విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన తులసి.. వినాయకుడి పూజలో నిషిద్దం ఎందుకంటే..!

 

విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన తులసి.. వినాయకుడి పూజలో నిషిద్దం ఎందుకంటే..!


తులసి అనగానే విష్ణువే గుర్తుకు వస్తాడు.  తులసి ఆరాధన, తులసి కోట దగ్గర దీపం పెట్టడం, విష్ణువు ఆరాధనలో తులసిని వాడటం,  కనీసం విష్ణువుకు నైవేద్యం పెట్టాలన్నా అందులో తులసి తప్పనిసరిగా వేయడం.. ఇవన్నీ తులసికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పకనే చెబుతాయి.  తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కనుకనే తులసిని ఆరాధిస్తే విష్ణువు సంతృప్తి చెందుతాడు. అలాగే తులసిని విష్ణువుకు అర్పిస్తే లక్ష్మీదేవి కూడా తృప్తి చెంది అనుగ్రహం ఇస్తుంది. ఇంతటి పుణ్యప్రదమైన తులసిని వినాయకుడి పూజలో వాడకూడదు అని చెబుతారు. దీని వెనుక ఒక ఆసక్తి పురాణ కథ ఉంది. అందేంటో తెలుసుకుంటే..

తులసి భూలోకంలో వృషధ్వజుడు అనే రాజుకు జన్మించింది. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ.  లక్ష్మీదేవి ఒక శాపం వల్ల భూలోకంలో తులసిగా జన్మిస్తుంది.  భూమి మీద  మానవ జన్మ ఎత్తినా ఆ అమ్మకు  విష్ణువంటే ప్రేమ పోలేదు.  మహా విష్ణువు అంటే ఆమెకు అపారమైన ప్రీతి ఉండేది.  ఎలగైనా సరే.. మహావిష్ణువునే వివాహం చేసుకోవాలని అనుకుంది. అందుకోసం తపస్సు చేయడం మొదలు పెట్టింది.  అయితే బ్రహ్మ దేవుడు ప్రత్యక్షం అయ్యి.. నువ్వు ఈ జన్మ ఎత్తడానికి ఒక కారణం ఉంది.  కాబట్టి నువ్వు కలియుగాంతం వరకు భూమి పైనే ఉండి ఆ తరువాత వైకుంఠం వెళతావు అని చెబుతాడు. ఈ మాట వినగానే పాపం తులసి కన్నీరు మున్నీరవుతుంది. నేను తపస్సు చేసింది ఇందుకోసమా అని రోదిస్తుంది. అప్పుడు బ్రహ్మ దేవుడు తులసితో.. బాధపడకు.. నువ్వు ఈ జన్మలో కూడా విష్ణువు అంశ కలిగిన వ్యక్తినే పెళ్లాడతావు అని వరం ఇచ్చాడు. దీంతో తులసి సంతోషించింది.


బ్రహ్మ చెప్పిన తర్వాత విష్ణువు అంశ కలిగిన వ్యక్తి ఎవరో, ఎక్కడ ఉన్నాడో అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ,  ఆ వ్యక్తికోసం నిరీక్షిస్తూ ఉండేది తులసి.  ఒక రోజు వినాయక చవితికి ఋషులు అందరూ వినాయకుడి ప్రతిమను తయారు చేసి, ఆయన్ను ఆరాధించడం మొదలు పెట్టారు.  మొదటగా శుక్లాం భరదరం అనే శ్లోకం తో ప్రార్థన మొదలుపెట్టారు.  అందులో విష్ణుం శశివర్ణం అనే వాక్యంలో విష్ణుం అనే మాట తులసి చెవిన పడింది.  విష్ణుం అంటే విశ్వవ్యాపకమైన శక్తి అని అర్థం. విష్ణువైనా, గణపతి అయినా ఒకే శక్తికి భిన్నమైన రూపాలని అర్థం. కానీ తులసి మాత్రం విష్ణుం అని వినగానే.. గణపతే విష్ణువు అంశ అనుకుంది. వెంటనే పరుగున వెళ్లి వినాయక విగ్రహాన్ని కౌగిలించుకోబోయింది.  ఋషులు అందరూ ఆమెను వారిస్తున్నా ఆమె వినిపించుకోలేదు.  విగ్రహ రూపంలో ఉన్న వినాయకుడు కూడా తన రూపాన్ని తీసుకుని ఆమె ముందు ప్రత్యక్షమై అమ్మా నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాడు.  కానీ ఆమె వినలేదు.  వినాయకుడిని ఆర్తితో, ఎంతో భక్తిపూర్వకంగా కౌగిలించుకుంది. దీంతో వినాయకుడికి కోపం వచ్చింది.  కానీ ఋషులు మాత్రం ఆమెకు విష్ణువు మీద ప్రీతి ఎక్కువ ఉండటం వల్ల అలా చేసింది, ఆమెను క్షమించండి అని వినాయకుడికి నచ్చజెప్పాలని చూశారు.  కానీ ఆమె మాత్రం ఎవ్వరి మాటలను పట్టించుకునే స్థితిలో లేదు. మీరే నా పతి అని చెప్పి వినాయకుడి మెడలో హారం వేసింది.

తులసి వినాయకుడి మెడలో హారం వేసేసరికి  ఎంత వారించినా వినకుండా మోహంలో నువ్వు నా మెడలో హారం వేస్తావా, రాక్షసిలాగా ప్రవర్తిస్తావా, రాక్షసుడే నీకు భర్త అవుతాడు అని శపించాడు. వెంటనే ఆమె స్పృహలోకి వచ్చి జరిగిన పొరపాటు తెలుసుకుని ఏడ్చింది.  ఋషులు కూడా ఆమెకు మద్దతుగా మాట్లాడుతూ స్వామి ఆమె విష్ణువును చేరుకోవాలనే ఆతృతలో అలా చేసింది తప్ప కామంతో కాదు.. అందుకే ఆమెను క్షమించండి అని అన్నారు. దాంతో వినాయకుడు శాంతించాడు.  ఇకమీదట నువ్వు ఎప్పుడూ తులసి మాల రూపంలో విష్ణువును అలంకరించుకుని ఉండు  విష్ణువుకు కూడా తులసి మాల అంటేనే ప్రీతి అవుతుంది అని వరం ఇచ్చాడు.  అప్పుడు తులసి వినాయకుడితో.. స్వామి నాకు వరం ఇచ్చారు,  దయచేసి మీ పూజలో కూడా నన్ను భాగం చేసుకోండి అని అడిగింది. అప్పుడు వినాయకుడు.. వినాయక చవితి పూజలో మాత్రం తులసిని వాడవచ్చు,  మిగిలిన రోజుల్లో తులసిని నా పూజలో వాడటం దోషం అని అన్నారు. అందుకే వినాయక చవితిలో కూడా కొందరు తులసిని వాడరు.

                           *రూపశ్రీ.