విజయ ఏకాదశి.. తులసితో ఈ పరిహారాలు చేస్తే పేదరికం తొలగిపోతుంది..!
విజయ ఏకాదశి.. తులసితో ఈ పరిహారాలు చేస్తే పేదరికం తొలగిపోతుంది..!
విజయ ఏకాదశి ఉపవాసం ఫిబ్రవరి 13, 2026 శుక్రవారం నాడు మాఘ మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి రోజున పాటిస్తారు. ఈ రోజు విష్ణువు ఆరాధిస్తారు. లంకను జయించడానికి ముందు రాముడు కూడా విజయ ఏకాదశి ఉపవాసం పాటించాడని చెబుతారు. అన్ని ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే, విజయ ఏకాదశి ఉపవాసం విష్ణువును పూజించడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజ, ఉపవాసం, దానం చేయడం వల్ల పాపాలను నిర్మూలించడానికి, శత్రువులను జయించడానికి, జీవిత కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. విజయ ఏకాదశి నాడు తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ పరిహారాల వల్ల విష్ణువు, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతారు. అవేంటో తెలుసుకుంటే..
తులసి, నెయ్యి దీపం..
విజయ ఏకాదశి నాడు ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఉదయం కుదరకపోతే కనీసం సాయంత్రం అయినా నెయ్యి దీపం పెట్టాలి. ఇది లక్ష్మీదేవి, విష్ణువు ఇద్దరినీ ప్రసన్నం చేసుకుంటుంది. కానీ ఏకాదశి నాడు తులసిని తాకకూడదు, కోయకూడదు.
తులసి ప్రదక్షిణ..
విజయ ఏకాదశి నాడు తులసి మొక్క ప్రదక్షిణ చేయడం శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్క చుట్టూ ఏడు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయవచ్చు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం మంచిది.
నైవేద్యం..
ఏకాదశి పూజ సమయంలో విష్ణువుకు అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే తులసి లేకుండా విష్ణువు పూజ పూర్తి కాదు. కాబట్టి, విజయ ఏకాదశి నాడు విష్ణువుకు సమర్పించే ప్రసాదం పైన, నీటిలో, పానకం వంటి పానీయాల పైన తులసి దళాలు ఉంచాలి. అయితే ఈ దళాలను ముందురోజు సేకరించి ఉంచుకోవడం వల్ల పూజ రోజు ఎలాంటి తప్పు చేయాల్సిన అవసరం ఉండదు.
పూజ..
మహా విష్ణువుకు తులసి దళాలు అన్నా, తులసి మాలలు అన్నా.. చాలా ప్రీతి. అందుకే పూజ సమయంలో సాధారణ పువ్వుల కంటే కూడా తులసి దళాలను సమర్పిస్తే మహా విష్ణువు సంతృప్తి చెందుతాడు.
*రూపశ్రీ.