీసుకుని నేలకు ఆనించాలి. ఇదే అధోముఖ శ్వనాసన. 

ఇది కాళ్ళు మరియు చేతులలో లేత కండరాలను బలంగా మారుస్తుంది.భుజాల పట్టుత్వాన్ని పెంచుతుంది. 

యోగాలో ఉత్తమమైన ఆసనంగా దీన్ని పేర్కొంటారు.

అర్ద పింఛ మయూరాసనం:-

దీన్నే డాల్ఫిన్ పోజ్ అని కూడా అంటారు.

ఇది అధోముఖ శ్వనాసన లాగే ఉంటుంది. అయితే అరచేతులతో కాకుండా మోచేతుల నుండి మణికట్టు వరకు ఉన్న భాగంను నేలమీద ఉంచాలి. అలాగే కాలి మడమను పైకి లేపి కాలి వ్రేళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నం చేయాలి. ఆ భంగిమలో కొద్దిసేపు ఉండి తిరిగి మామూలు స్థితికి రావాలి.

మోచేతులు, కాలి కండరాలు గట్టిపడతాయి.

పూర్వోత్తానాసనం:-

మొదట పద్మాసనంలో కూర్చోవాలి. తరువాత కాళ్ళను ముందుకు చాపాలి. రెండుకాళ్లను ముందుకు చాచి రెండు చేతులూ శరీరానికి ఇరుపక్కలా ఉంచుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నడుము భాగాన్ని పైకి లేపాలి. ఆ భంగిమలో కొన్ని సెకెన్లు ఉండి తరువాత మామూలు స్థితికి రావాలి.

చేతులు బలంగా మారడమే కాకుండా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.

ధనురాసనం:-

శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని వెనుకకు వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని చేయాలి.

బోర్లా పడుకొని రెండు కాళ్ళను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి. కొద్దిగా శ్వాస పీల్చి తలను, కాళ్ళను పైకి ఎత్తాలి. పొట్ట మాత్రం నేలమీద ఉంటుంది. తరువాత కొద్ది సేపు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి

చేతులు, భుజాలు దృడంగా మారతాయి.

ఈవిధంగా పైన చెప్పుకున్న అయిదు ఆసనాలు వేస్తుంటే చేతులు దృడంగా మారడమే కాకుండా మంచి ఆకృతిలో అందంగా మారతాయి.

                                        ◆నిశ్శబ్ద.